మైనారిటీల సంక్షేమం మాటలకే పరిమితమా?
మైనారిటీల సంక్షేమం మాటలకే పరిమితమా?... special editorial on minority welfare day
విద్య, ఉద్యోగ. ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాలలో వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. సచార్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి. రాష్ట్రంలోనూ ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రకటిస్తామన్న హమీ, 12 శాతం రిజర్వేషన్ హమీలు ఏమయ్యాయో తెలపాలి. ముస్లిం ప్రజలు కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రాజ్యాంగ ప్రసాదిత హక్కుల సాధనకు రాజ్యాంగబద్ధంగా పోరాడాలి. ముస్లింలలో చైతన్యం రానంత కాలం పాలక పక్షాలు వారిని ఓటు బ్యాంకులుగానే పరిగణిస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాలి.
దేశంలోని పౌరులందరికీ ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా సమాన హక్కులు, సమాన అవకాశాలు అందాలని రాజ్యాంగం చెబుతుంది. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తున్నాయా? అన్నది సమాధానం వెతకాల్సిన ప్రశ్న. ఎందుకంటే 75 యేళ్ల స్వతంత్ర దేశంలో ఒక పెద్ద మానవ సమూహం వివక్షకు, అన్యాయానికి, అవకాశాల లేమికి, పీడనకు, హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నది. నిజానికి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడారు. అందులో ముస్లింల పాత్ర కూడా ఉంది. ప్రాణాలకు తెగించి బ్రిటిష్ ముష్కరులతో పోరాడిన ముస్లిం వీరులు చరిత్రలో ఉన్నారు. అసంఖ్యాక మంది త్యాగధనుల బలిదానాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించి దేశం లౌకిక ప్రజాస్వామ్యం వైపు ప్రస్థానం పయనించింది.
ఈ దుస్థితికి కారణం వారే
నిజానికి దేశం బానిసత్వం నుంచి విముక్తి పొందిన తరువాత ప్రజల జీవితాలు మారిపోవాలి. వారి జీవన ప్రమాణాలు అనూహ్యంగా మెరుగుపడాలి. కానీ, మన దేశంలోని ముస్లింల పరిస్థితి అలా లేదు 'గొర్రె తోక బెత్తెడు' అన్న చందంగా ఉంది వారి అభివృద్ధి. వారి జీవన ప్రమాణాలలో చెప్పుకోదగిన మార్పులేవీ అంతగా సంభవించలేదు. ఇప్పటికీ వారిలో ఆత్మనూన్యత, అభద్రతా భావం వెంటాడుతూనే ఉంది. అనుమానపు దృక్కులు చిత్రవధ చేస్తూనే ఉన్నాయి. వారు తినే తిండి, తొడిగే బట్ట విషయంలో కూడా స్వతంత్రత లేకుండా పోయింది. మూకదాడులు, ఆస్తుల విధ్వస్వంతో పోయిన వారి ప్రాణాలు పోగా, మిగిలిన వారి జీవితాలు దుర్భరమవుతున్నాయి. అసలే పేదరికంతో మగ్గుతున్న జాతికి ఇది 'గోరు చుట్టుపై రోకలి పోటు' ఇప్పటికీ దేశ ముస్లిం జనాభాలో 60 శాతం మంది దారిద్ర్య రేఖ దిగువన దుర్భర జీవనం గడుపుతున్నారు. అత్యధిక శాతం మందికి సరైన జీవనోపాధి అవకాశాలు లేవు. కూడు, గూడు కోసం ఇప్పటికి పోరాడాల్సిన పరిస్థితి ఉంది.
అక్షరాస్యత శాతం తక్కువే. ప్రభుత్వ ఉద్యోగులు, చట్ట సభలలో కాలు మోపినవారు అతి తక్కువే. వారి జీవన పరిస్థితులపై ఎన్నో కమిటీలు, కమిషన్‌లు వివరంగా తెలియజేసి, పరిష్కారాలు, చేపట్టవలసిన చర్యలను సిఫార్సు చేశాయి. అయినా, ప్రభుత్వాలకు వారి సంక్షేమం పట్టదు. ముస్లింల ఈ దుస్థితికి ప్రభుత్వ పాలకవర్గాలే కారణమన్నది జగమెరిగిన సత్యం. అన్ని పార్టీలు వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని లబ్ధి పొందాయి తప్ప, వారి సంక్షేమం మాటలే తప్ప చేతలలో లేదు. జస్టిస్ గోపాల్ సింగ్ కమిషన్ మొదలు జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ వరకు వారిని మభ్యపెట్టడానికి లేదా ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కమిటీలు నివేదికలు ఇచ్చి పదహారేళ్ల కాలం గడిచింది.
హక్కుల సాధన కోసం పోరాడాలి
అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు, అభివృద్ధి ఫలాలు లభించినప్పుడే స్వతంత్ర భారత భావనకు పరిపూర్ణత చేకూరుతుంది. అలా కాకుండా దేశంలోని ఏ ఒక్క వర్గం ప్రజలైనా వివక్షకు పక్షవాతానికి, అణచివేతకు, అవకాశాల లేమికి, న్యాయ నిరాకరణకు గురైతే దేశం ప్రగతి-వికాసాల బాటలో పయనించడం, నాగరిక లక్షణాలతో విలసిల్లడం అసాధ్యం. పాలక పక్షాలు ఇప్పటికైనా స్పందించి దేశ ప్రజలకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులని అందించాలి. ముస్లింలకు ఇతర వెనుకబడిన వర్గాల వలె సంక్షేమ చర్యలు తీసుకోవాలి. జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. వారి సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం వలే ముస్లింలకు అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. వారికి సబ్ ప్లాన్, మైనారిటీ కార్పొరేషన్, ఎడ్యుకేషన్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా, ఉర్దూ అకాడమీ వంటివి కల్పించాలి. వక్ఫ్ బోర్డు పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకొని, అన్యాక్రాంతమైన భూములను తిరిగి రాబట్టాలి. విద్య, ఉద్యోగ. ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాలలో వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. సచార్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలి. రాష్ట్రంలోనూ ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రకటిస్తామన్న హమీ, 12 శాతం రిజర్వేషన్ హమీలు ఏమయ్యాయో తెలపాలి. ముస్లిం ప్రజలు కూడా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రాజ్యాంగ ప్రసాదిత హక్కుల సాధనకు రాజ్యాంగబద్ధంగా పోరాడాలి. ముస్లింలలో చైతన్యం రానంత కాలం పాలక పక్షాలు వారిని ఓటు బ్యాంకులుగానే పరిగణిస్తాయన్న విషయాన్ని తెలుసుకోవాలి.
(నేడు జాతీయ మైనారిటీల సంక్షేమ దినోత్సవం)
ఎండీ. ఉస్మాన్ ఖాన్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99125 80645