తిరుగులేని యోధ తాంతియా భీల్
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరుగున పడిన పోరాట వీరులను గుర్తించి ‘ఆజాదీ
తాంతియా భీల్ అరెస్టు విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ 1889 నవంబర్ 10 సంచికలో ప్రధానంగా ప్రచురించింది. ఆయనను 'రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించింది. తాంతియాకు ప్రతిరూపంగా చెక్కబొమ్మలను ఉంచి, వాటినే తాంతియా సమాధిగా భావించి ప్రజలు నివాళులర్పిస్తారు. ఈ దారిన నడిచే రైలును లోకో పైలట్ ఇక్కడ తాంతియా మామకు గౌరవసూచకంగా ఒక్క నిముషం నిలిపి ముందుకు కదులుతారు. నేటికీ నిమాడ్, మాల్వా ప్రాంతాలలోని ఆదివాసీ ప్రజలు తాంతియాను ఆరాధిస్తారు. వీర్ తాంతియా, భీల్ వంటి సాహస యోధుల ఉజ్వల సాహసాల, త్యాగాల చరిత్రలకు సమున్నత స్థానాన్ని కల్పించడమే వారికి అర్పించగల నిజమైన నివాళి.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరుగున పడిన పోరాట వీరులను గుర్తించి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో వారికి విశిష్ట స్థానం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండోర్‌లోని పాతాల్ పానీ రైల్వేస్టేషన్‌కు ఆదివాసీ వీరుడు 'తాంతియా భీల్'' పేరు పెట్టారు. ఇంతకీ తాంతియా భీల్ ఎవరు? ఆయన పోరాట స్ఫూర్తి ఎలాంటిది? మననం చేసుకోవాల్సిన తరుణమిది.
ప్రతీకారానికి ప్రతినబూని
స్వాతంత్ర్య పోరాట వీరులలో తాంతియా తోపే గురించి తెలిసినంతగా 'తాంతియా భీల్' గురించి తెలియదు. మన దేశంలో తెల్లవాడి పాలన మొదలైన నాటి నుంచి కడదాకా రాజీ లేకుండా ఎదిరించింది ఆదివాసీలే. వలస పాలన కాలమంతటా దేశంలో ఎక్కడో ఒకచోట వారు తెల్లవారి పైకి తమ విల్లు సంధిస్తూనే వచ్చారు. చరిత్ర విస్మరించిన ఆ మహత్తర పోరాటాలలో భిల్లుల తిరుగుబాట్లను (1882-1857, 1874-1889) ప్రత్యేకించి చెప్పుకోవాలి. నేడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో విస్తరించి ఉన్న భిల్లు, బిలాలా, బరేలా, మంకర్ తదితర ఆదివాసీలను 'భిల్లులని' అంటారు. 1874-1889 మధ్య భిల్లుల తిరుగుబాటుకు నేతృత్వం వహించిన తాంతియా భీల్ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సమీప గ్రామంలో జన్మించారు.
అసలు పేరు 'టుండారా' దృఢకాయులైన తేవరులు శరీర సౌష్టవం, వారికి దీటైన యుద్ధ పాటవం కలిగిన టుండారాకు 'తాంతియా' అనే పేరు స్థిరపడింది. తెల్లవారి పాలనలో అటవీ సంపదపై హక్కులు కోల్పోయిన భిల్లులు సామంతులు. జమీందారుల దోపిడీ పీడనలకు, అవమానాలకు గురయ్యారు. దీంతో తాంతియా తన వారికి జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవటానికి ప్రతినబూనారు. తాంతియా తోపేతో 1857 సెప్టెంబర్ 15 న తాంతియా భిల్‌కు పరిచయం ఏర్పడింది. గెరిల్లా పోరాటం లో నైపుణ్యం సాధించి విల్లంబులు, కత్తి, డాలు వంటి సంప్రదాయక ఆయుధాలతో బగడావి, తేవరుల అండదండలతో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు నడిపాడు. నిరక్షరాస్యులైన ఆదివాసీలు స్వాతంత్య్ర పోరాటంలో ముందున్నారని చెప్పడానికి తాంతియా భీల్ ఒక ఉదాహరణ.
Also read: ఇంతకీ ఆదివాసీలదే మతం?
ఆయనను శివాజీతో పోల్చి
పులుల్లా కదిలే తేవరులు తోడు కావడంతో తాంతియా దావానలమై చెలరేగాడు. ఒకేసారి ఐదారు శత్రు స్థావరాలపై హఠాత్తుగా దాడిచేసి మెరుపు వేగంతో దెబ్బతీసి తప్పించుకుపోయే ఎత్తుగడలతో బ్రిటిషు వాళ్లకు సింహస్వప్నమయ్యేవాడు. బ్రిటిష్ ధనాగారాలను దోచి పేదలకు పంచిపెట్టేవాడు. అందుకే ఆదివాసీలు తాంతియాను 'మామ' గా పిలిచేవారు. ఇలాంటి ఎత్తుగడల వలనే తాంతియాను 'శివాజీ' తో పోల్చేవారు. రెండు సార్లు జైలుకు వెళ్లి తప్పించుకుని వచ్చిన తాంతియా జీవిత గమనాన్ని మార్చుకున్నాడు. సామంతుల, జమీందారుల, భూస్వాముల సంపదను దోచి పేద ప్రజలకు పంచేవాడు. అందుకే బ్రిటిష్‌వారు తాంతియా మీద బందిపోటు ముద్ర వేశారు. ఆయనను బంధించడం కోసం 'తాంతియా బెటాలియన్' ను నియమించారు 1878-1885 మధ్య తిరుగుబాటు ఉధృతంగా సాగింది. తదుపరి అది కాస్తా సన్నగిల్లింది. తన సోదరి భర్త గణపత్ నమ్మక ద్రోహంతో తాంతియా బ్రిటిష్‌వారి చేతికి చిక్కాడు.
1889 అక్టోబర్ 19న తాంతియాను ఉరి తీసి మృతదేహాన్ని ఇండోర్ సమీపాన ఖాండ్వా మార్గంలోని పాతాల్ పానీ రైల్వే స్టేషన్ సమీపాన విసిరేసినట్టు చెబుతారు. తాంతియా భీల్ అరెస్టు విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ 1889 నవంబర్ 10 సంచికలో ప్రధానంగా ప్రచురించింది. ఆయనను 'రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించింది. తాంతియాకు ప్రతిరూపంగా చెక్కబొమ్మలను ఉంచి, వాటినే తాంతియా సమాధిగా భావించి ప్రజలు నివాళులర్పిస్తారు. ఈ దారిన నడిచే రైలును లోకో పైలట్ ఇక్కడ తాంతియా మామకు గౌరవసూచకంగా ఒక్క నిముషం నిలిపి ముందుకు కదులుతారు. నేటికీ నిమాడ్, మాల్వా ప్రాంతాలలోని ఆదివాసీ ప్రజలు తాంతియాను ఆరాధిస్తారు. వీర్ తాంతియా, భీల్ వంటి సాహస యోధుల ఉజ్వల సాహసాల, త్యాగాల చరిత్రలకు సమున్నత స్థానాన్ని కల్పించడమే వారికి అర్పించగల నిజమైన నివాళి.
(నేడు తాంతియా భీల్ వర్ధంతి)
గుమ్మడి లక్ష్మీనారాయణ
సామాజిక రచయిత
94913 18409