భగత్ సింగ్ తన తల్లితో చివరి సంభాషణ ఏంటో తెలుసా?

వారు నన్ను చంపొచ్చు. నా ఆలోచనలను కాదు. నా శరీరాన్ని దహించవచ్చు ఆత్మను దహించలేరు’ బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచిన షహీద్ భగత్‌సింగ్

Update: 2022-09-27 18:30 GMT

సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలాలజపతి రాయ్ వంటి ఉద్యమకారులు బ్రిటిష్ సాయుధ బలగాలకు ఎదురొడ్డి నిలిచారు. అప్పుడక్కడ సూపరింటెండెంట్‌గా ఉన్న సాండర్స్ లాఠీతో లాలాలజపతి రాయ్ పై విరుచుకుపడ్డాడు. దీంతో పంజాబ్ కేసరి నేలకొరిగాడు. ఆయన మరణం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులో ఆగ్రహాన్ని నింపింది. ముగ్గురూ సాండర్స్‌ను కసితీరా కాల్చి చంపారు. తర్వాత 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. సాండర్స్ హత్య కేసు విచారణ సందర్భంగా కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.

వారు నన్ను చంపొచ్చు. నా ఆలోచనలను కాదు. నా శరీరాన్ని దహించవచ్చు ఆత్మను దహించలేరు' బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలిచిన షహీద్ భగత్‌సింగ్ పలుకులివి. దేశమాత విముక్తి కోసం 'విజయమో, వీర మరణమో' అంటూ యువతను ఉత్తేజపరిచి ఉరికొయ్యను ముద్దాడిన మహోన్నత విప్లవకారుడు. భగత్‌సింగ్ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్వాతంత్ర్యోద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మహా వీరుడు. ప్రస్తుత పాకిస్తాన్‌లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో కిషన్‌సింగ్, విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబరు 28న జన్మించారు. తాత దయానంద సరస్వతికి అనుచరుడు. ఆయన ప్రభావం భగత్‌సింగ్‌పై ఎక్కువగా పడింది. మూడేళ్ల పిల్లాడిగా ఉన్నపుడే తండ్రి వెంబడి పొలానికి వెళ్లి అక్కడ గడ్డిపరకలను నాటాడు. 'ఏం చేస్తున్నావు?' అని తండ్రి అడిగితే 'తుపాకులు నాటుతున్నా, తుపాకులు కాస్తాయి' అని జవాబిచ్చాడు.

బాబాయ్ సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతున్న సమయంలో పిన్ని కన్నీరు పెట్టుకుంది. నాలుగేళ్ల భగత్‌సింగ్ 'పిన్నీ ఏడవద్దు నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా' అని ప్రతిజ్ఞ చేశాడు. స్వాతంత్ర్య పోరాటంలో మొదటిసారి పాల్గొని ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టాడు. హింసాత్మక ఉద్యమంతోనే బ్రిటిష్‌వారి ఆగడాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలతో ఉండేవాడు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఉదంతం అతనిలో మరింత కోపం పెంచింది. యుక్త వయసుకు వచ్చాక కుటుంబ సభ్యులు తనకు పెళ్లి చేయాలనుకున్నారు. 'నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకే కోరిక లేదు' అంటూ ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తరువాత 'నవ జవాన్ భారత సభ'లో చేరారు.

తల్లితో చివరి మాటలు

ఈ సంఘం ద్వారా ఎంతో మంది యువకులను ఆకర్షించి స్వాతంత్ర్యోద్యమ సాధనకు పురికొల్పాడు భగత్‌సింగ్. అనంతరం హిందూస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరారు. అక్కడే అతనికి సుఖ్‌దేవ్ పరిచయమయ్యాడు. అనతికాలంలోనే ఆ ఇద్దరూ సంఘానికి నాయకులయ్యారు. అదే సమయంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలాలజపతి రాయ్ వంటి ఉద్యమకారులు బ్రిటిష్ సాయుధ బలగాలకు ఎదురొడ్డి నిలిచారు. అప్పుడక్కడ సూపరింటెండెంట్‌గా ఉన్న సాండర్స్ లాఠీతో లాలాలజపతి రాయ్ పై విరుచుకుపడ్డాడు. దీంతో పంజాబ్ కేసరి నేలకొరిగాడు. ఆయన మరణం భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులో ఆగ్రహాన్ని నింపింది. ముగ్గురూ సాండర్స్‌ను కసితీరా కాల్చి చంపారు. తర్వాత 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. సాండర్స్ హత్య కేసు విచారణ సందర్భంగా కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.

ఉరి కంబాన్ని ఎక్కే ముందు తన తల్లితో భగత్‌సింగ్ 'నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకుంటే దేశంలో ఉన్న తల్లులందరూ తమ బిడ్డలు భగత్‌సింగ్ కావాలని కోరుకుంటారు. అప్పుడే బలీయమైన స్వాతంత్ర్య కాంక్ష ఉన్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవ యోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు' అంటాడు. దీనికి తన తల్లి 'ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కానీ, గొప్ప మరణం ఎలా ఉంటుందంటే మాత్రం అది నీ మరణమే అని ప్రపంచం చెప్పుకుంటుందని' ఆవేదనను వెలిబుచ్చింది. భగత్‌సింగ్‌ను ఉరి తీసే ముందు ఇచ్చిన నినాదం 'ఇంక్విలాబ్ జిందాబాద్' 25 యేళ్ల వయసులోనే ఉరి పడుతుందని తెలిసినా భగత్‌సింగ్ చేసిన సాహసం అసామాన్యం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి.

(నేడు భగత్‌సింగ్ జయంతి)


సభావట్ కళ్యాణ్

ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ వనవాసి కన్వీనర్

9014322572

Tags:    

Similar News