నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగ దాడికి, శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమలర, నా తెలంగాణ పోవుచున్నది పథాన' అంటూ తెలంగాణపై అవ్యాజ్య ప్రేమను ప్రకటించుకున్నారు దాశరథి. 'తెలంగాణమున గడ్డి పోచయు సంధించు కృపాణం' అంటూ ఈ ప్రాంత పౌరుషాన్ని ఎలుగెత్తి చాచారు. 'చల్లని సముద్ర గర్భంలో బడబాగ్నిని, నల్లని ఆకాశంలోని సూర్యులను చూడగలిగారు. 'మా నిజాము రాజు తరతరాల బూజు' అని నిరంకుశ రాచరికాన్ని ధిక్కరించిన ఉద్యమ కవి. తెలంగాణ గడ్డపై అగ్నిధారలు కురిపించి, రుద్రవీణ మీటుతూ, తిమిరంతో సమరానికీ వెనుకాడని పోరు యోధుడు మహాకవి దాశరథి.
అనుభవాలే అక్షరాలుగా
సమకాలీన సామాజిక చైతన్యం నుంచే గొప్ప కవులు పుడతారు. సమాజంలో వినూత్న కదలికలను కలిగించే శక్తి సామర్ధ్యాలు ఉన్నవారిని గొప్ప కవులని పిలుస్తాం. వీరు రెండు రకాలు. కండ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేక, యుద్ధరంగంలో స్వయంగా స్వైర విహారం చేసుకుంటూ కసి, బాధ, కోపం, రోశాన్ని కవితాక్షరాలుగా మరల్చేవారు మొదటి రకం. ప్రపంచంలో ఎక్కడో జరిగిన ఉద్యమాలతో ప్రేరణ పొంది, ఆ ఉద్యమాలను ఆవాహన చేసుకొని, మన సమాజంలో రావాల్సిన మార్పులు, చైతన్యం కోసం రచనలు చేసేవారు రెండో రకం. వీరిద్దరి మధ్య తల్లిపాలకు, డబ్బా పాలకు ఉన్నంత తేడా ఉంటుంది. స్వీయ అనుభవాలు అక్షర రూపం దాల్చితే అవి దావానంలా మండుతూ చైతన్య కాంతులు వెదజల్లుతుంటాయి. ఈ కోవకు చెందినవారే దాశరథి కృష్ణమాచార్య.1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు.
తెలంగాణలో అభ్యుదయ కవిత్వం ఈ ప్రాంత సామాజిక పరిణామ సహజ ఫలితంగా వచ్చింది. హృదయంలో జ్వలించిన భావనలతో అక్షరాల నిప్పులు చిమ్ముకుంటూ కదిలిన విప్లవ కవి ఆయన. ఆవేశం, ఆవేదన సహజం. ఒక చేతిలో గన్ను ఇంకొక చేతిలో పెన్నును నిరంతరం కదిలించిన సాహసి. మనసుకు, మాటకు, రాతకు సంధానకర్తగా, తెలంగాణ స్వాభిమాన ప్రతీకగా నిలిచిన గొప్ప కవి. దశాబ్దకాలం ఉద్యమ జీవితం, పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. 'ఓ నిజాం పిశాచమా కానరాడు నిను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ నినదించారు. 'సాహిత్యంలో దాశరథి కూర్చుంటే చార్మినార్ అంత, నిలబడితే కుతుబ్ మినార్ అంత' అన్నారు ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి.
జనాన్ని జాగృతం చేసుకుంటూ
ఆకారంలో వామనుడైనా, ఆంతర్యంలో త్రివిక్రముడై విశ్వరూపం ధరించారు దాశరథి. బాల్యం నుంచీ ధిక్కార స్వరమే. ఇంటిలో కచ్చితంగా సంస్కృతం మాట్లాడాలని తండ్రి నియమం పెడితే విభేదించి, తెలుగు మాట్లాడి తెలుగుపై ప్రేమను పెంచుకున్నారు. పాఠశాలలో నిజాం ప్రార్థనకు బదులు వందేమాతరం పాడిన ధీశాలి. 18 ఏళ్ల ప్రాయం నుంచే నిజాంకు వ్యతిరేకంగా ఊరూరు తిరుగుతూ జనాలను చైతన్య పరిచారు. జాగీరుదారులు, దొరలు, దేశ్‌ముఖ్‌లు, నిజాం తొత్తులు తనను మట్టుపెట్టాలని ప్రయత్నాలు చేసినా భయపడలేదు.
1944లో ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి వార్షికోత్సవం వరంగల్‌లో నిర్వహిస్తుండగా, దానిని భగ్నం చేయాలని నిజాం సైనికులు నిప్పు పెట్టారు. ఆ మంటల వేడి నుంచే 'ఓ పరాధీన మానవా' అంటూ దాశరథి చేసినా కవితా విన్యాసం అక్కడున్న ప్రేక్షకులను నిర్ఘాంత పరిచింది. కవి కేసరిలా ఆ రోజు దాశరథి కవితాగ్ని గోళాలు మండించారు. అరెస్టు చేసి నెల్లికుదురు స్టేషన్‌కు తీసుకువెళితే, అక్కడి నుంచి 'ఏ పొలమున నిరుపేదకు తిండి దొరకదో ఆ పొలంను కాల్చేయండి' అంటూ ఇక్బాల్ రాసిన కవితను ఉర్దూ నుంచి తెలుగులో చదువుతూ అడవులకు పారిపోయారు. మరోసారి అరెస్టు చేసి వరంగల్, నిజామాబాద్‌లో నిర్బంధించారు. నిజామాబాద్ జైలులోనే ఆయనకు రచయిత వట్టికోట ఆళ్వారుస్వామితో పరిచయం ఏర్పడింది.
ఉద్యమంలో రణనినాదమై
పండ్లు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతో జైలు గోడల మీద అద్భుత కవిత్వం రాశారు దాశరథి. సిమెంట్ కలిపిన రొట్టెలు తినడంతో జీర్ణ వ్యవస్థ ఖరాబైంది. అయినా, ధిక్కార స్వరం మాత్రం పోలేదు. 'ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి, మంచి మాగాణం సృజించి, ఎముకలు నుసి చేసి, భోషాణము నవాబుకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికం దక్కునే' అంటూ గర్జించాడు. ఏడాదిపాటు జైలు జీవితం గడిపారు. తరువాత ఉమ్మడి రాష్ట్రం ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు. 'ఇద్దరు మిత్రులు' సినిమాతో 1961లో సినీ రంగ ప్రవేశం చేశారు.
సినీ పరిశ్రమ ఆయనను వీణ, భక్తి పాటలకు మాత్రమే వినియోగించుకున్నది. విప్లవ గీతాలు రాసే అవకాశం రాలేదు. అతని భావాలు అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్టు ఆకర్షిస్తాయి. 25 కవితా సంపుటాలు వెలువరించారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, పార్సీ భాషలలో రచనలు చేశారు. అగ్నిధార, రుద్రవీణ ,మహాంధ్రోదయం, పునర్నవం ,మహాబోధి, తిమిరంతో సమరం తదితరాలు గొప్ప రచనలు. 'తిమిరంతో సమరం' రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1977 నుంచి ఏపీ ఆస్థాన కవిగా ఉన్నారు. ఈయన రచనలు మలిదశ ఉద్యమంలో రణనినాదమై నిలిచాయి. 'అన్నార్తులు, ఆనాథలుండని ఆ నవయుగమదెంత దూరం? కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో?' అన్న ఆయన ప్రశ్నలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. 1987 నవంబర్ ఐదున దాశరథి మనలను వీడిపోయారు.
(నేడు దాశరథి జయంతి)
ములక సురేశ్
తెలంగాణ వికాస సమితి
94413 27666