సబ్బండ వర్ణాల ప్రతీక
అసలు వాదోపవాదాలకు తావు లేని చోట మూర్ఖత్వంతోనో... సరైన అవగాహన లేకో వివాదాల్ని సృష్టించడం నేడు ప్రతిపక్షాలకు పరిపాటైపోయింది. ఆసేతు
అసలు వాదోపవాదాలకు తావు లేని చోట మూర్ఖత్వంతోనో... సరైన అవగాహన లేకో వివాదాల్ని సృష్టించడం నేడు ప్రతిపక్షాలకు పరిపాటైపోయింది. ఆసేతు హిమాచలం భరతమాతను చూసి గర్వంగా ఉప్పొంగుతుంది. ప్రతీ రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్రాల మాతను పూజిస్తూ కొలుస్తుంటారు.. అలాంటిది స్వరాష్ట్రమై పదేళ్లు దాటిన తర్వాత తొలిసారి తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకుంటే దాన్ని చూసి అవహేళన చేయడం, కుటిల దృష్టితో చూడడం కేవలం ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రమే చెల్లింది.
నాడు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు సైతం అమరులౌతున్న తన బిడ్డల త్యాగాల్ని స్మరిస్తూ ఎంతోమంది ‘తల్లీ తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా’ అని పాటలు పాడుకున్నారు. అలాంటి ఉత్తేజాన్నిచ్చిన తల్లిని అధికారికంగా ఏర్పాటు చేయాలన్న ధ్యాస కానీ, తెలంగాణ పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ప్రతిష్టించుకోవాలన్న సోయి కానీ లేకపోవడం పట్ల నాటి పాలకులు సిగ్గుపడాల్సింది పోయి ఆ పనిని సంబురంగా, వేడుకలా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వంపై, ప్రజా ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డిపై అత్యంత నీచమైన భాషను వాడుతూ కించపరుస్తున్నారు. సీఎంపై ద్వేషాన్ని ఏకంగా తెలంగాణ తల్లిపైనే నిస్సిగ్గుగా చూపెడుతూ శునకానందం పొందుతున్నారు. దీన్ని యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ఆడపడుచు ప్రతిబింబం
సగటు తెలంగాణ మహిళలకు ప్రతిబింబంలా నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని అత్యంత హేయంగా దివాలా రూపమని, నగలు వేసుకోవద్దా అని, బీదగానే ఉండాలా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే విధానం చూస్తే ‘కన్న తల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడా’ అనే సామెత గుర్తుకొస్తుంది. పదేళ్ల అధికారంలో కనీసం తెలంగాణ అస్తిత్వ పతాకమైన తెలంగాణ తల్లిని కానీ, రాష్ట్ర గేయాన్ని కానీ రూపొందిద్దాం అనే ఆలోచన లేని వీళ్లు ఇవాళ అచ్చ తెలంగాణ అమ్మత నానికి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం నిలిచేసరికి తట్టుకోలేకపోతున్నారు. ప్రతీ తెలంగాణ పౌరుడు ఆ ప్రతిమలో తన ఇంట్లో ఉన్న అమ్మ, అమ్మమ్మను చూస్తూ తన సొంత ఆడబిడ్డల ప్రతిరూపాన్ని ఆ ప్రతిమలో చూసు కొని సొంతం చేసుకుంటుంటే వారి కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు.
మన కట్టుబొట్టు, కట్టుబాటు
ఏ జాతి అస్థిత్వాలను చూపే చిహ్నాలైనా ఆ జాతి ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, కట్టుబాట్లతో కూడి ఉండాలి. అప్పుడే ఆ చిహ్నాలు యావత్ జాతికి ప్రతిబింబాలై, ఆ జాతి సంస్కృతిని ఎల్లె డలా దశదిశలా చాటుతాయి. అలాంటి అచ్చ మైన స్వరూపమే మన ప్రజా ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి స్వరూపం. నిండైన గ్రామీణ తల్లికి ప్రతిరూపంగా ఆమె ధరించిన వస్త్రాలు, కట్టు, బొట్టుతో ఉన్న ఆ ప్రసన్న వదనం చూడగానే మనలోకి తెలియని ఒక శాంతి భావన వస్తుంది. ఏడు వారాల నగలు ఉన్నా... మెడలో బంగారు తీగ, కంటే, నెక్లెస్‌తో తనకిష్టమైనట్టుగా ప్రతీ రోజు దర్శనమిచ్చే రూపంలో అమ్మ కనిపిస్తుంది. పసిడి సిరులు పండించే పంటలకు చిహ్నంగా పచ్చని చీరలో బంగారు అంచు, ఎర్రని అంచుతో మనదైన ప్రత్యేక చేతనను చూపిస్తుంది. చేతిలో మన దగ్గర, మన పరిస్థితులకు అనుగుణంగా పండే ప్రధాన ధాన్యాల కంకులు, కుడిచేతితో ఎల్లప్పు డూ మీకు అండగా ఉన్నా అనే అభయ హస్తం, మన పోరాటాలకు ప్రతిరూపంగా పిడికిళ్లతో కూడిన పీఠం, అమ్మను మోసే చేతులతో బంగా రు భవితకు వేసుకునే బాటల్ని చూపిస్తూ సమ గ్రంగా తెలంగాణలోని సబ్బండ వర్ణాలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం నిలిచింది.
తల్లి బొమ్మ పట్ల దొరహంకారమే!
ఓవైపు సమస్త తెలంగాణ తత్త్వానికి, మన ఆడబిడ్డలకు నిజ ప్రతిరూపంగా నేడు అధికారికమై తెలంగాణ తల్లి ప్రతిబింబిస్తుంటే దాన్ని వద్దని, గడీల అహంకారానికి ప్రతిరూపంగా సమాజం ప్రాతినిధ్యం లేకుండా తనొక్కడి మానస పుత్రికగా రూపొందించుకున్న విగ్రహం పెట్టాలి అనడం సైతం వారి దొరహంకారాన్ని మరోసారి చాటి చెబుతుంది. ఇందులోనూ తెలంగాణ దళిత, బహుజన సమాజాన్ని ఎదగకుండా అడ్డుకునే కుట్రలు, వారికి ప్రతిరూపంగా ఉన్న నేటి అధికారిక తెలంగాణ తల్లి ప్రతీ ఊరిలో, ప్రతీ గల్లీలో, ప్రతి అధికారిక కార్యక్రమంలో ఘనంగా నిలబడుతుంటే చూసి ఓర్వలేనితనమే కనిపిస్తుంది. ప్యూడల్ నైజం తలకెక్కించుకున్న వారి గత వాసనలే కనిపిస్తున్నాయి. దీన్ని యావత్ సమాజం ఖండించాలి. మన వర్గాల ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ తల్లిపై ఇలాంటి ప్యూడలిస్టిక్ భావజాలం ఉన్న ప్రతిపక్ష పార్టీల, నేతలు చేసే దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. నేటి విగ్రహంలో వాళ్లకు కనిపిస్తున్న పేదరిక ఆనవాళ్లు, వాళ్లు చేస్తున్న బీద అరుపులు మొత్తం వారి అధికారాన్ని, సమాజంపై వారి పెత్తనాన్ని నిలుపుకునే కుట్రలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అందుకే అలాంటి దుష్ప్రచారాన్ని సమాజంలో ప్రతీ ఒక్కరూ ఖండించాలి. మనదైన యావత్ తెలంగాణ దళిత, బహుజన, సబ్బండ వర్గాలకు ప్రతిరూపంలో నిలిచిన తెలంగాణ తల్లికి నమస్కరిస్తూ ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అని గళం విప్పాలి.
పున్నా కైలాస్ నేత
జనరల్ సెక్రటరీ, టీపీసీసీ.
94921 87210