సామాజికం: కొత్త ఖాస్రా పహాణీ కావాలి

Update: 2022-07-19 18:45 GMT

'డిజిటలైజేషన్ ఆఫ్ ద రికార్డ్స్' అవసరమే. ఆన్‌లైన్ సర్వీసెస్ అవసరమే. కానీ, ఎప్పుడు? రికార్డ్ ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత కదా? ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం 96 శాతం పక్కా అంటారు. మరి అన్ని లక్షల ఫిర్యాదులు ఎందుకొచ్చినయ్. నిజానికి ఇంకా రికార్డు చెక్ చేసుకోని రైతులు ఎంత మంది ఉన్నారు? భూమి ఉంది. చేతిలో పాసు‌ బుక్ ఉంది. రైతుబంధు వస్తుంది కదా అనుకుంటున్నారు. క్రయ విక్రయాల సందర్భం వస్తేనే ధరణి పోర్టల్ దగ్గరికి వచ్చేది. తప్పుల డేటాతో ఆన్‌లైన్ సర్వీసెస్ సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలు టైటిల్ గ్యారంటీ దిశగా అడుగులు వేస్తున్నాయి. మనమేమో రికార్డు ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే మ్యాన్యువల్ రికార్డు రూపొందించి ఊరూరా జమాబందీ నిర్వహించినప్పుడే ప్యూరిఫై అవుతుంది. అది కూడా వారమో, పది రోజులు కాదు. ప్రతి ఊరికి నెల రోజులు గడువు ఇవ్వాల్సిందే.

భూమి హక్కుల చిక్కులు లేకుంటేనే ప్రజలైనా, ప్రభుత్వమైనా ప్రగతిబాటలో సాగుతారు. హక్కుల చిక్కులు తొలగాలంటే మంచి చట్టాలు, సమర్థవంత భూపాలన, సత్వరం సమస్యలను పరిష్కరించే భూన్యాయ వ్యవస్థ ఉండాలి. భూ సుపరిపాలన ఉన్నప్పుడే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. ఇందుకోసం అనునిత్యం మేధోమథనం జరగాలి. అందుకే 'లీఫ్స్' సంస్థ భూమికి సంబంధించిన పలు అంశాలపై వారం వారం 'భూమి సంవాద్' పేరుతో చర్చా కార్యక్రమం చేపడుతున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 15న హైదరాబాద్​లో 'ధరణి సమస్యలు, దరిచేర్చే మార్గాలు' అనే అంశంపై చర్చ నిర్వహించారు. దీనికి ప్రముఖ భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ అధ్యక్షత వహించారు.

టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేత కోదండరెడ్డితో పాటు తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, పలువురు హైకోర్టు అడ్వకేట్లు, భూ సమస్యలపై పోరాడుతున్న పలు సంఘాల నేతలు, మేధావులు చాలా మంది హాజరయ్యారు. రెండేండ్లుగా ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎన్నో అంశాలపై కథనాలు రాసిన నన్ను కూడా చర్చకు తప్పక రావాలని ఆహ్వానించారు. రౌండ్ టేబుల్, చర్చా కార్యక్రమాలలో పెద్దగా పాల్గొన్న అనుభవం నాకు లేదు. సబ్జెక్టు మాత్రం చాలా ఇష్టమైనది. అందుకే నేనూ ఆ భూమి సంవాద్‌లో నా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాను. డిజిటలైజేషన్ అనివార్యమే కానీ, సాంకేతికత కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. విధానా నిర్ణయాలలో అనేక లోపాల కారణంగా ధరణి పోర్టల్ సత్ఫలితాలను ఇవ్వడం లేదని వివరించాను. ఆ చర్చలో నేను ప్రస్తావించిన అంశాలను మీ ముందుంచుతున్నాను.

దేనికి ప్రామాణికత?

ధరణి పోర్టల్‌లో నిక్షిప్తమైన డేటాకు ప్రామాణికత ఉన్నదా? అసలు ఏ రికార్డును ప్రామాణికంగా ఎంచుకున్నారు? ఏది అప్ లోడ్ చేశారు? ఖాస్రా పహాణీ ప్రకారమే నేచర్ ఆఫ్ ల్యాండ్‌ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఎలా పరిగణిస్తారు? అవన్నీ ఇల్లీగల్‌గా చేశారా? వాటిని కూడా పరిష్కరిస్తామని గ్యారంటీ ఇస్తున్నారా? ఆ మార్పులను ఏ విధంగా క్రోడీకరిస్తారు? ఈ మేరకు కలెక్టర్లకు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా? ఇస్తే జనానికి, మీడియాకి ఎందుకు తెలియకుండా గోప్యంగా ఉన్నాయి? నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను విడిపించాలంటే, ఈ ప్రశ్నలకు సమాధానం వస్తే చాలు. 80 శాతం పీఓబీ సమస్యలు గట్టెక్కుతాయి. ఓ ఊరిలో ఒకాయన ల్యాండ్ కొన్నాడు. మ్యుటేషన్ పెండింగులో పెట్టారు. అడిగితే 'ఇది ఇనాం ల్యాండ్' అంటారు. అతనే కొన్నవారిలో మొదటి వ్యక్తి కాదు. 1983 నుంచి చేతులు మారుతూ వచ్చింది. లింక్ డాక్యుమెంట్లన్నీ చూపించినా ససేమిరా అంటారు.

అదేమంటే ఖాస్రాలో ఏది ఉంటే అదే. మరి అంతకు ముందు సేల్ డీడ్ చేసిన సబ్ రిజిస్ట్రార్, పట్టాగా మార్చిన రెవెన్యూ యంత్రాంగంపై ఎవరు చర్యలు తీసుకోవాలి? తాజాగా సేల్ డీడ్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు ఎందుకు తీసుకోరు? చేతులు మారిన ప్రతిసారీ స్టాంపు డ్యూటీ కట్టించుకున్నప్పుడు ప్రభుత్వానికి ఆ బాధ్యత ఎందుకు ఉండదు? ఇప్పుడు ఉన్నట్టుండి ఆ భూమి ఇనాంగా మార్చేస్తే రూ. లక్షలు పోసి కొనుగోలు చేసిన రైతులు లేదా హక్కుదారుడికి ఎంత నష్టం? పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో ఓ దొరకు వందల ఎకరాలు ఉన్నాయి. ఇప్పటికీ ధరణిలో అలాగే ఉన్నది. ఈ భూములపై నవాబులకు, ఈ దొరకు మధ్య 1950 నుంచి కేసులు నడుస్తున్నాయి. ఆ తర్వాత సీలింగ్ యాక్ట్ అమలైంది. ఈ భూములు వివాదంలో ఉండడంతో వదిలేశారు. కేసులు కొలిక్కి వస్తే సీలింగ్ యాక్ట్ అమలవుతుందా? లేదా? 1973లో అమలైన సీలింగ్ యాక్ట్ తర్వాత సీలింగ్ భూములు ప్రభుత్వ ఖాతాలో చేరాయి. మరి ఖాస్రా పహాణీని ప్రామాణికంగా తీసుకుంటే అవి పట్టా భూములుగానే కనిపిస్తాయి. ఖాస్రా పహాణీ ప్రామాణికమంటే ప్రభుత్వ భూములుగా రావాల్సిన సీలింగ్ భూముల లెక్క ఎట్లా తేలుతుంది?

అధికారులకే అర్థం కావడం లేదు

నేను, మా ఫ్రెండ్ కలిసి రెండెకరాలు కొనుగోలు చేశాం. అన్నీ చెక్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయ్యింది. చేతికి పాస్ పుస్తకాలు వచ్చాయి. రైతుబంధు వచ్చింది. ధరణి వచ్చిన ఆర్నెళ్ల తర్వాత ప్రొహిబిటెడ్ లో పెట్టారు. అడిగితే ప్రభుత్వ భూమి అంటారు. మా చేతిలో సేల్ డీడ్, పాసు పుస్తకాలు ఉన్నాయని అప్లై చేస్తే రిజెక్ట్. ఇక ఇలా కాదని ఆర్టీఐ కింద పహాణీలన్నీ తీసుకున్న. ఖాస్రా పహాణీలో శివాయి జమాబందీ అని ఉంది. 1960 నుంచి పట్టా భూమిగా ఉన్నది. 62 ఏండ్లుగా పట్టా ఉంది. కొనేటప్పుడు ఖాస్రా చెక్ చేసుకోవాలని ఈ పీఓబీ చూస్తే తప్ప నాకూ అర్ధం కాలేదు. బాగా పరిచయం ఉన్న ఓ కలెక్టర్ దగ్గరికి వెళ్లి నా బాధంతా చెప్పుకుంటే తప్ప ఆ కలెక్టర్‌కి అర్ధం కాలేదు. ఇదంతా ఏడాది పట్టింది.

భూమి కొనుగోలు చేసేటప్పుడు ఖాస్రా పహాణీ చూసుకోవాలని నిబంధన పెట్టలేదు. సబ్ రిజిస్ట్రార్ కూడా చెప్పలేదు. కొత్తగా జాయింట్ రిజిస్ట్రార్‌గా మారిన తహసీల్దార్ కూడా ఆ విషయాన్ని కొనుగోలుదారులకు ఎందుకు చెప్పడం లేదు? ఇంతకీ ఖాస్రా పహాణీ ఎక్కడైనా అందుబాటులో ఉన్నదా? కనీసం పహాణీలు ఇచ్చే వ్యవస్థ ఉన్నదా? ఎవరు రాసివ్వాలి? ఆఖరికి ఆర్టీఐ కింద పెడితే రికార్డులు లేవు అని రాసిస్తున్నారు. అందుకే ఏ రెవెన్యూ డేటా ప్రామాణికంగా తీసుకుంటారు? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఎలా పరిగణిస్తారు? ఎలా రికార్డులను మారుస్తారు? ఈ ప్రశ్నల పరంపరనే పరిష్కారానికి మూలంగా నేను భావిస్తున్నాను.

ఈ ప్రశ్నలకు జవాబేది?

తెలంగాణ రాష్ట్రంలో ఆటోమెటిక్ మ్యుటేషన్ వివాదారహితమేనా? ఇన్ని తప్పులు కలిగిన రెవెన్యూ రికార్డుతో ఎలా? ఆర్ఎస్ఆర్ తేడా ఉన్న సర్వే నంబర్లు ఎన్ని? ప్రతి రెవెన్యూ విలేజ్‌లో 20 నుంచి 30 శాతం సర్వే నంబర్‌లలో ఆర్ఎస్ఆర్ తేడా ఉన్నట్లు తెలుస్తున్నది. మరి పొజిషన్ లేని భూములు రిజిస్టర్ అవుతుంటే, వాటిని మ్యుటేషన్ చేస్తూ పోతే, ఏదో ఒక రోజు లేని భూమిని చూపించమని ప్రభుత్వాన్ని అడిగే హక్కు కొనుగోలు చేసినవారికి ఉండదా? లేని భూముల క్రయ విక్రయాలను నిలుపుదల చేయాలంటే కనీసం మ్యుటేషన్ సమయంలోనే గ్రౌండ్‌లో వెరిఫై చేసుకోవడం అధికారులకు తప్పనిసరి. కనీసం సేల్ డీడ్‌లో హద్దులు రాయడం లేదు. ఇలాగైతే ఆటోమెటిక్ మ్యుటేషన్ ఎంత డేంజర్? యాచారం మండలంలో మేం ఓ ల్యాండ్ చూసినం. రికార్డులో సర్వే నం.1 పొజిషన్ మాత్రం సర్వే నం.100. ల్యాండ్ లార్డ్ ముందే చెప్పేసిండు. 'మీరు ఎంత భూమి కొంటున్నారో అంత కొలిచి ఇస్తా' అంటాడు. ఇప్పుడు కొనాలా? వద్దా? ఇది సమస్యే అనుకుంటే మరి ఆ రైతు పరిస్థితి ఏమిటి? ప్రతి ఊరిలో 20 నుంచి 30 శాతం భూముల పొజిషన్‌కి, రికార్డుకు మధ్య చాలా తేడా ఉన్నది. వైవట్​ఖాతాల సంఖ్య ఎంత? వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? దీనికి పరిష్కారం ఏమిటి?

ఈ లోపాలు ఎలా దొర్లాయి

ఏడాది క్రితం నాకు అమెరికా నుంచి ఒకరు ఫోన్ చేశారు. 'మేం 1992 లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఎనిమిదెకరాలు కొన్నాం. ఫెన్సింగ్ వేసుకున్నాం. మామిడి తోట పెట్టినం. పాసు బుక్స్ కూడా వచ్చినయ్. ఇప్పుడేమో ధరణి పోర్టల్‌లో ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ పేరిట భూమిని మార్చేశారు. మేం ఎక్కడా ఒక్క సంతకం కూడా పెట్టలేదు. ఇప్పుడేం చేయాలి?' అని. ఇది ఎలా జరిగింది? తహశీల్దార్‌కు తెలియదు. కలెక్టర్‌కు తెలియదు. 'నేనేం చేయలేను. ఆ కంపెనీ నుంచి మీరు సేల్ డీడ్ చేసుకోండని' తహసీల్దార్ సలహా ఇచ్చారు. హక్కులే లేని వ్యక్తి నుంచి వారెందుకు కొనాలి? ఒకవేళ కొన్నా తర్వాత లీగల్ ఇష్యూస్‌కి ఎవరు బాధ్యులు? రియల్ ఎస్టేట్ కంపెనీ దానిని అమ్మేస్తే బాధ్యత ఎవరిది? ధరణి ట్యాంపరింగ్ చేయలేనిదన్నారు. మరి దీనికి సమాధానం ఏమిటి? ఓ వృద్ధుడికి పాస్ బుక్ ఉంది. అమ్మడానికి వెళ్లిండు. ఆధార్ మిస్ మ్యాచ్ అని వస్తుంది. వెరిఫై చేస్తే వేరే వారి ఆధార్ నంబరు సీడ్ చేశారు. ఎలా సాధ్యమైంది? ఇప్పుడేం చేయాలి? ఇలాంటప్పుడు గ్రౌండ్ వెరిఫికేషన్ ఉండాలా? వద్దా? మరి ఆ వ్యవస్థ ఏది?

డిజిటలైజేషన్ అవసరమే

'డిజిటలైజేషన్ ఆఫ్ ద రికార్డ్స్' అవసరమే. ఆన్‌లైన్ సర్వీసెస్ అవసరమే. కానీ, ఎప్పుడు? రికార్డ్ ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత కదా? ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం 96 శాతం పక్కా అంటారు. మరి అన్ని లక్షల ఫిర్యాదులు ఎందుకొచ్చినయ్. నిజానికి ఇంకా రికార్డు చెక్ చేసుకోని రైతులు ఎంత మంది ఉన్నారు? భూమి ఉంది. చేతిలో పాసు‌ బుక్ ఉంది. రైతుబంధు వస్తుంది కదా అనుకుంటున్నారు. క్రయ విక్రయాల సందర్భం వస్తేనే ధరణి పోర్టల్ దగ్గరికి వచ్చేది. తప్పుల డేటాతో ఆన్‌లైన్ సర్వీసెస్ సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలు టైటిల్ గ్యారంటీ దిశగా అడుగులు వేస్తున్నాయి. మనమేమో రికార్డు ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే మ్యాన్యువల్ రికార్డు రూపొందించి ఊరూరా జమాబందీ నిర్వహించినప్పుడే ప్యూరిఫై అవుతుంది. అది కూడా వారమో, పది రోజులు కాదు. ప్రతి ఊరికి నెల రోజులు గడువు ఇవ్వాల్సిందే. తొందరపడి ఏది చేసినా మళ్లీ తప్పులు దొర్లే అవకాశం ఉన్నది.

ఇక సర్వే నంబర్ల లెక్క తేల్చాంటే ఓ విధాన నిర్ణయం జరగాలి. ఆర్ఎస్ఆర్ తేడా ఉన్న సర్వే నంబర్ల భూమి సమస్యల పరిష్కారంపై చర్చ జరగాలి. ఎవరికి అన్యాయం జరిగినా వివాదామే అవుతుంది. 2017 లో భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. తక్కువ సమయంలో బాగా చేశారని రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం ప్రశంసించింది. మరి ఆ తర్వాత రూపొందించిన రెవెన్యూ రికార్డు లేదా డేటా ఉత్తదేనా? అప్పటి దాకా పట్టా భూములుగా కొనసాగిన భూములను సర్కారీ అంటూ పీఓబీలో పెడితే కొనుగోలు చేసిన రైతులు ఎక్కడికి పోవాలి? ఈ ప్రశ్నలనే భూమి సంవాద్ లో ప్రస్తావించాను. కాలం చెల్లిన ఖాస్రా పహాణీ స్థానంలో సరికొత్తది రూపొందించాల్సిన అవసరం ఉన్నదని చర్చలో తీర్మానించారు. ఆఖరున అన్ని అంశాలను క్రోడీకరించిన సునీల్ గారు కూడా కొత్త ఖాస్రా పహాణీని రూపొందించుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు రాకుండా చేయగలగుతామని తీర్మానించారు.

శిరందాస్ ప్రవీణ్‌కుమార్

8096677450


Similar News