ట్రోలింగాసురులు...

Social Media Trolls will kill

Update: 2024-03-23 00:45 GMT

ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా మద్దతు పోగుజేసుకునే రాక్షస ప్రయత్నమే ట్రోలింగ్. ఈ విష సంస్కృతి పత్రికలు వేదికగా ప్రారంభం అయ్యి టీవీ మీడియా మీదుగా స్వైరవిహారం చేస్తూ సోషల్ మీడియాకు సవాల్ విసురుతోంది. సామాన్యునికి పాశుపతాస్త్రంలా ఉపయోగపడుతున్న సోషల్ మీడియా, ట్రోలర్స్ కారణంగా బోనులో నిలబడాల్సిన గత్యంతరం ఏర్పడ్డది. చిన్న, పెద్ద, ఆడ, మగ, ప్రతిపక్షం, అధికారపక్షం, మంచి, చెడు అనే విచక్షణ లేకుండా అదే పనిగా విషం చిమ్మడమే ట్రోలర్స్ పని.

భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛ‌కు భారీ విఘాతాన్ని కలిగిస్తున్న మహమ్మారి ట్రోలింగ్. ఒక మనిషి అభిప్రాయాన్ని తప్పుడు సూత్రీకరణతో వక్రభాష్యాన్ని అంటగట్టి పదేపదే తప్పుడు ప్రచారం చేయడమే ట్రోలింగ్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు. ప్రభుత్వాల పాలన విధానాలను చట్ట సభల్లో అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శ చేయవచ్చు. పత్రికలు మీడియా సంస్థలు గూడా ఆర్టికల్ 19 పరిధిలోకి వస్తాయని న్యాయ స్థానాలు గూడా అనేక తీర్పులో స్పష్టం చేసాయి. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్చకు ఎంతటి ప్రాముఖ్యత కల్పించిందో ఆర్టికల్ 19 (2) లో కూడా చాలా విషయాలు స్పష్టం చేసింది. భావ ప్రకటన పేరుతో ఇతరులను వ్యక్తిగతంగా కించపర్చరాదని మత విద్వేషాలు రెచ్చగొట్టరాదని, దేశ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయకూడదని మరి ముఖ్యంగా ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకూడదని కూడా తెలిపింది.

నచ్చని నేతలే టార్గెట్

ట్రోలింగ్ పెనుభూతాన్ని తుద ముట్టించకపోతే భవిష్యత్తులో ట్రోలింగ్ మాఫియాగా రూపాంతరం చెంది రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చే రాజ్యాంగేతర శక్తి గా అవతరించే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రధాని మోడీ దుస్తులపై ఫోటో షూట్‌లపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు నైతికంగా ప్రతిష్ట దెబ్బతీసే వీడియోలు అనేకం షికార్లు చేశాయి. ట్రోలర్స్ టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీ, శాసనసభ్యులు, ఎవరు మినహాయింపు కాదు. తాము ఒక భావజాలంలో బందీ అయ్యి తమకు నచ్చని నేతలను టార్గెట్ చేస్తారు. బౌతికంగా లేని గాంధీ, నెహ్రూను కూడా ట్రోలర్స్ వదలలేదు. వారిని కూడా ట్రోలర్స్ టార్గెట్ చేస్తున్నారు.

ట్రోలింగ్‌కి తాజా బలిజీవి

ఇప్పటికే సోషల్ మీడియా ట్రోలింగ్ అనేకమంది జీవితాలను బుగ్గిపాలు చేసింది. తాజాగా పొరుగురాష్టం ఆంధ్ర ప్రదేశ్‌లో గీతాంజలి అనే యువతి ట్రోలింగ్ విషనాగుకు బలి ఐన విషయం తెలిసిందే. ఒక సర్వే ప్రకారం సోషల్ మీడియా ట్రోలింగ్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయి. తప్పుడు ట్రోలింగ్‌తో చాలా కాపురాల్లో చిచ్చు పెట్టింది. నేర, హింసా ప్రవృత్తి వ్యాప్తిలో కూడా ట్రోలింగ్ ప్రభావం ఉంటున్నది అన్నది సర్వేలో తేలిన నగ్నసత్యం. సినిమా , రాజకీయాలు, వ్యాపార దిగ్గజాలను బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమ దందాలు చేసే స్థాయికి ట్రోలింగ్ మాఫియా ఎదిగింది.

ప్రత్యేక చట్టాలు తప్పదు

సామాజిక రుగ్మతగా పీడిస్తున్న ట్రోలింగ్ భూతంపై కొరడా విసరాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కఠినమైన చట్టలతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడం ప్రభుత్వ పరంగా జరగాలి. సామాజిక బాధ్యతగా పౌర సమాజం బాధ్యత స్వీకరించినప్పుడే బావ ప్రకటన స్వేచ వర్ధిల్లుతుంది. ట్రోలింగ్, ఫ్రాంక్, అనార్కిజం, ఓకిజం, పేరుతో విదేశీ సంస్కృతి భారతీయ సమాజంపై పంజా విసురుతోంది. ఆచార సాంప్రదాయాలు, పేరుతో చరిత్రలో జరిగిన దురాగతాలపై భారతీయ సమాజంలో ఆత్మవిమర్శ, చర్చ జరుగుతున్న సందర్భంలో విదేశీ విష సంస్కృతి మన దేశంపై ప్రభావం చూపడం సమాజ సమైక్య నిర్మాణానికి గొడ్డలి పెట్టు. నేటి సమాజంలో ప్రభావశీలిగా ఎదిగిన సోషల్ మీడియాపై ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం ఉంది.

- దొమ్మాట వెంకటేష్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

98480 57274

Tags:    

Similar News