ఆత్మహత్యలకు గల కారణాలేంటి?
ప్రపంచంలో ఎవరికైనా తమ జీవితంలో వెనక్కి తీసుకోలేనిది గడిచిపోతున్న కాలం. రెండవది ప్రాణం. నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి క్షణికావేశంలో
చాలా చిన్న కారణాలకే కొందరు ఉసురు తీసుకుంటున్నారు. పాశ్చాత్య ప్రభావం, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం కూడా కారణమే. గతంలో తీవ్ర సమస్య ఎదురైనపుడే మాత్రమే అఘాయిత్యానికి ఒడిగట్టేవారు. ఇప్పుడు చిన్న సమస్యకూ చావే పరిష్కారమనుకుంటున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వలన ఏ ఇబ్బంది వచ్చినా అందరూ కలిసి చర్చించుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలను మానవ సంకల్పంతో నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ప్రపంచంలో ఎవరికైనా తమ జీవితంలో వెనక్కి తీసుకోలేనిది గడిచిపోతున్న కాలం. రెండవది ప్రాణం. నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి క్షణికావేశంలో ప్రాణం తీసుకుంటున్నాడు. గెలవడం ధ్యేయం కావాలి. కానీ, ప్రతి ప్రయత్నం గెలుపే కావాలని లేదు. ఓటమి ఎదురైనపుడు జీవితం వృధా అనుకుంటే, భవిష్యత్ శూన్యంలా కనిపిస్తుంది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే జీవితం విలువ ఏమిటో తెలుస్తుంది. 'సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం అందులోనే ఉంటుంది.
సమస్య రాగానే గాబరపడి పడిపోయి ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు' అన్నారు జిడ్డు కృష్ణమూర్తి. నేడు దేశంలో ఆత్మహత్య జాతీయ సామాజిక సమస్యగా మారిపోయింది. దేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యల గురించి ఆగస్టు చివరి వారంలో 'నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)' 2021 వార్షిక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం గత యేడాది 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్న 56,544 మంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యలలో ఇది 34 శాతం. 30-45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 53,044 మంది ప్రాణాలు తీసుకున్నారు. వీరి శాతం 31.72. దేశంలోని ఆత్మహత్యలలో తెలంగాణ 6.2 శాతంతో ఆరో స్థానంలో ఉంది.
పురుషులే ఎక్కువ
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో యేటా ఎనిమిది లక్షల మందికి పైగా, అంటే ప్రతి 30 సెకనులకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతీ నాలుగు ఆత్మహత్యలలో ఒకటి భారత్‌లోనే నమోదవుతోంది. భారతదేశంలో సగటున రోజూ 450 మంది, గంటకు 18.7 మంది, నిమిషానికి ముగ్గురు బలవుతున్నారు. పురుషులు సగటున రోజుకి 326 మంది , గంటకు 13.6 మంది, ప్రతి 4.4 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళలు మాత్రం సగటున రోజుకి 124 మంది, గంటకు 5.1 మంది, అనగా ప్రతి 12 నిమిషాలకు ఒక మహిళ ప్రాణాలు తీసుకుంటున్నది.
2021లో ఆత్మహత్య చేసుకున్న పురుషులు 1,18,979 కాగా, మహిళలు సంఖ్య 45.260. సహనానికి మారుపేరైన మహిళ కష్టాలలోనూ అంతే మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, లేత ప్రాయంలో అమ్మాయిలు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. పురుషులు మాత్రం కష్టాలు రాగానే డీలా పడిపోతున్నారు. 2021లో దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.రోజూ సగటున 36 మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు 10,881 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 5,318 మంది రైతులు 5,563 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. మొత్తం ఆత్మహత్యలలో వీరి వాటా 6.6 శాతం. ఇవి ప్రభుత్వాలు చెప్పే లెక్కలు మాత్రమే. నిజమైనవి ఇంకా ఎక్కువగా ఉంటాయి.
నగరాలలో
దేశంలోని 53 మెగా నగరాలలో 25,891 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్యధికంగా 2,760, చెన్నయిలో 2,699, బెంగళూరులో 2,292, ముంబయిలో 1,436 మంది బలవన్మరణం చెందారు. తెలంగాణలో ఆత్మహత్యల రేటు 26 శాతంగా ఉంది. దేశంలో రోజువారీ కూలీలు నలుగురిలో ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ౨
021లో ఆత్మహత్య చేసుకున్న వారిలో 11.0 శాతం నిరక్షరాస్యులు, 15.8 శాతం ప్రాథమిక స్థాయి వరకు, 19.1 శాతం మధ్య స్థాయి వరకు, 24 శాతం మెట్రిక్ వరకు చదువుకున్నారు. 16.2 శాతం ఉన్నత విద్య, 1.2 శాతం డిప్లొమా, 4.6 శాతం గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్, అంతకంటే ఎక్కువ చదువుకున్నవారు ఉన్నారు. డిప్రెషన్, మాదకద్రవ్యాల వినియోగం, సైకోసిస్ వంటి మనోవిక్షేప వ్యాధులకు సంబంధించి ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయి .
చిన్న సమస్యలకే
చాలా చిన్న కారణాలకే కొందరు ఉసురు తీసుకుంటున్నారు. పాశ్చాత్య ప్రభావం, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం కూడా కారణమే. గతంలో తీవ్ర సమస్య ఎదురైనపుడే మాత్రమే అఘాయిత్యానికి ఒడిగట్టేవారు. ఇప్పుడు చిన్న సమస్యకూ చావే పరిష్కారమనుకుంటున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం వలన ఏ ఇబ్బంది వచ్చినా అందరూ కలిసి చర్చించుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.
ఆత్మహత్యలను మానవ సంకల్పంతో నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కుటుంబ సమస్యలతో 33.2 శాతం, అనారోగ్యంతో 18.6 శాతం, మాదక ద్రవ్యాలు/ మద్యంతో 6.4 శాతం, వివాహ సమస్యలతో 4.8 శాతం, ప్రేమలు, పెళ్లిళ్ల కారణంగా 4.6 శాతం, దివాళా లేదా రుణభారంతో 3.9 శాతం, పరీక్షలలో వైఫల్యంతో 1.0 శాతం, నిరుద్యోగంతో 2.2 శాతం, వృత్తి/కెరీర్ సమస్యలతో 1.6 శాతం, ఆస్తి వివాదంతో 1.1 శాతం, ప్రియతముల మరణాలతో 1.2 శాతం, పేదరికంతో 1.1 శాతం ఆత్మహత్యలు నమోదవుతున్నాయి.
ఇలా అయితే అనుమానించాల్సిందే
రోజువారీ జీవితంలో విపరీత మార్పులు. ఓ చోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతుండడం. ఏ పని మీదా ఆసక్తి లేకపోవడం. చేసే పనిమీద ఏకాగ్రత లేకపోవడం. ప్రతి చిన్న విషయానికి ఆగ్రహం చెందడం. కుటుంబ సభ్యులు, స్నేహితులపై తరచూ అసహనం వ్యక్తం చేయడం. దిగాలుగా, దుఃఖంతో ఉండడం. చీకటిలో ఎక్కువ సేపు ఒంటరిగానే గడపడం, ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఇష్టపడడం, రాత్రిపూట మెలకువగా ఉండడం.
ఏమీ సాధించలేకపోయాననే నిర్వేదం, తాను బతకడం వలన ఎవరికీ ఉపయోగం లేదనుకోవడం. ఇతరులపై భారంగా ఉన్నామని భావించడం. ఆత్మహత్య గురించి పదే పదే మాట్లాడటం, ఆత్మహత్య చేసుకునే మార్గాలను వెతకడం తదితర లక్షణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. మానసిక నిపుణులు. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు దృష్టి సారిస్తే సరిపోతుంది. వారిని ఆత్మహత్యలకు దూరంగా ఉంచవచ్చు.
(నేడు ఆత్మహత్యల నివారణ దినం)
డా. బి. కేశవులు. ఎండీ
కన్వీనర్, తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ
చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మేధావుల సంఘం
85010 61659