రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతున్న కాలమిది. కానీ, నందా చనిపోయేనాటికి ఒక సొంత ఇల్లు కానీ, కారు కానీ లేకపోవడం ఆయన నిజాయితీకి మచ్చుతునక. తన రాజకీయ జీవితం కుటుంబంపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడైన ఆయన మరణానంతరం వ్యక్తిగత వస్తువుల సేకరణకు ఒక్క సంచీ మాత్రమే సరిపోయిందంటే ఆయన ఎంత నిరాడంబర జీవితం గడిపారో అర్థం చేసుకోవచ్చు. అత్యంత నిబద్ధత గల రాజకీయవేత్తగా ఉన్న ఆయన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడంతో నిరసన తెలిపి క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో అమలులో ఉన్న పాలనా వ్యవస్థలను అధ్యయనం చేసి, మన దేశానికి 'ప్రజాస్వామ్య పాలన' అనుసరణీయమని భావించి, రాజ్యాంగాన్ని రూపొందించారు డా. బీఆర్ అంబేద్కర్. రాజ్యాంగం ప్రకారం అత్యున్నత హోదా కలిగిన పదవి 'రాష్ట్రపతి' అయినప్పటికీ దేశ పరిపాలన వ్యవహారాలలో ప్రధానమంత్రి పదవే క్రియాశీలకం. ఈ పదవిని ఇప్పటి వరకు 14 మంది అధిరోహించారు. కొందరు ప్రధానులు తమవైన ప్రత్యేకతలతో తమ పేర్లను చిరస్థాయిగా నిలుపుకున్నారు. అలాంటి కోవకు చెందినవారే దివంగత గుల్జారీలాల్ నందా కూడా.
అదే ఆయనకు అలంకారం
బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యంగా ఉన్న పంజాబ్‌లోని ఓ హిందూ కుటుంబంలో 4 జూలై 1898 న గుల్జారీలాల్ నందా జన్మించారు. రెండు పర్యాయాలు దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా సేవలందించారు. మొదటి సారి నెహ్రూ మరణం తరువాత 1964లో 13 రోజుల పాటు, రెండవసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణం తరువాత 1966లో 13 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పని చేశారు. ఈ రెండు సందర్భాలు కూడా దేశానికి ఎంతో కీలకమైనవి. నెహ్రూ మరణానికి ముందు 1962లో చైనా యుద్ధం జరిగింది. శాస్త్రి మరణానికి ముందు 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగింది. నందా రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త. కార్మిక సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. భారత ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. కార్మిక, ఉపాధి, వ్యవసాయ, విద్యుత్, హోమ్, రైల్వే, విదేశాంగ శాఖలకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కార్మిక సమస్యలపై పరిశోధన చేసిన అనంతరం ఫ్రొఫెసర్‌గా పని చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన పిలుపునందుకుని సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ) నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆ సంస్థ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడమే కాకుండా, కార్మికుల సంక్షేమం కోసం సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఆడంబరాలకు ఆమడ దూరంలో జీవితకాలం సాధారణ ఇంటిలో నివసించారు.
దీనస్థితిని పత్రికలో చూసి
రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతున్న కాలమిది. కానీ, నందా చనిపోయేనాటికి ఒక సొంత ఇల్లు కానీ, కారు కానీ లేకపోవడం ఆయన నిజాయితీకి మచ్చుతునక. తన రాజకీయ జీవితం కుటుంబంపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడైన ఆయన మరణానంతరం వ్యక్తిగత వస్తువుల సేకరణకు ఒక్క సంచీ మాత్రమే సరిపోయిందంటే ఆయన ఎంత నిరాడంబర జీవితం గడిపారో అర్థం చేసుకోవచ్చు. అత్యంత నిబద్ధత గల రాజకీయవేత్తగా ఉన్న ఆయన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడంతో నిరసన తెలిపి క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమించారు. తరువాత అనాథాశ్రమం స్థాపించారు. కానీ, అనూహ్యంగా నమ్మినవారే ఆయనను అక్కడి నుండి బలవంతంగా పంపించివేయడంతో కొత్త ఢిల్లీలోని ఓ గది అద్దెకు తీసుకొని తన భార్యతో కలిసి జీవించారు.
ఆ సమయంలో సన్నిహితుల నుంచిగానీ, ఇతరుల నుంచిగానీ ఎటువంటి ఆర్థిక సహాయాన్ని స్వీకరించేవారు కాదు. బలవంతం చేయడంతో స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే ఫించన్‌ను ఉపయోగించుకున్నారు. భార్య మరణంతో కుంగిపోయిన ఆయన పింఛన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఓపిక చేసుకోలేకపోయారు. అద్దె కోసం ఇంటి యజమాని దుర్భాషలాడుతూ ఆయన వస్తువులను బయటకు విసిరేసాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక జర్నలిస్టు ఒకరు పత్రికలో ప్రచురించారు. దీంతో తెల్లవారేసరికి అక్కడికి చేరుకున్న కేంద్ర మంత్రులు, అధికారులు నందాను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. స్వస్థత చేకూరిన తరువాత అహ్మదాబాద్‌లోని కూతురి ఇంటికి వెళ్లి 15 జనవరి 1998న 99 యేట మరణించే వరకు అక్కడే గడిపారు. 1997లో ఆయనకు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. కార్మిక రంగంలోకి వచ్చిన కొత్త తరం నాయకులకు ఐఎన్‌టీయూసీలో ప్రారంభం నుండి పనిచేసిన నందా గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు.
యేచన్ చంద్రశేఖర్
హైదరాబాద్
88850 50822