కనురెప్పే కాటేయజూస్తుంటే...!

కనురెప్పే కాటేయజూస్తుంటే...!... special article on Sexual Harassment of Women

Update: 2023-03-07 19:45 GMT

మార్చి ఎనిమిది... మహిళలు సాధించిన హక్కులను పునశ్చరణ చేస్తూ సాధించుకోవాల్సిన హక్కులను, సమానత్వాన్నీ గుర్తుచేసే సుదినం. ప్రపంచ మహిళలంతా సంఘటితమై పురుషాధిక్యాన్ని సవాల్ చేస్తూ సమానత్వంకై కదం తొక్కే రోజు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నా కూడా అసమానత్వం కొనసాగడం సమంజసం కాదని ముక్తకంఠంతో నినదించే దినం. స్త్రీ, పురుష సమానత్వంకై 1910లో కోపెన్ హగెన్‌లో అంతర్జాతీయ మహిళా సమావేశం జరిగింది. 46దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన జర్మనీ మహిళ క్లారా జెట్కిన్ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించగా, సమావేశానికి హాజరైన మహిళా ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదనను ఆమోదించారు. మొదట మహిళా దినోత్సవాన్ని పలు దేశాలు వివిధ రోజుల్లో జరపగా 1914 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదినే జరపడం ప్రారంభించినారు. సృష్టికి జీవం పోసిన మహిళ కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఉండటం ఆనందించదగ్గ విషయమే.

పట్టపగలు ఒంటరిగా తిరగగలుగుతుందా?

దేశం అభివృద్ధి పంథాన నడుస్తున్న సమయంలో మహిళా నిష్పత్తి గణాంకాలను పరిశీలిస్తే ఇంకా సాధించాల్సింది ఎంతో ఉన్నదని బోధపడుతుంది. మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తూ, తమ నైపుణ్యంతో పురుష ప్రపంచానికి సవాల్ విసురుతున్న సమయంలో, ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఆడబిడ్డ అంటే భారంగానే భావిస్తున్నారు తల్లిదండ్రులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కనురెప్పే కాటేయజూస్తుంటే మహిళా లోకం అభివృద్ధి పథాన నడుస్తుందా అనే అనుమానం రాక మానడం లేదు. జనాభా లెక్కలోను స్త్రీ, పురుష నిష్పత్తిలో చాలా తేడా కన్పిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలున్నట్లు తేలింది. ఉద్యోగావకాశాలను చూస్తే ఉన్నత విద్యావకాశాలను అందుకుంటున్న మహిళలు నూటికి 10 నుంచి 30 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 90 శాతం నుంచి 70 శాతం వరకు మహిళలు ఉన్నత విద్యకు దూరంగానే ఉంటున్నారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆడవారిపై ఏదో ఒక ఘాతుకం. హత్యాచారమే కావచ్చు, వేధింపులే కావచ్చు. పొద్దునే లేచి టీవీ ఆన్ చేయగానే పలానా రాష్ట్రంలో, పలానా ప్రాంతంలో సామూహిక అత్యాచారం అని రోజూ చూస్తూనే ఉన్నాం. యావత్ భారతావనిని తీవ్ర వేదనకు గురి చేసిన నిర్భయ ఘటన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని దేశం మొత్తంగా భావించింది. కానీ నిర్భయ చట్టం వచ్చాక ఇంకా ఇలాంటి ఘటనలు అధిక స్థాయిలో చోటుచేసుకోవడం బాధాకరం. చిన్నారులను మొదలుకొని పండు ముదుసలి వరకు కామాంధులు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. కలకత్తాలో మూడేళ్ళ చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా బస్ కండక్టర్ చిన్నారిని అపహరించి హత్యాచారం చేయడం చూస్తే ఎలాంటి భద్రత లేని సమాజంలో మహిళ ఉంటుందో అర్థమవుతుంది. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా బయటకు వచ్చే వార్తలు కొన్నే, పరువు, ప్రతిష్టలని ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవచ్చవంలా జీవిస్తున్న మహిళలెందరో. అర్ధరాత్రి ఏ భయం లేకుండా స్త్రీ ఒంటరిగా ఎప్పుడైతే రోడ్లపై వెళ్తుందో అప్పుడే భారతావనికి నిజమైన స్వాతంత్య్రం అని మహత్ముడు చెప్పారు. కానీ కనీసం పట్టపగలు ఒంటరిగా తిరిగే పరిస్థితులు కూడా లేవంటే దేశం సాంస్కృతికంగా ఎంత దిగజారిందో అర్థమవుతుంది.

అధికార స్థానాల్లో ఉన్నా..

గల్లీల్లో తిరిగే అబ్బాయిల నుంచి రాజకీయ నేతల వరకు మహిళలను వేధిస్తున్నారు. మహిళలు కనుక స్వేచ్ఛను కోరుకుంటే నగ్నంగా ఎందుకు తిరగడంలేదని వ్యాఖ్యానించడం ద్వారా స్వేచ్ఛ అనే పదానికి కూడా తిలోదకాలు ఇచ్చారు హర్యానా సీఎం ఖట్టర్. స్త్రీ పక్షపాతినని చెప్పుకునే యూపీ సీఎం, మహిళా స్వేచ్ఛ వినాశనానికి పునాది అంటూ మహిళను ఇంకా బందీగానే ఉంచాలనే ఆలోచనలను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సమయాల్లో మానభంగం సరైనదేనని, కొన్ని సమయాల్లో మాత్రమే తప్పని పేర్కొన్న బీజేపీ నేత బాబులాల్ గౌర్ అన్ని హద్దులూ మీరిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి ఎర్రవల్లి దయాకర్ బాగానే ఊపుతున్నావని వ్యాఖ్యానించడం, మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్.. మహిళలను కత్తిలా ఉన్నావనడం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక కలెక్టర్ చెయ్యి పట్టుకోవడం.. ఇలా ఎన్నో సంఘటనలు అధికార స్థానాల్లో ఉన్న మహిళలను కూడా మన నేతలు ఎంతగా కించపరుస్తున్నారో చెబుతున్నాయి.

మహిళా భద్రత విషయంలో మన దేశం ప్రపంచంలో 133వ స్థానంలో ఉంది. ఎన్‌సీఆర్‌బీ 2019 నివేదిక ప్రకారం మహిళలపై జరిగే దాడుల సంఖ్య 4,05,861. వీటిలో 87 వేల అత్యాచార కేసులు ఉన్నవి. అదే 2020లో 3,71,503 కేసులు, 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. మహిళలపై నేరాల సంఖ్య 2020లో 56.5 శాతం నుంచి 2021 నాటికి 64.5 శాతానికి పెరిగింది.

తెలంగాణ ఉద్యమంలో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యమించారు. జెండాలు మోసి, ప్రత్యేక రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాడిన మహిళలు ఎందరో ఉన్నారు. కానీ దేశంలోనే మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్నీ నడిపిన ఘనత కేసీఆర్‌కి మాత్రమే దక్కింది. మహిళా సంక్షేమం గురించి కేసీఆర్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంది. ఆకాశంలో సగం అవనిలో సగం అన్నట్టు జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు ఎన్‌డీఏ ప్రభుత్వం చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని యావత్ మహిళా లోకం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటోంది.

- ఇందిరా శోభన్

సీనియర్ రాజకీయ నాయకురాలు

Tags:    

Similar News