సింగరేణికి సదా అన్యాయం!

‘నిజాం జమానాలోనే సింగరేణి మెజారిటీ షేర్‌లను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనుగోలు చేశారు..Latest Telugu News

Update: 2022-11-17 18:45 GMT

'నిజాం జమానాలోనే సింగరేణి మెజారిటీ షేర్‌లను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనుగోలు చేశారు. అప్పుడే, ఇక్కడి గోదావరి తీరంలోని బొగ్గు నిక్షేపాల మీద సింగరేణికి మాత్రమే హక్కు ఉండేలా ఒప్పందం చేసుకున్నారని అంటారు. అలా అయితే, కేంద్రానికి తెలంగాణ బొగ్గు బ్లాకుల మీద కేటాయింపు హక్కెక్కడిది? ఇప్పటికైనా సింగరేణిని నిర్వీర్యం చేసే వేలం వెర్రిని ఆపాలి. ఇక్కడి బ్లాకులను ఇక్కడికే చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే 'సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని' పీఎం అన్న మాటలు నిజమని నమ్ముతాం. అప్పటి దాకా నల్ల సూర్యుల పోరు కొనసాగుతూనే ఉంటుంది. దేశమంతా ప్రస్తుతం ప్రభుత్వ బొగ్గు సంస్థలలో బ్లాకుల కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. సింగరేణి, కోల్ ఇండియాకు అయినా కనీసం గతంలో మాదిరిగా దరఖాస్తు చేసుకోగానే బ్లాకులు కేటాయించే పరిస్థితి ఉండాలి.'

బొగ్గు బ్లాకుల కేటాయింపు విషయంలో ఇటు సింగరేణికి అటు కోల్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది. ఈ సంస్థలకు చెందాల్సిన బొగ్గు బ్లాకులను కేటాయించకుండా వేలానికి పెట్టి కార్పొరేట్‌లకు కట్టబెడుతోంది. అయినా సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం జరుగదని ఇటీవల జరిగిన రామగుండం సభలో పీఎం నరేంద్ర మోడీ చెప్పి వెళ్లారు. ప్రధానే స్వయంగా చెప్పారు కదా! ఇంకేమీ సమస్య లేదని చాలా మంది అనుకుంటున్నారు.

నిజానికి విషయం ఇక్కడ తప్పుదారి పట్టించడం జరిగింది. తవ్వడానికి గుర్తించి సిద్ధంగా ఉంచిన బొగ్గు బ్లాకులు 44 సింగరేణి చేతిలో ఉన్నాయి. ఇందులో సంస్థ తవ్వగలిగేవి 27 ఉన్నాయి. ఇవి తెలంగాణలోని గోదావరి తీరంలో ఉన్నా కేటాయింపులు మాత్రం కేంద్రం చేయాల్సి ఉంటుంది. సింగరేణి దరఖాస్తు చేసుకున్న నాలుగు బ్లాకులలో ఒకదానిని ఇప్పటికే అరబిందో అనే ప్రైవేట్ సంస్థకు కేంద్రం కేటాయించింది. ఈ ఒక్క బ్లాక్ మాత్రమే కాదు, మిగతా మూడు బ్లాకులను కూడా సింగరేణికి కేటాయించలేదు. దీనిని ప్రైవేటీకరణ కాకుండా ఇంకేమంటారు? సొంత బ్లాకులను ఇవ్వకుండా ప్రైవేట్‌వారికి కట్టబెట్టడాన్ని ఏమంటారు? ముమ్మాటికీ అది ప్రైవేటీకరణే అవుతుంది.

ఇలాంటి కేంద్రం విధాల వలననే ఇటీవల సింగరేణి కోట్లు ఖర్చు చేసి కూడా పెనుగడప, ఒడిశాలోని న్యూ పార్తపద బొగ్గు బ్లాకులను వాపస్ చేసింది. కోల్ ఇండియాలోనూ 33 శాతం షేర్‌ ప్రైవేట్‌కు అమ్మేశారు. దీనిని ప్రభుత్వ రంగాన్ని దెబ్బ తీసి ప్రైవేటీకరణకు దారి వేయడం అనరా?

అన్నింటా అదే విధానం

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు గతంలో కేటాయించిన 204 బొగ్గు బ్లాకులలో 172 బ్లాకులను 'కోల్ మైన్స్ స్పెషల్ ప్రోవిజన్' వేలం ద్వారా కేటాయించలేదా? దీనిని ఏమంటారు? ఇందులో 75 బ్లాకులలో ఉత్పత్తి జరుగుతున్నది నిజం కాదా? దీనిని ప్రైవేటీకరణ కాకుండా ఏమంటారు? తాజాగా 500 బ్లాకులను దశలవారీగా వేలం పెడుతున్నది నిజం కాదా? ఇప్పటికే 15 సార్లు వేలం వేశారు.

1 లక్షా 65 వేల కోట్ల సంపాదనను టార్గెట్‌గా పెట్టుకున్న కేంద్రం ఇప్పటికే బొగ్గు బ్లాకుల అమ్మకం ద్వారా రూ. 33 వేల కోట్లు గడించింది. ఈ నెల మూడు నుంచి తిరిగి తాజాగా 40 బ్లాకులను వేలం వేసే 90 రోజుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో సింగరేణికి చెందిన మూడు బ్లాకులు కేకే-6, శ్రవణ్‌పల్లి, సత్తుపల్లి, అటు భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సోమవరపు ఈస్ట్, వెస్ట్ బ్లాకులు కూడా ఉన్నాయి.

గతంలో ఎన్‌టీపీసీ, కర్ణాటక పవర్‌వాళ్లు తీసుకుని వాపస్ చేసిన మందాకిని బ్లాక్ కూడా ఉంది. ఇప్పటికే 500 బ్లాకుల పరిధిలోని 141 బ్లాకులలో 66 బ్లాకులకు దాదాపు 15 సార్లు ప్రకటనలు చేసి వేలం పిలిచినా ఎవరూ కోరుకోలేదు. ఇవన్నీ 2015లో తెచ్చిన ఎంఎండీఆర్ పరిధిలోనివే.

సుప్రీంకోర్టు ఆదేశం పరిధిలోని 204 బ్లాకులలో 172 పోను ఇంకా 32 బ్లాకులు మిగిలి ఉన్నాయి. వీటిని కూడ వేలం వేస్తున్నారు. కొత్తగా వేలంలో వీటిని పొందినవారు అంతకు ముందు నుంచే ఈ బ్లాకులు తవ్వుతున్నవారికి ఖర్చుల మీద 12 శాతం వడ్డీ ఇవ్వాలి. ఇందులో ఇదో లిటిగేషన్ ఉంది. ఇదీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి.

ఎవరి బ్లాకులు వారికి కేటాయించాలి

ఒకవైపు డీపీఈ గైడ్‌లైన్స్ ప్రకారమే, దేశంలోని సింగరేణి, కోల్ ఇండియా దాని అనుబంధ సంస్థలలో 11 వ వేతన ఒప్పందం కోసం జరుగుతున్న జేబీసీసీఐ-11 సమావేశాలలో జీతాలు ఎక్కువగా పెంచేది లేదని, మూడు శాతమే పెరుగుదల అనే వాదనలు ఉంటాయి. కోల్ ఇండియా షేర్ కొనుగోలు చేసిన ప్రైవేట్‌వారు జీతాల పెంపునకు ఒప్పు కోరు. ఇవన్నీ అబద్దాలేనా? చెప్పండి. నిజం ఏమిటి? నిజానికి నిజాం జమానాలోనే సింగరేణి మెజారిటీ షేర్‌లను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనుగోలు చేశారు. అప్పుడే, ఇక్కడి గోదావరి తీరంలోని బొగ్గు నిక్షేపాల మీద సింగరేణికి మాత్రమే హక్కు ఉండేలా ఒప్పందం చేసుకున్నారని అంటారు.

అలా అయితే, కేంద్రానికి తెలంగాణ బొగ్గు బ్లాకుల మీద కేటాయింపు హక్కెక్కడిది? ఇప్పటికైనా సింగరేణిని నిర్వీర్యం చేసే వేలం వెర్రిని ఆపాలి. ఇక్కడి బ్లాకులను ఇక్కడికే చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే 'సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని' పీఎం అన్న మాటలు నిజమని నమ్ముతాం. అప్పటి దాకా నల్ల సూర్యుల పోరు కొనసాగుతూనే ఉంటుంది.

దేశమంతా ప్రస్తుతం ప్రభుత్వ బొగ్గు సంస్థలలో బ్లాకుల కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. సింగరేణి, కోల్ ఇండియాకు అయినా కనీసం గతంలో మాదిరిగా దరఖాస్తు చేసుకోగానే బ్లాకులు కేటాయించే పరిస్థితి ఉండాలి. వేలంలో పాల్గొనడానికి సింగరేణి ప్రైవేట్ సంస్థ కాదు కదా? మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. రాజకీయ కోణంలో చూడొద్దు. కోల్ ఇండియాకు కూడ వేలం నుంచి మినహాయింపు ఇవ్వాలి.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223


Similar News