వివేక మాట ఏబీవీపీ బాట
దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం దిశగా సమాజంలో సేవ చేయాలనే జాతీయ భావంతో కొందరు యువకులు విశ్వవిద్యాలయాలు, కళాశాలను
దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం దిశగా సమాజంలో సేవ చేయాలనే జాతీయ భావంతో కొందరు యువకులు విశ్వవిద్యాలయాలు, కళాశాలను కేంద్రంగా చేసుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ముందుకు కదిలారు. వీటిని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు 1949 జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను (ఏబీవీపీ) ఏర్పాటు చేశారు. ఆ రోజును 'జాతీయ విద్యార్థి దినోత్సవం'గా ప్రకటించుకున్నారు. ఈ విద్యార్థి పరిషత్ ఇప్పుడు 74 వ వసంతంలోకి అడుగుపెడుతోంది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే 'జాతీయత, దేశభక్తి మా ప్రాణం' అంటూ దేశంలో ఎక్కడ ఘటన జరిగినా వెంటనే స్పందించి, దేశ రక్షణలో వాచ్ డాగ్‌లాగా నిలబడుతోంది.
వారికి ఎదురొడ్డిన కార్యకర్తలు
కేవలం కొద్దిమందితో ప్రారంభమైన ఏబీవీపీ అనేక ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ దశాబ్దాలుగా ముందుకు వెళ్తూనే ఉంది. ప్రతి అణిచివేత తరువాతా మరింతగా బలం పుంజుకుంది. కార్యక్రమాల విస్తరణ పెరిగింది. కళాశాల క్యాంపస్‌లలో 'భారత్ మాతాకీ జై' అంటే చంపేస్తామని కమ్యూనిస్టులు, వాటి అనుబంధ విద్యార్థి సంఘాలు అదిలించినా బెదరలేదు. విద్యార్థులను రెచ్చగొట్టి దేశ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తరుణంలో ఆనాడు 1982 కాకతీయ యూనివర్సిటీని ఆర్‌ఎస్‌యూ కార్యకర్తలు కారల్ మార్క్స్ యూనివర్సిటీగా పిలుచుకునేవారు.
గణతంత్ర దినోత్సవం రోజున ఉపకులపతి జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత దానిని దించేసి నల్లజెండాను ఎగురవేశారు. అక్కడ ఉన్న వారెవరు స్పందించలేదు. కానీ, జెండాకు జరిగిన అవమానం తట్టుకోలేక యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సామ జగన్మోహన్ దానిని ఎదిరించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో అతడిని అతి కిరాతకంగా చంపేశారు. ఓయూలో చంద్రరెడ్డి, పరకాలలో దగ్గు వెంకన్న, భీమన్న తదితర 30 మంది కార్యకర్తలు దేశం కోసం ప్రాణాలు విడిచారు. 'ఎరుపంటే ఎవడికి రా భయం, అది నా తల్లి నుదుటి సింధూరం' అంటూ నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు.
దేశ వ్యతిరేక శక్తులతో
'భారత్ మాతాకీ జై' 'వందేమాతరం' కేవలం నినాదాలు కాదు. ఏబీవీపీ కార్యకర్తల జీవన విధానాలు. ఎక్కడ విద్యార్థి పరిషత్ ఉద్యమం జరుగుతుందో అక్కడ దేశభక్తి ఉంటుంది. దేశ వ్యతిరేకుల ప్రభావం లేకుండా పోతుందనే స్థాయికి పరిషత్ ఎదిగింది. 1990లో శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానంపై తీవ్రంగా స్పందించింది. 1983 నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. సరిహద్దు ప్రాంతంలో సర్వే చేయించి ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చింది. కాశ్మీర్ విద్యార్థుల బాధలను దేశంలోని మిగతా విద్యార్థులకు తెలియజేయడం కోసం అనేక సదస్సులు నిర్వహించింది. ఇలాంటి సమస్యల మీద విద్యార్థులకు అవగాహన కల్పించింది.
దేశ సమస్యల పరిష్కారంలో తమ బాధ్యతను గుర్తు చేస్తున్నది. జల్, జమీన్, జంగల్ పేరుతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నది. ఇంజినీరింగ్ విద్యార్థులకు 'ప్రబోధ్' పేరుతో, మెడిసిన్ విద్యార్థులకు 'వనవాసి' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కరోనా సమయంలో వాక్సినేషన్ అపోహలు తొలగించింది. చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పేదలకు నిత్యావసర సరుకులు అందించింది. 'జాతీయ విద్యార్థి దినోత్సవం'లో విద్యార్థులు, యువత, మేధావులు అందరూ పాల్గొని రాబోయే తరాలకు మార్గదర్శనం చేయాలి.
(నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం)
దేవేందర్ ముంజంపల్లి
ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు
89784 58611