మాతృభాషను మృతభాష చేయొద్దు!
మాతృభాషను మృతభాష చేయొద్దు!... special article on International Mother Language Day
నన్నయ్య నట్టింట నానారుచిరార్ధమైన తెలుగు, తిక్కన్న తీయ్యందనాన్ని తనలో చేర్చుకుంది. శ్రీనాధ కవితలో పద ప్రౌఢిమ పొందింది. పోతన పదరచనా మందార ముకుళమై ముక్తినొసగే భాగవతంలో భాగాన్ని పంచుకుంది. అల్లసాని అల్లిన ప్రబంధంలో కావ్యకన్యక, ముక్కుతిమ్మన ముద్దుపలుకై భువనవిజయాన పద్య కవనం చేసింది. ఆముక్తమాల్యదలో అమూల్యమైంది. ధూర్జటికి అక్షరాభిషేకం చేసింది. పాండురంగనికి పదపాండిత్య నైవేద్యాన్ని సమర్పించింది. రామభద్రుని కృతిలో భద్రమైంది. ఇలా ప్రబంధ యుగంలో పదబంధాల ఊయలలూగింది. అలంకారాలతో అలరారింది. మొల్ల కవితానందమైంది. కవితా సరస్వతిని చంపకమాల, ఉత్పలమాలలతో సత్కరించింది. మత్తేభంపై వూరేగించింది. 'మసజసతతగ' అంటూ గణ మంత్రమేసి శార్దూలాన్ని నిలబెట్టింది. పద్యాలలో నవరస సారాన్ని చేర్చి సీసాలో బంధించింది. అందమైన కందమైంది, ఆటవెలదై తేటగీతికలతో వీనుల విందు చేసింది. కొప్పరపు అవధాన పక్రియలో పరువై నిలిచింది. తిరుపతి వేంకటకవుల రోసమై మీసం మెలేసింది. విశ్వనాథ సాహితీ ప్రకర్షకు వేయిపడగలు ఆకర్షణీయమైంది. రామాయణ కల్పవృక్ష ఛాయలో జ్ఞానపీఠంపై తెలుగు సాహితీ సరస్వతి విశ్వంభరమైంది.
గిదుగు బడిలో వ్యవహారభాషగా సొగసులదులద్దుకొని గురజాడ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ మెడలో ముత్యాలసర హారమైంది. ఆధునిక కవిత్వం తృణ కంకణాన్ని కట్టుకొని తన పద ప్రస్థానాన్ని మహాప్రస్థానం చేర్చింది. ఉత్తుంగ తరంగమై అంతరంగాన్ని కవితాక్షరాలతో నింపేసింది. సాహితీ మైదానంలో చలమై స్త్రీ వాదానికి దన్నుగా నిలిచింది. గుర్రం జాషువా కవితా సౌధం ముంతాజ్ మహలై మెరిసింది. పాపయ్యశాస్త్రి లలిత సుగుణాలను పుణికిపుచ్చుకున్న తెలుగుబాల నండూరి ఎంకిలా, బాపు బొమ్మలా గిలిగింతలు పెడుతుంది. త్యాగయ్యకృతి, అన్నమయ్య సంకీర్తన, రామదాసు కీర్తన, కూచిపూడి నర్తన, మువ్వగోపాలునికి క్షేత్రయ్య చేసిన పదార్చనతో పునీతమైంది. జానపద కళల కాణాచి ఒగ్గు కథ, బుర్రకథ, హరికథ, పద్య నాటికలు లాంటి వినూత్న రుపాలకు రూపునిచ్చింది. బాలమురళీ రవమైంది. కళంకారీ చిత్తరువై చిరునగవులు చిందించింది. కొండపల్లి బొమ్మలకు కోటికాంతులు తెచ్చింది. కదిలే గోదారిలా, కోనసీమ కోబ్బరిలా, పూతరేకులా, పొన్నూరు ఖద్దరులా, పాపాయి బోసినవ్వులా తెటతెలుగులా తెల్లవారి వెలుగులా ఆంధ్రదేశంలో ఆదరణను పొందిన తెలుగు భాష సంస్కృతి మసకబారుతున్నాయి. పరభాషలో పాండిత్యం సంపాదించు తప్పులేదు పరభాషా పరదా మాటున మాతృభాషను దాచడం తప్పు.
మనల్ని బ్రతికించేది భాష మనకు బ్రతుకునిచ్చేది భాష. ఎన్నో ఆశలను ఎదలో దాచుకున్న తెలుగు భాష నేడు నిరాదరణకు గురౌతోందన్నది నిజం. ప్రస్తుతం వినిపిస్తున్న ఘోష అమ్మ భాష అజంత భాష, అజరామరమైన భాష, అమృత భాష అదే అదే మన తెలుగు భాష. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం 1 నుంచి 5 తరగతులకు విద్యా బోధన మాతృభాష మాధ్యమంలో బోధించడం అన్న అంశం ఒక్కింత ఆశను రేకెత్తిస్తోంది. మాతృభాషను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయాలి. రాష్ట్రం సచివాలయం నుండి పంచాయతీ వరకు పరిపాలన అంతా తెలుగులోనే జరగాలి. ఇందుకు తెలుగు రాష్ట్రాల పరిపాలకులు బాధ్యత వహించాలి. న్యాయస్థాన తీర్పులు సైతం తెలుగులోనే ఉండేలా పూనుకోవాలి. ఈ దిశగా మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ కృషి ప్రశంసనీయం. అలాగే మన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సైతం పలుమార్లు రాజ్యసభలో, బయట సమావేశాలలో మాతృభాష ఆవశ్యకతను ప్రస్తావించి ఆ దిశగా ప్రయత్నం కూడా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పరీక్షలు సైతం తెలుగులో రాసే అవకాశం కల్పించాలి. పాఠశాలల బోధన కనీసం ప్రాథమిక స్థాయి వరకు తెలుగు మాధ్యమంలోనే సాగాలి. ఆ తరువాత ప్రాథమికోన్నత విద్య తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇష్టమైన దాన్ని ఎంచుకుని విద్యాభ్యాసం చేసే అవకాశం విద్యార్థులకు కల్పించాలి. వాడని భాష వాడిపోతుంది. భాష నశిస్తే జాతి మొత్తం నశిస్తుంది. తెలుగులో విద్యాభ్యాసం చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అని సరిపెట్టుకోకుండా యువత కూడా తమ వంతు కర్తవ్యంగా మన మాతృభాష అయిన తెలుగును బతికించుకునే ప్రయత్నం చేయాలి.
ఆరోగ్యం, ఆహారం, క్రీడలు, వంటలు, యాత్రా విశేషాలు ఇత్యాది సమాచారాన్ని తెలుగులో ఉండేలా చూసుకోవాలి. ఫేస్‌బుక్, వాట్సప్ ఇత్యాది మాధ్యమాలలో సైతం తెలుగును విరివిగా ఉపయోగించాలి. యూట్యూబ్ ద్వారా కూడా మన తెలుగు భాష గొప్పతనాన్ని దశదిశలా వ్యాప్తి చెందేలా చేయాలి. కేవలం భాష బతికితే చాలదు. వికసిస్తేనే జాతి పురోగతి. కనీసం ప్రాథమిక విద్య వరకైనా తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తేనే గ్రహణశక్తి, జ్ఞానదృష్టి పెరుగుతాయని విద్యా శాస్త్ర సిద్ధాంతం. కాబట్టి మాతృభాష అనేది సంస్కృతి వెలుగు. మనోవికాసానికి మాతృభాష ఎంతగానో దోహదపడుతుందనే విషయాన్ని ఎవరూ మరువకూడదు. మన మాతృభాష అయిన తెలుగును మృతభాష కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి భుజాలపై ఉంది. అందుకే జయహో తెలుగు అని నినదిద్దాం. మన తెలుగు భాషను కాపాడుకోవడానికి నడుం బిగిద్దాం.
శ్రీధర్ వాడవల్లి
99898 55445
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672