ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతల దుస్థితికి కారణం ఎవరు?
భారతదేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి మార్గంగా వస్త్ర, చేనేత రంగాలను ప్రజలు ఎంచుకున్నారు. బ్రిటిష్ పాలనలో విదేశీ వస్త్రాల
భారతదేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి మార్గంగా వస్త్ర, చేనేత రంగాలను ప్రజలు ఎంచుకున్నారు. బ్రిటిష్ పాలనలో విదేశీ వస్త్రాల దిగుమతితో చేనేత రంగం కుదేలైంది. లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో స్వాతంత్య్ర సమరయోధులంతా మహారాజా మహీందర్ చంద్ర నందీ నేతృత్వంలో 7 ఆగస్టు 1905న కలకత్తాలోని ప్రముఖ టౌన్‌హాల్‌లో సమావేశమయ్యారు. చేనేత పరిశ్రమను ఆదుకోవాలని నిర్ణయించుకొని, స్వదేశీ వస్త్ర ఉద్యమం వైపు అడుగులు వేశారు. ఆ రోజును గౌరవించి 2014లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అదే రోజున చేనేత కార్మికులకు 'సంత్ కబీర్' అవార్డులను కూడా ప్రదానం చేస్తున్నారు.
ప్రాచీన వారసత్వం
చేనేత ప్రాచీన వారసత్వం శతాబ్దాలుగా వస్తోంది. క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దంలో, మెరోయ్‌లో పత్తి సాగు, స్పిన్నింగ్, నేయడం మొదలైన జ్ఞానం ఉన్నతస్థాయికి చేరుకుంది. కుష్ రాజ్య ఆదాయంలోని ప్రధాన వనరులలో వస్త్రాల ఎగుమతి ఒకటి. చేనేత అన్ని గొప్ప నాగరికతలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. ఇక్కడ అతి ప్రాచీన పరిశ్రమ అయిన ఈ చేనేత వృత్తి ఒకప్పుడు దేశానికి పేరు, డబ్బు తెచ్చి పెట్టింది. వందల ఏండ్ల క్రితమే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత చేనేతది.
శాతవాహనుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్‌కి ఎగుమతి అయ్యాయి.దేశంలోని ఎన్నో పట్టణాలు, గ్రామాలు వస్త్రోత్పత్తి కేంద్రాలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. షోలాపూర్, భీవండి, ముంబయి, అహ్మదాబాద్, ఇంచన్‌కరంజ్, సూరత్, మాలేగావ్, సిరిసిల్ల, వెంకటగిరి, గద్వాల్, భూదాన్ పోచంపల్లి, ఈరోడ్, చీరాల వంటి ప్రాంతాలు వస్త్రోత్పత్తికి నిలయాలుగా మారాయి. చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం సమకూరింది.
నేటి దుస్థితికి కారణం?
నాడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న చేనేత పరిశ్రమ నేడు అష్ట కష్టాలు పడుతోంది. మన దేశం నుంచి దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్న చైనా నేడు ఎగుమతుల వైపు దూసుకెళుతోంది. కారణం అక్కడ చేనేత పరిశ్రమకు చైనా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు. ప్రత్యేక చొరవనే. మన ప్రభుత్వాలకు కృత్రిమ పరిశ్రమ పైన ఉన్న ఆసక్తి చేనేత పరిశ్రమపై లేకపోవటమే నేటి దుస్థితికి కారణం. స్వదేశీ ప్రభువులు కూడా విదేశీ రాజులు వదిలి వెళ్లిన పాత విధానాలనే కొనసాగించారు. సహజ నూలు ఉత్పత్తిని తగ్గించేసి కృత్రిమ నూలుకు ప్రాముఖ్యతను పెంచుకుంటూ పోయారు. ఇలా చేనేత పరిశ్రమను నాశనం చేయడం మొదలుపెట్టారు, చేనేత ఉత్పత్తులకు రక్షణ కల్పించేందుకు తెచ్చిన 1985 నాటి 22 రకాల వస్త్రాల రిజర్వేషన్‌ను 11 వస్త్రాలకే పరిమితం చేశారు.
2011లో ఆనాటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం చేనేత పరిశ్రమ సంస్కరణలకు ఆరు వేల కోట్ల రూపాయల ఫండ్ ప్రకటించింది. కేటాయింపులు రూ.2800 కోట్లు మాత్రమే. ఖర్చు చేసింది రూ.750 కోట్లు. చేనేత పరిశ్రమను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవడమే ఇందుకు కారణం.ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం 2014 నుంచి చేనేతకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం మొదలు పెట్టింది. ఈ యేడాది రూ.410 కోట్లే కేటాయించింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి చేనేత రంగానికి పన్ను మినహాయింపు ఉంది. అలాంటిది ఇపుడు దీనిని కూడా జీఎస్‌టీలో చేర్చారు. ఐదు శాతం జీఎస్‌టీ విధించారు. అసలే భారీగా ముడిసరుకుల ధరలు పెరిగి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని జీఎస్‌టీ మరిన్ని కష్టాలలోకి తోసేసింది. చేనేతలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
క్షీణదశలో చేనేత రంగం
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో చేనేత కుటుంబాల సంఖ్య ఇంచుమించు 1 కోటి 10 లక్షలకు పైగానే ఉంది. 1970 వచ్చేసరికే దాని సంఖ్య నాలుగు కోట్లకు చేరింది. ఆ తర్వాతనే చేనేతకు అసలు సిసలైన కష్టాలు మొదలయ్యాయి. నేడు మన దేశంలో దాదాపు కోటి మంది ప్రత్యక్షంగా, ఆరు కోట్ల మంది పరోక్షంగా చేనేత రంగం ద్వారా ఉపాధి కలిగి ఉన్నారని అంచనా. ఆధునిక యంత్రాలు రావడంతో చేనేతకు ఆదరణ తగ్గడం మొదలైంది. 'చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా' చేనేత మగ్గాలను పవర్‌లూమ్స్ మింగేశాయి. పవర్‌లూమ్స్‌ను ఆధునిక మగ్గాలు మింగేయడంతో చేనేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది.
ప్రపంచానికి నాగరికత నేర్పిన నేతన్నల జీవితం కష్టాలు, కన్నీటి కలబోతగా మిగిలిపోయింది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్న బతుకు బండి జారిపడింది. నాడు మగ్గం చప్పుడుతో కళకళలాడిన గ్రామాలలో నేడు నిశ్శబ్దం తాండవిస్తోంది. చేనేత కార్మికులు క్రమంగా వృత్తిని వీడుతున్నారు. కనీస వేతన చట్టం మేరకు నెలకు కనీసం రూ. 6,300 రావాలి. ఐదు వేలు కూడా చేతికి అందడం లేదు. 70 శాతం కార్మికులు అప్పులతోనే తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. దేశంలో చేనేత చీరల వాడకం తగ్గిపోతోంది. చీరల అమ్మకాలలో చేనేతల వాటా 18 శాతమే. దుస్తుల అమ్మకాలలో వాటా 8-10 శాతమే.
సిరిసిల్ల తరహాలోనే
తెలంగాణలో చేనేత మగ్గాల కంటే మరమగ్గాలు రెట్టింపుగా ఉన్నాయి. చేనేత మగ్గాలు 17,573 ఉండగా, మరమగ్గాలు 35,588 ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అత్యధికంగా 25,494 ఉన్నాయి. 17 జిల్లాలకు విస్తరించిన మరమగ్గాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వీటికి అనుసంధానం చేస్తూనే బతుకమ్మ చీరల వంటి ఉపాధి కార్యక్రమాలను రాష్ర్ట ప్రభుత్వం చేపట్టింది. సిరిసిల్ల తరహాలో చేనేత కళాకారుల సంఖ్య అధికంగా ఉన్న పోచంపల్లి, పుట్టపాక, గద్వాల తదితర ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్ పార్కును త్వరితగతిన పూర్తిచేయగలిగితే ఎంతోమంది చేనేతకారులకు ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ విధానాలు కార్మికుల పొట్ట నింపేలా ఉండాలి.
నూలు కొనుగోలు నుంచి బట్ట అమ్మకం వరకు ప్రైవేటు వ్యక్తుల చేతులలోనే చేనేత పరిశ్రమ బందీ అయిపోయింది. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు, లాభాలు వీరికి వరంగా మారిపోతున్నాయి. ప్రభుత్వమే నూలు డిపోలను ఏర్పాటు చేసి నేరుగా నూలు అందించాలి. కార్మిక బీమా, పొదుపు పథకం, హెల్త్ కార్డులు, కార్మికుల భార్యలకు, పిల్లలకు గార్మెంట్ రంగంలో ఉపాధి, ఉచిత విద్య, వైద్యం అమలు చేయాలి. ఉచితంగా ఇల్లు, అంత్యోదయ కార్డులు, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. చేనేతకు రాయితీని 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలి. ఆరుమాసాలకు సరిపోయే నూలు ఎన్‌హెచ్‌డీసీ వద్ద నిల్వ ఉంచాలి. నిపుణులు కార్మిక సంఘం ప్రతినిధులతో నూలు సలహా బోర్డు ఏర్పాటు చేయాలి. చైనా నుంచి పట్టుదారం దిగుమతిని క్రమబద్దీకరించాలి. రూ.20 వేల కోట్లతో చేనేత బ్యాంకు ఏర్పాటు చేయాలి. 1975లో ప్రభుత్వం నియమించిన అవధానం కమిటీ సిఫార్సులు అమలు చేయాలి.
డా. బి కేశవులు, ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659