జల సంక్షోభం..

తెలంగాణ రాష్ట్రంలో.. చుట్టూ జీవనదులు ప్రవహిస్తున్నా గొంతు తడుపుకోవడానికి కష్టాలు పడుతున్నారు....

Update: 2024-04-25 22:45 GMT
  • వర్షాభావంతో తాగునీటి కొరత: మేకిరి దామోదర్

మన దేశంలో ఎన్నికల పండుగ వచ్చింది. పార్టీల నాయకులు ఓట్లు, సీట్లు అధికార దాహంలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రజలు ఐదేళ్లకోసారి వారి అధికార దాహార్తిని క్రమం తప్పకుండా తీర్చుతున్నారు. కానీ ప్రజలకిచ్చిన హామీలు, సురక్షిత జల దాహార్తిని తీర్చడంలో మూడు అడుగులు ముందుకేస్తే! ముప్పైఅడుగులు వెనక్కేసినట్లు తాగు నీటి కొరతతో విలవిలలాడుతున్నారు జనం. వేసవి ప్రారంభంలోనే నీటి కొరత భయపెడుతుంది. దేశవ్యాప్తంగా 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిలువలు వాటి పూర్తి నిలువ సామర్థ్యంలో 38 శాతానికి పడిపోయాయి. ఇది గత దశాబ్ద కాలపు సగటు కంటే తక్కువ కావడం ఆందోళన కలిగిస్తుంది.


అధికార దాహం.. తీరని జల దాహం!

నేడు మన దేశంలో ఎన్నికల పండుగ పార్టీ(నాయకు)లు ఓట్లు, సీట్లు అధికార దాహంలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రజలు ఐదేళ్లకోసారి వారి అధికార దాహార్తిని క్రమం తప్పకుండా తీర్చుతున్నారు. కానీ ప్రజలకిచ్చిన హామీలు, సురక్షిత జల దాహార్తిని తీర్చక పోవడంతో తాగు నీటి కొరతతో జనం విలవిలలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులతో కూడిన దక్షిణాదిలో 42 ప్రధాన రిజర్వాయర్ల నిలువ సామర్థ్యం 53.334 బీసీఎం. కానీ ప్రస్తుతం 12.287బీసీఎం ల నీరు ఉంది. వాటి పూర్తి సామర్థ్యంలో ఇది 23% మాత్రమే. నిరుడు ఇదే సమయంలో( 39% ), పదేళ్ల సగటులో( 32) శాతం పోలిస్తే ఈ ఏడాది వాటిలో జలాలు తగ్గినాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు నేడు నీటి కొరతతో అల్లాడిపోతుంది. తాగునీటి ఎద్దడి మూలంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రజలు నిలదీస్తారని భయంలో పార్టీలు ప్రచారానికి వెళ్లడం లేదు.


గొంతు తడపని జీవనదులు

తెలంగాణ రాష్ట్రంలో.. చుట్టూ జీవనదులు ప్రవహిస్తున్నా గొంతు తడుపుకోవడానికి కష్టాలు పడుతున్నారు.సుదూర ప్రాంతాల్లోని పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నా కృష్ణా నది పక్కనే ఉంటున్న వేలాది మంది ప్రజల గొంతు మాత్రం తడవడం లేదు. కృష్ణా నది ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులలో సరిపడా నీళ్లు ఉన్నా.. దిగువ ప్రాంతాల ప్రజలు తాగునీటి కొరకు ఇబ్బందులుపడుతున్నారు. వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూత వేటు దూరంలో ఉన్న కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు తాగునీరు అందడం లేదు. నది సమీప ప్రజలకు ఆందోళనలో ఉన్నారు. బోరు బావులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. ప్రాజెక్టులలో నీటి కొరత, వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాలో జూరాల ప్రాజెక్టు కింద గద్వాల, వనపర్తి, శ్రీశైలం కింద నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో మే లో తాగునీటి సమస్య రానుంది. నాగార్జున్ సాగర్ నుంచి హైదరాబాద్, నల్గొండకు ఇబ్బంది రానుంది. పాలేరు కింద మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు జల సమస్య రానుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇబ్బందులు తప్పకపోవచ్చు. వర్షాలు పడకపోవటమే నీటి ఎద్దడికి కారణం.

ఇలా ఉండగా మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో 23 వేల 900వందల ప్రదేశాలకు ప్రస్తుతం తాగునీటి సరఫరా జరుగుతున్నది. నిర్వహణ ఇబ్బందుల నేపథ్యంలో ప్రతిరోజు 600 నుంచి 800 గ్రామాలకు తాగు నీటికి ఇక్కట్లుపడచున్నారు. రాష్ట్రంలో సురక్షిత జలాల నిర్వహణకు కేంద్ర బిందువైన "మిషన్ భగీరథ" పథకానికి ప్రధానంగా లీకేజీ, పైప్లైన్ల నిర్మాణం, నిర్వాహణ నాణ్యంగా లేకపోవటం, నల్లాల ఏర్పాటు సైతం సరిగా జరగకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. వీటిని సరి చేసి తక్షణమే ఆయా జిల్లాలలో ఎద్దడి తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఈ వర్షాభావ స్థితిలో ఆదిలాబాద్, ములుగు, ఖమ్మం, కొమరం భీం, నారాయణపేట, నాగర్ కర్నూల్ తదితర జిల్లాలలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిషన్ భగీరథ ఇంజనీర్లకు, ఉద్యోగులకు రెండు నెలల పాటు సెలవులు రద్దు చేసింది. సమస్య ఉన్న చోట వెంటనే పరిష్కరించాలి.

అతి వాడకంలో మనమే నంబర్‌ వన్

ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలను అవసరాలకు మించి మితిమీరి వాడు కుంటున్న జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. జలవినియోగంలో తగు జాగ్రత్తలు, పొదుపు పాటించకపోతే భవిష్యత్తులో పెనుముప్పు పొంచి ఉంది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి. సగటు నీటి లభ్యత గణనీయంగా తగ్గుతున్నందున సమగ్ర సమాచారంతో జలవనరుల సంరక్షణకు పూనుకుంటేనే భావితరాలకు మంచిది. లేకుంటే ముందు తరాల జీవనం ప్రశ్నార్థకమవుతుంది. నీరు సకల జీవరాశులకు ప్రాణాధారం. ప్రతి నీటి చుక్కను నిల్వ చేసుకుంటూ, వర్షపు నీరు వృధా కాకుండా చూడాలి. చెక్ డ్యామ్ నిర్మించి, భూగర్భ జలాలను పెంచాలి. సహజ సిద్ధ జలవనరులైన సరస్సులు, చెరువులు, నదులు వర్షం నీటితో కలకల్లాడేలా చూసుకోవాలి. వర్షపు నీటిని వృథాగా వదిలితే.. అవి ఉప్పుసముద్రం పాలే అనే సోయితో పాలకులు తక్షణమే తగు చర్యలు తీసుకోండి..


మేకిరి దామోదర్, సామాజిక విశ్లేషకులు, వరంగల్.

95736 66650


Similar News