ప్రముఖ చిత్రకారుడు అనబత్తుల వెంకన్న గురించి తెలుసా?
దేవుడు ఎలా ఉంటారో తెలియని ప్రపంచానికి దేవుడి రూపాన్ని చూపించిన గొప్ప చిత్రకళాకారుడు రాజా రవివర్మ. పురాణేతిహాస గ్రంథాలలోని దేవతలను
దేవుడు ఎలా ఉంటారో తెలియని ప్రపంచానికి దేవుడి రూపాన్ని చూపించిన గొప్ప చిత్రకళాకారుడు రాజా రవివర్మ. పురాణేతిహాస గ్రంథాలలోని దేవతలను, వారి ఆకారాలను ఎంతో గొప్పగా ఊహించుకొని అద్భుత ఆలోచనతో తన కుంచె ద్వారా దేవతల రూపాలకి ప్రాణం పోసిన కళాకారుడు ఆయన. మనం నిత్యం పూజలు చేసే దేవతల విగ్రహాలను ఆయన గీసిన చిత్రాల ఆధారంగానే రూపొందించారంటే అతియోశక్తి కాదు. దేశ చిత్రకళను ప్రపంచ వ్యాప్తి చేయడమే కాకుండా, ఆ కళకు అరుదైన గౌరవం తీసుకొచ్చారు.
ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ఖండాతర ఖ్యాతి పొందాయి. ఆయనలాగే చిత్రకళే ప్రవృత్తిగా చేసుకుని కళాఖండాలను ఆవిష్కరించారు అనబత్తుల వెంకన్న. బాల్యం నుంచే అవిశ్రాంత సాధనతో ప్రపంచ స్థాయిలో గొప్ప చిత్ర కళాకారుడిగా ఎదిగారు. బంగారు పతకాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో సాధించిన అనబత్తుల వెంకన్న తెలంగాణకు చెందిన వారు కావడం గర్వించదగ్గ విషయం.
ఆయన శిక్షణతో
అనబత్తుల వెంకన్నది సూర్యాపేట జిల్లాలోని గుమ్మడవెల్లి గ్రామం. చేనేత కుటుంబం. అనబత్తుల నారాయణ, నాగలక్ష్మి దంపతులకు 8 మార్చి 1969 న జన్మించారు. సొంత ఊరిలో ఏడవ తరగతి వరకు చదివారు. ఆ సమయంలోనే గీసిన చిన్న చిన్న చిత్రాలను చూసి తల్లిదండ్రులు సంతోషించి ప్రోత్సహించేవారు. నెల్లికుదురులో తన చిన్నమ్మ వద్ద ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు. అక్కెర కరుణ సాగర్ వద్ద చిత్రకళలో శిక్షణ పొందారు. ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలో టి. సుధాకర్ రెడ్డి దగ్గర గ్రాఫిక్స్‌లో శిక్షణ పొందారు.
వెంకన్న చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ విద్యను, చిత్రకళను రెండింటినీ కొనసాగించారు. ఆంధ్ర యూనివర్సిటీ పెయింటింగ్ విభాగంలో డిగ్రీతో పాటు థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లొమా అందుకున్నారు. ఎంఎస్ యూనివర్సిటీ బరోడాలో ఎంఏ గ్రాఫిక్స్ చేశారు. గొప్ప చిత్రకళాకారుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తండ్రి నేత కళాకారుడైతే, తనయుడు మాత్రం గొప్ప చిత్ర కళాకారుడిగా అవార్డులు పొందడం గొప్ప విషయం.
పలు అవార్డులు
1995లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ టీజీటీ ఆర్ట్స్ టీచర్‌గా పని చేశారు. హైదరాబాద్ కేవీ-2 ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరారు. 2004 వరకు కేవీ-1 గొల్కొండ, లంగర్‌హౌస్‌లో పనిచేశారు. 2004 ఫిబ్రవరిలో బోట్స్‌వానా దేశానికి డిప్యూటేషన్‌పై వెళ్లి ఐదు సంవత్సరాలు అక్కడి విద్యార్థులకు చిత్రకళలో మెళకువలు నేర్పారు. ఆఫ్రికా ఆయనను అత్యున్నత 'ఆర్టిస్ట్ ఇన్ బోట్స్‌వానా' అవార్డుతో సత్కరించింది. 1987లో ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్‌లో మొదటి బహుమతి, 1988 లో భారతీదాసన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కాలికట్ యూనివర్సిటీ, మధురై కామరాజ్ యూనివర్సిటీ, హైలీ కమెండబుల్ సర్టిఫికెట్ అవార్డు, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి 'ఆచార్య సేవ పురస్కార్', 'రీజినల్ ఇంటెన్సివ్ అవార్డు' బెస్ట్ టీచర్ అవార్డు, యాక్టివ్ టీచర్ అవార్డు, బెస్ట్ ఆర్టిస్ట్, డిస్ట్రిక్ట్ ఆర్టిస్ట్ అవార్డు, బాపూజీ స్మృతి పురస్కార్ అవార్డు పొందారు. గోల్డెన్ ఫ్రేమ్ అవార్డు పొందారు. కేవీఎస్ నేషనల్ ఇన్సెంటివ్ అవార్డు, అంతర్జాతీయ ఆర్ట్ సొసైటీ చేత గోల్డ్ మెడల్, హానరీ డాక్టరేట్ అవార్డు, డైమండ్ రత్న, కళారత్న, 'ఆర్టిస్ట్ ఇన్ బోట్స్వానా' వంటివి పొందారు.
ఇలా ఎన్నో అవార్డులు గెలుచుకున్న వెంకన్న 'తెలంగాణ విముక్తి' చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నారు. అనబత్తుల కుంచె నుండి జాలువారిన 'భద్రాచలంలో 'పవిత్ర స్నానం' అనే చిత్రాన్ని గోదావరి పుష్కరాల సమయంలో తిలకించనివారు లేరు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ మీద తను గీసిన చిత్రాలకు ఎందరో ప్రముఖులు ఆకర్షితులై నారు. అనబత్తుల మరిన్ని చిత్రాలను గీయాలని కోరుకుందాం.
కోట దామోదర్
93914 80475