కుటుంబం మొత్తం ప్రజలకే అంకితం! అలాంటి అమ్మ మళ్లీ పుడుతుందా!?
కుటుంబం మొత్తం ప్రజలకే అంకితం! అలాంటి అలాంటి అమ్మ మళ్లీ పుడుతుందా!?... special editorial on mallojula madhuramma
మావోయిస్టు పార్టీ అగ్ర నేతలుగా ఉన్న కిషన్‌జీ, వేణు ఓసారి తల్లికి బహిరంగ లేఖ రాశారు. 'అమ్మా మమ్ముల కన్నందుకు నీకు విప్లవ వందనాలు. కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు తుడవడానికి మేము విప్లవబాట ఎంచుకున్నాము. తిరుగుబాటు నాన్న రక్తం నుండి వచ్చింది. అమ్మ నేర్పిన నీతి కథలన్నీ పేదల పక్షం వహించడానికి మమ్ములను ప్రోత్సహించాయి' అంటూ సాగిన ఆ లేఖ అందరినీ కదిలించింది. విప్లవ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాలలో ఆ అన్నదమ్ములు అమ్మకు రాసిన లేఖ కోట్లాది మందిని చదివించింది. విప్లవాభిమానులు, విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు, అనేక అభ్యుదయ భావ సంఘాలన్నీ వందలసార్లు మదరమ్మను కలిసి ఆమెకు పాదాభివందనం చేసినవారే.
అమ్మా...ఆ సమాధుల వైపు ఎందుకలా తొంగి చూస్తున్నవ్.. నీ కొడుకు ఆ సమాధులలో లేడమ్మా, అటు చూడు జనం గుండెలలో అమరుడై ఉన్నాడు' చారుమజుందార్ సమాధి వద్ద విలపిస్తున్న ఆయన తల్లి నభామితను ఉద్దేశించి ప్రముఖ కవి శివసాగర్ అన్న మాటలు ఇవి. ఇవాళ మన మధ్య నుంచి అనంత లోకాలకు వెళ్లిపోయిన మల్లోజుల మధురమ్మ లేకపోతే... ఆమె మాతృత్వం వల్లనే కదా కోటేశ్వరరావు, వేణుగోపాలరావు పీడిత ప్రజలకు నాయకులయ్యారు. బెల్లంపల్లిలో గజ్జల లక్ష్మమ్మ లేకుంటే గజ్జల గంగారం, గజ్జల సరోజ సమసమాజ స్థాపన కోసం ప్రాణాలను అర్పించి ఉండే అవకాశం లేదు. ఓ కొడుకుని, కూతురిని కని, పెంచిన గజ్జల లక్ష్మమ్మ గంగారం బాటలోనే జీవితకాలం ప్రజా సంఘాలలో ప్రజల కోసం పని చేసింది.
నల్లమలలోని మార్కాపురం డివిజన్‌లో కొడుకు పాండురంగారెడ్డితో పాటు, ముగ్గురు కూతుళ్లను ఏకకాలంలో పార్టీలోకి సాగనంపిన మరో తల్లి సమసమాజ స్థాపన కోసం ప్రాణాలను అర్పించింది. ఇలా, ఒక్కరా ఇద్దరా వందల వేల సంఖ్యలో అసమానతలు లేని సమాజం కోసం జరుగుతున్న పోరాటంలో తమ పిల్లలను సాగనంపిన చరిత్ర తల్లులకున్నది. అందులో ఒక మాతృమూర్తి మల్లోజుల మధురమ్మ.
అనంత కష్టాలు పడి కూడా
తెలుగు రాష్ట్రాలలో మల్లోజుల మధురమ్మ పేరు తెలియనివారు లేరు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వరావు అలియాస్ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతికి జన్మనిచ్చిన మాతృమూర్తిగా మల్లోజుల మధురమ్మ అందరికీ సుపరిచితురాలే. మంగళవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. దాదాపు నూరు వసంతాలు తన జీవితంలో ఎన్నో కష్టాలను కళ్లారా చూశారు. ఆనాటి రజాకార్ల పోరాటం నుంచి ఇప్పటి మావోయిస్టుల వరకు ఎన్నో పోరాటాలను చూశారు. వాటి ద్వారా కష్టాలను సైతం ఎదుర్కొన్నారు. అనుభవించారు కూడా.
తెలంగాణ సాయుధ పోరాటంలోనే తన భర్త వెంకటయ్యను రజాకార్లు వేధించారు. తన కడుపున పుట్టిన కొడుకులు నక్సల్స్‌గా మారి ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదిగారు. భారత విప్లవోద్యమంలో కోటేశ్వరరావు, వేణుగోపాలరావుది ఓ ప్రధాన పాత్ర. కొడుకుల ఆచూకీ కోసం పోలీసులు అనేకసార్లు వేధించారు. 1976లోనే ఇద్దరు సోదరులు అడవి బాట పట్టారు. ఎమర్జెన్సీ నుంచి ఆ కుటుంబం అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డది. ఆ తర్వాత కొడుకుల ఆచూకీ కోసం తల్లిని, తండ్రిని, సోదరుడైన ఆంజనేయశర్మను వేధించారు. వాటన్నింటిని తట్టుకొని ఆ కుటుంబం నిలబడింది.
గుడిసెలో జీవితం
1987లో పెద్దపల్లి డీఎస్‌పీ బుచ్చిరెడ్డి హత్య జరిగింది. ప్రతీకారంగా పోలీసులు వందలాది ఇండ్లను కూల్చివేశారు. మధురమ్మ ఇంటిని సైతం నేలమట్టం చేశారు. దీంతో ఆమె గ్రామస్తుల సహకారంతో గుడిసె వేసుకొని అందులోనే నాలుగేళ్లు నివసించారు. కొడుకులు విప్లవోద్యమంలో ఉండి ఏ రోజు కూడా ఇంటికి రాకపోయినా, వారు ప్రజల మధ్య అడివిలో క్షేమంగా ఉంటే చాలని కోరుకున్నారు. కొడుకులు చేస్తున్న పోరాటానికి ఆమె దాదాపు మద్దతుగానే ఉండేవారు. 'పీడిత తాడిత ప్రజల కోసం అడవిబాట పట్టారు. అక్కడ వేలు, లక్షల మంది తల్లుల మధ్య క్షేమంగా ఉన్నారు అంతే చాలు' అని అంటుండేవారు.
పెద్ద కొడుకు కోటేశ్వరరావు 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆ విషయం తెలిసి మధురమ్మ కుంగిపోయారు. పోలీసులే తన కొడుకుని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని కన్నీటి పర్యంతమయ్యారు. కండ్ల ముందు కొడుకు శవాన్ని చూసి తట్టుకోలేకపోయారు. 'చిన్న కొడుకు అయినా క్షేమంగా ఉంటే చాలు' అంటుండేవారు. అందరి తల్లుల మాదిరిగానే 'కొడుకులు కంటి ముందు తాను పోతే సంతోషం' అనేవారు.
అందరినీ కదిలించిన లేఖ
మావోయిస్టు పార్టీ అగ్ర నేతలుగా ఉన్న కిషన్‌జీ, వేణు ఓసారి తల్లికి బహిరంగ లేఖ రాశారు. 'అమ్మా మమ్ముల కన్నందుకు నీకు విప్లవ వందనాలు. కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు తుడవడానికి మేము విప్లవ బాట ఎంచుకున్నాము. తిరుగుబాటు నాన్న రక్తం నుండి వచ్చింది. అమ్మ నేర్పిన నీతి కథలన్నీ పేదల పక్షం వహించడానికి మమ్ములను ప్రోత్సహించాయి' అంటూ సాగిన ఆ లేఖ అందరినీ కదిలించింది. విప్లవ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాలలో ఆ అన్నదమ్ములు అమ్మకు రాసిన లేఖ కోట్లాది మందిని చదివించింది. మధురమ్మ అనేక సందర్భాలలో పత్రికలలో కనిపించేవారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ప్రభుత్వం సన్మానిస్తే ముందుగా మధురమ్మకే సత్కారం లభించేది.
విప్లవాభిమానులు, విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు, అనేక అభ్యుదయ భావ సంఘాలన్నీ వందలసార్లు మదరమ్మను కలిసి ఆమెకు పాదాభివందనం చేసినవారే. మంగళవారం మల్లోజుల మధురమ్మ అనంత లోకాలకు వెళ్లిన విషయం తెలుసుకున్న విప్లవాభిమానులు, పౌరహక్కుల సంఘాలు, విరసం ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలందరూ పెద్దపల్లి లోని మల్లోజుల ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి విప్లవ గొప్పతనాన్ని, త్యాగాలను వర్ణిస్తూ మాట్లాడారు. తన పెద్ద కొడుకు కిషన్‌జీకి అంతిమ సంస్కారం నిర్వహించిన స్థలం పక్కనే మధురమ్మకు అంతిమ సంస్కారం పూర్తి చేశారు. 'మల్లోజుల వెంకటయ్యకు, కోటేశ్వరరావుకు, మాతృమూర్తి మధురమ్మకు జోహార్లు' అనే నినాదాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. అమ్మకు కన్నీటి నివాళి
కట్టా నరేంద్రాచారి
పెద్దపల్లి
63030 73400