పెను సవాల్ గా మారుతున్న మతిమరుపు

అరే, బైక్ కీ ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడుందబ్బా’ అంటూ వెతుక్కోవడం, ‘మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసినట్టున్నాం. ఎక్కడో గుర్తుకు

Update: 2022-09-20 19:00 GMT

ఆరోగ్యకర జీవన శైలితో మతిమరుపును కొంత వరకు జయించవచ్చు. 60 యేండ్లు దాటాక మానసికంగా యాక్టివ్‌గా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకర సంతులిత ఆహారం తీసుకోవాలి. సుఖనిద్ర, ఒత్తిడి లేకుండా పనులను చక్కబెట్టుకోగలగాలి. మంచి మానవ సంబంధాలను కలిగి ఉండాలి. ఏదో ఒక పని కల్పించుకోవాలి. మ్యూజిక్, బుక్ రీడింగ్, పజిల్స్​వంటివి మెదడుని యాక్టివ్‌గా ఉంచుతాయి. ముదురు రంగు పండ్లు ఎక్కువ తినాలి. ఆలివ్​ ఆయిల్, నట్స్, అవకాడో, అప్రికాట్‌, బెర్రీలు, యాపిల్, బీన్స్​డైట్‌లో ఉండాలి. కూరగాయలు, గింజలు, పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడిగుడ్డు ఎక్కువగా తినాలి. పసుపు, నల్ల మిరియాలు, నెయ్యి వంటివి కూడా అల్జీమర్స్‌ను తగ్గించే పదార్థాలే.

రే, బైక్ కీ ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడుందబ్బా' అంటూ వెతుక్కోవడం, 'మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసినట్టున్నాం. ఎక్కడో గుర్తుకు రావట్లేదు' అనేది చాలామందికి అనుభవమే. ఒక్కోసారి మన బంధువుల పేర్లనే మరిచిపోతుంటాం. మతిమరుపు అనేది అందరిలో అతి సాధారణంగా ఎదురయ్యేదే. కొందరు మాత్రం కొన్ని విషయాలను, పనులను పూర్తిగా మర్చిపోతారు. మెదడులోని ఉండే న్యూరాన్లు లేదా నరాల కణాలు పని చేయడం ఆగిపోతే మతిమరుపు సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వయస్సు పెరిగేకొద్దీ కొన్ని న్యూరాన్‌లను కచ్ఛితంగా కోల్పోతారు. అతిగా కోల్పోయినవారు 'అల్జీమర్స్' అనే మతిమరుపు వ్యాధికి గురవుతారు. ఈ వ్యాధిని 1901లో గుర్తించారు. ఇందులో 'ఎర్లీ ఆన్‌సెట్ అల్జీమర్స్' 'లేట్ ఆన్‌సెట్ అల్జీమర్స్' అని రెండు రకాలున్నాయి.

అల్జీమర్స్​ కేసులు 60-65 సంవత్సరాలు పైబడినవారిలోనే ఎక్కువ. ఈ మధ్య 40-50 యేళ్లు దాటినవారిలోనూ ఈ లక్షణాలు కనబడుతున్నాయి. ముసలివారవుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. 65+ వయస్సు వద్ద సుమారు 15 మందిలో ఒక్కరికి, 85 ఆపై వయస్సున్న వారిలో ముగ్గురిలో ఒక్కరికీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఈ వ్యాధిని సంక్రమింపజేసే ప్రమాదాన్ని కల్పించే జన్యువులను కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మగవారి కంటే ఆడవారిలో అల్జీమర్స్​కేసులు రెండు శాతం ఎక్కువగా ఉంటున్నాయి.

ప్రతి 3.2 సెకండ్లకు ఒకరికి

2020లో ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్‌లకు పైగా ప్రజలు మతిమరుపుతో జీవిస్తున్నారని తేలింది. ఈ సంఖ్య ప్రతి 20 సంవత్సరాలకోసారి రెట్టింపు అవుతుంది. 2030లో 78 మిలియన్‌లకు, 2050లో 139 మిలియన్‌లకు చేరుకుంటుందనీ అంచనా. ఈ పెరుగుదల అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే డిమెన్షియాతో బాధపడుతున్న వారిలో 60 శాతం మంది అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 71 శాతానికి పెరుగుతుందని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా యేటా 10 మిలియన్‌లకు పైగా మతిమరుపు కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రతి 3.2 సెకన్లకు ఒక కొత్త కేసు పెరుగుదలను సూచిస్తున్నది. అత్యంత వేగంగా వృద్ధి చెందిన చైనా, ఇండియా, దక్షిణాసియా, పశ్చిమ పసిఫిక్ పొరుగు దేశాలలో వృద్ధులు ఎక్కువగా ఉండటం విశేషం.

మతిమరుపుకు కారణాలు

వయసు పెరగడంతో బ్రెయిన్‌లోని న్యూరాన్ల సంఖ్య తగ్గి, పనితనం మందగించడమే అల్జీమర్స్‌కు​ప్రధాన కారణం. విపరీత ఒత్తిడి. నిద్రలేమి, జీవన విధానంలో అనూహ్య మార్పులు, విటమిన్స్ బి1, బి12, బి6 లోపం, ట్రాఫిక్​సౌండ్, అనువంశికత వలన న్యూరాన్లు క్షీణించి అల్జీమర్స్​ఎక్కువ మందికి వస్తుంది. డిప్రెషన్, మూడీగా ఉండడం, అలోచనలు, ప్రవర్తనలో మార్పులు కూడా అల్జీమర్స్​లక్షణాలే, అల్కాహాల్, డ్రగ్స్​, పొగతాగే అలవాటు, గుండె జబ్బులు ఉన్నవారు అల్జీమర్స్​బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయి.

వీరిలో మెదడులోని చిన్న రక్తనాళాలు బ్లాక్ అవడం వలన మతిమరుపు వస్తుంది. దీన్ని 'వాస్క్యులార్​డిమెన్షియా' గా పిలుస్తుంటారు. బ్రెయిన్​ట్యూమర్స్, థైరాయిడ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, మెదడుకు గాయాలు, ఇన్ఫెక్షన్లు, కొన్ని మందుల అతి వాడకం అలవాటు ఉన్నవారిలోనూ అల్జీమర్స్ సంకేతాలు​లక్షణాలు కనిపిస్తాయి. పట్టించుకోకపోతే, ట్రీట్‌మెంట్ ఆలస్యం అయితే నయమయే అవకాశాలు దెబ్బతింటాయి.

అంతా మెదడులోనే

మెదడులో 'ఎసిటైల్ కొలిన్'లాంటి న్యూరో కెమికల్స్ తగ్గుతూ ఉంటే జ్ఞాపక శక్తి, స్పష్టంగా ఆలోచించే సమర్థతలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. సెరిబ్రో స్పయినల్ ఫ్లూయిడ్ ( CSF ) శాతం పెరగడం వలన మెదడు పరిమాణం 25 శాతం పైగా తగ్గుతుంది. నీటి శాతం పెరుగుతుంది. ఎమలాయిడ్ అనే ప్రొటీన్‌లు పెరగడంతో క్లాట్స్ ఏర్పడతాయి. టౌ ప్రొటీన్‌లు పెరిగితే 'ట్యాంగిల్స్' వస్తాయి. శరీర భాగాలకు సిగ్నల్స్​ అందవు. మూత్రం కంట్రోల్‌లో ఉండదు. నడకలో తేడా వస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మనుషులను, వస్తువులను గుర్తు పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్ర అల్జీమర్స్‌లో నడవడం, కూర్చోవడం, తినడం కూడా కష్టమవుతుంది. సొంతంగా పనులు చేసుకోలేరు. ఒక్కోసారి శరీరంలోని అన్ని వ్యవస్థలు పనిచేయకపోవడంతో చనిపోయే ఆస్కారం ఉంటుంది.

జ్ఞాపక శక్తి కోల్పోతారు. దారి తప్పిపోతారు. పునరావృతమయ్యే ప్రశ్నలు అడుగుతారు. తెలిసిన వస్తువులను సూచించడానికి అసాధారణ పదాలను ఉపయోగిస్తారు. తెలిసిన పనులూ చేయలేరు. మాట్లాడటానికి పదాలు వెతుకుతారు. సమయం, ప్రదేశాలను మరిచిపోతారు. ఆలోచనలో సమస్యలు, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఉద్వేగభరితంగా వ్యవహరిస్తారు. ఇతరుల భావాలను పట్టించుకోరు. వ్యాధి ఉన్నవారిని చూసుకోవడానికి కుటుంబ వార్షిక ఖర్చు వ్యాధి తీవ్రతను బట్టి పట్టణ ప్రాంతాలలో రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ. 80 వేల నుంచి రూ. 1 లక్షా 20 వేల వరకు ఉంటుంది.

ఇలా చేయండి

ఆరోగ్యకర జీవన శైలితో మతిమరుపును కొంత వరకు జయించవచ్చు. 60 యేండ్లు దాటాక మానసికంగా యాక్టివ్‌గా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకర సంతులిత ఆహారం తీసుకోవాలి. సుఖనిద్ర, ఒత్తిడి లేకుండా పనులను చక్కబెట్టుకోగలగాలి. మంచి మానవ సంబంధాలను కలిగి ఉండాలి. ఏదో ఒక పని కల్పించుకోవాలి. మ్యూజిక్, బుక్ రీడింగ్, పజిల్స్​వంటివి మెదడుని యాక్టివ్‌గా ఉంచుతాయి. ముదురు రంగు పండ్లు ఎక్కువ తినాలి. ఆలివ్​ ఆయిల్, నట్స్, అవకాడో, అప్రికాట్‌, బెర్రీలు, యాపిల్, బీన్స్​డైట్‌లో ఉండాలి.

కూరగాయలు, గింజలు, పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడిగుడ్డు ఎక్కువగా తినాలి. పసుపు, నల్ల మిరియాలు, నెయ్యి వంటివి కూడా అల్జీమర్స్‌ను తగ్గించే పదార్థాలే. మాంసం, ఫాస్ట్, ప్యాకేజ్‌డ్, షుగర్ ఫుఢ్ వీలయినంతగా తగ్గించాలి. వైట్ షుగర్, వైట్ బ్రెడ్, సాల్ట్ చిప్స్​, ఫ్రెంచ్ ఫ్రైస్, జంక్​ఫుడ్, పేస్ట్రీలు, ప్రాసెస్డ్​ మీట్ తక్కువగా తినాలి. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ప్రస్తుతం చికిత్స అందుబాటులో లేదు. 'అడుకానుమాబ్' అనే ఔషధం అల్జీమర్స్ వ్యాధిని సమర్థంగా అరికట్టగలదని బ్రిటిష్ వైద్య నిపుణులు చెబుతున్నారు. మతిమరుపుతో బాధపడుతున్నవారికి కుటుంబ సభ్యులు సహకరించాలి.

(నేడు మతిమరుపు నివారణ దినోత్సవం)


డా. బి. కేశవులు. ఎండీ

సీనియర్ న్యూరో, సైకియాట్రీ ఎక్స్‌పర్ట్

9949 695189

Tags:    

Similar News