కాకతీయ వీరనారి రుద్రమదేవి
కాకతీయ వీరనారి రుద్రమదేవి... special editorial on chandupatla shasanam about rudramadevi
రాణి రుద్రమదేవి మరణ విషయం ఎవ్వరికీ తెలియలేదు. 1296 వరకు బతికి ఉన్నట్టు చరిత్రకారులు భావించారు. కానీ, నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల శాసనం ద్వారా అసలు విషయం బయట పడింది. ఆ శాసనం ప్రకారం రుద్రమ వరంగల్ నుండి పిల్లలమర్రి, ఇనుపాముల మీదుగా చందుపట్లకు చేరుకొని శివపూజలు నిర్వహించి పానగల్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడే క్రీ.శ. 1289 నవంబర్ 27న శివ సాయుజ్యం పొందింది. రుద్రమ మరణాన్ని తేదీలతో సహా తెలిపే ఏకైక శాసనం ఇది. దీనిని 1290 లో రుద్రమ సేనాధిపతి మల్లికార్జున నాయకుడి కుమారుడు పువ్వుల ముమ్మడి అనే బంటు వేయించాడు.
కాకతీయ సామ్రాజాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన వీర వనిత రాణి రుద్రమదేవి. కాకతీయ రాజు గణపతి దేవుడికి గణపాంబ, రుద్రమాంబ అని ఇద్దరు కుమార్తెలు. గణపాంబను కోట రాజు రుద్రుడి కుమారుడు బేతనికిచ్చి వివాహం చేశాడు. క్రీ.శ. 1219లో అతని మరణానంతరం గణపాంబ కోట దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలించింది. రెండవ కుమార్తె రుద్రాంబను నిడదవోలు చాళుక్య రాజు వీరభద్రునికిచ్చి వివాహము చేశాడు. ఈమె బాల్యం నుంచి క్షత్రియోచిత విద్యలన్నీ నేర్చింది. రుద్రదేవ మహారాజు పేరుతో రాజకీయ యంత్రాంగములో చురుకుగా పాల్గొన్నది. తండ్రి మరణానంతరం కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది. సామ్రాజ్య వ్యతిరేక శక్తులను అణచివేసి సుస్థిర శాంతి భద్రతలు నెలకొల్పింది.
మార్కోపోలో వంటి విదేశీయుల మన్ననలను అందుకుంది. తండ్రిని మించిన తనయగా పేరు తెచ్చుకుంది. 'రాయగజకేసరి' బిరుదుతో కీర్తించబడింది. రుద్రమదేవిని వివాహం చేసుకోవడానికి ముందు చాళుక్య వీరభద్రునికి భార్య ఉంది. ఇద్దరు కుమారులున్నారు. వారు గణపతి దేవునికి విధేయులే. పెద్దవాడైన హరిహరుడు గుణవంతుడు కావడంతో గణపతిదేవుని తరువాత అతడికే రాజ్యాధికారం లభిస్తుందని వీరభద్రుడు భావించాడు. రుద్రమకు పుత్ర సంతానం లేదు. ఒకరోజు సభలో వీరభద్రుడు ఈ ప్రస్తావన తెచ్చి హరిహరుడిని యువరాజుగా నియమించమని కోరాడు. కానీ, సభ ధర్మ నిర్ణయం మేరకు రుద్రమను రుద్రదేవ మహారాజు అని ప్రకటించి ఆమెకే ఘనంగా రాజ్య పట్టాభిషేకం చేశారు.
పతి మాట జవదాటకుండా
మహారాణి అయినప్పటికీ రుద్రమ భర్త వీరభద్రుడిని నిర్లక్ష్యం చేయలేదు. గౌరవభావంతో, పతి మాటను జవదాటకుండా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. కానీ, వీరభద్రుడు ఆమెతో సంతోషంగా ఉండలేదు. తన కుమారుడు కాకుండా, తన భార్య మహారాణి కావడంతో అతని ఆశాసౌధం కూలినంత పని అయింది. అందువలన ఆమెను అసమర్దురాలిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నో కుట్రలు పన్నాడు. రుద్రమ సహించి, భరించి చివరకు 'రాజధర్మ నిర్వహణలో తనవారు, పరాయివారు అనే భావం ఉండకూడదు' అనుకుని వీరభద్రుడిని యుద్ధంలో పరాజితుడిని గావించింది. దీంతో వ్యాకుల చెందిన వీరభద్రుడు సంసారాన్ని త్యజించి సన్యసించాడు. అయినా దాడులు ఆగలేదు.
పశ్చిమోత్తరాన యాదవులను, దక్షిణాన చోళులను, పాండ్యులను ఇతర సామంత రాజులను కాకతీయ సామ్రాజ్యంపైన దాడులు చేసిన వారందరికీ రుద్రమ ముచ్చెమటలు పట్టించింది.మిత్రులకు తన వేషం వేసి యుద్ధంలో నలు దిక్కులా నిలిపింది. వారిలో అసలు రుద్రమ్మ ఎవరో తెలియక శత్రువులు తికమకపడి పారిపోయేవారు. రుద్రమ కసితో ఉన్న ఆడపులి వలె వారి మీద విరుచుకుపడేది. దేవగిరి మహాదేవరాజు జైనులతో చేతులు కలిపి ఓరుగల్లు కోటను ముట్టడించాడు. వారం రోజులు యుద్ధం జరిగింది. మహాదేవుడి ఎత్తులను రుద్రమ చిత్తు చేసింది. రుద్రమ శౌర్యానికి తెల్లబోయిన మహాదేవుడు సంధి చేసుకొని పరిహారంగా కోట్ల ధనాన్ని చెల్లించుకున్నాడు. ఆ ధనాన్నంత రుద్రమ తన సైనికులకు, వారి కుటుంబాలకు పంచిపెట్టింది.
ప్రజారంజక పరిపాలన
రుద్రమ పరిపాలనలో అత్యంత సమర్థురాలు. ఆమె పాలనలో రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లింది. ప్రజల సాదకబాధకాలను స్వయంగా తెలుసుకొనేది. మారు వేషంలో తిరుగుతూ సమస్యలను పరిష్కరించేది. రైతులు సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ వహించి అనేక చెరువులు తవ్వించేది. ప్రజాహిత, సంక్షేమ కార్యక్రమాలలో ఎంతో శ్రద్ధ తీసుకునేది. మహిళలను దేశ రక్షణలో భాగస్వాములను చేయాలన్న తలంపుతో యుద్ధ విద్యలలో శిక్షణ ఇప్పించింది. కాకతీయుల చరిత్రలో నిలిచిపోయే విధంగా వారి శిల్పకళా నైపుణ్యం వరంగల్, హన్మకొండలో మనకు దర్శనమిస్తుంది. 1266లో రుద్రమ భర్త మరణించాడు. మరుసటి సంవత్సరం తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఆమెకు మంత్రులు ధైర్యం చెప్పి, కర్తవ్యాన్ని గుర్తు చేయడంతో విజయయాత్ర కొనసాగించి 77 మంది నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణిచివేసింది. తనకు అండగా నిలిచిన వారందరికి వీరలాంఛనాలతో సత్కరించింది. అనేక రాజ్యాలపై విజయం సాధించినందుకు 'రాయగజకేసరి' బిరుదు పొందినది.
తండ్రి కాలంలో కంటే రాజ్యాన్ని సువిశాలం చేసి పటిష్ట పరిచింది. వయసు మీద పడడంతో ప్రతాపరుద్రుడికి రాజ్యభారం అప్పగించింది. రాణి రుద్రమదేవి మరణ విషయం ఎవ్వరికీ తెలియలేదు. 1296 వరకు బతికి ఉన్నట్టు చరిత్రకారులు భావించారు. కానీ, నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల శాసనం ద్వారా అసలు విషయం బయట పడింది. ఆ శాసనం ప్రకారం రుద్రమ వరంగల్ నుండి పిల్లలమర్రి, ఇనుపాముల మీదుగా చందుపట్లకు చేరుకొని శివపూజలు నిర్వహించి పానగల్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడే క్రీ.శ. 1289 నవంబర్ 27న శివ సాయుజ్యం పొందింది. రుద్రమ మరణాన్ని తేదీలతో సహా తెలిపే ఏకైక శాసనం ఇది. దీనిని 1290లో రుద్రమ సేనాధిపతి మల్లికార్జున నాయకుడి కుమారుడు పువ్వుల ముమ్మడి అనే బంటు వేయించాడు.
(చందుపట్ల శాసనం ప్రకారం నేడు రుద్రమ వర్ధంతి)
కొలనుపాక కుమారస్వామి
వరంగల్, 9963720669