మేనిఫెస్టోలో నిరుద్యోగుల జాడేది?

Update: 2023-10-25 00:30 GMT

అవును తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి. మా నీళ్లు, మా నిధులు మా నియామకాలు మాకు వస్తాయని గల్లి నుండి ఢిల్లీ దాకా నాటి నాయకుల నుండి నేటి యువకుల దాకా ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, దాదాపు 1200 మంది యువకుల ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఏపూరి సోమన్న అన్నట్లు ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడు ఏలుతున్నడురో తెలంగాణ అన్నట్లు గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు. మా బతుకులు కూడా అలాగే ఉన్నాయని అనేకమంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి బాధ్యులు ఎవరు ప్రభుత్వమా.. లేక వ్యవస్థనా?

నిరుద్యోగ రేటులోనూ అగ్రస్థానమే!

నేడు దేశంలో తెలంగాణ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని సగర్వంగా ప్రకటించుకునే మన నాయకులకు, ఇటీవల విడుదలైన నివేదికల ఆధారంగా తెలంగాణ నిరుద్యోగ రేటులోనూ అగ్రస్థానంగా ఉందన్న విషయం బోధపడటం లేదా అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యల్లో నిరుద్యోగ సమస్య అతి కీలకమైంది. అలాంటి సమస్యను పెడదారి పట్టిస్తూ, ప్రస్తుత ఎన్నికల తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధికై ప్రకటించే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశాన్ని గుర్తించకపోవడం దారుణం. ఎంతసేపు వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఆసరా పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ అంటూ ఒకవైపు కులాల పేరుతో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అంటూ మరోవైపు ఒకరిని మించి ఒకరు హామీలిస్తున్నారే కానీ. మరి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నెముక అయినటువంటి యువకుల ప్రస్తావనేది... అంటే మీరు ఇచ్చే ముష్టి పెన్షన్ల కోసం కులాల పేరుతో కొట్టుకొని చావడానికి మిమ్మల్ని గెలిపించాల్నా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నోటిఫికేషన్లన్ని కోర్టుల్లో పెండింగ్

గత ఏడాది అసెంబ్లీ సాక్షిగా అతి త్వరలో 86 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని స్వయంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకు అనుగుణంగా నామమాత్రంగా వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. కానీ అందులో ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వానికి. ఇవే కాదు గత దశాబ్ద కాలంగా 200 పైచిలుకు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ లీకేజీల పేరుతో వాయిదాల పేరుతో ఇలా ఏదో ఒక కారణంగా విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాదు గతంలో ఇదే అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే ఏడాది నుండి రాష్ట్రంలోని అర్హత కల్గిన ప్రతి నిరుద్యోగికీ నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఆ మాటలు నీటిమూటల్లానే మిగిలిపోయాయి కానీ చేతల్లోకి రాలేదు. అప్పుల ఊబిలో చిక్కుకొని తలమునకలవుతున్న పక్క రాష్ట్రం. ఓ వైపు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మరోవైపు పాలనపరంగా నిధుల కొరతతో సతమతమవుతున్న విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ, విద్యా దీవెన, నిరుద్యోగ భృతి, ఆంగ్ల విద్య, ఉపాధి కల్పన కేంద్రాలను ఏర్పాటుచేస్తూ యువత అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. కానీ మిగులు నిధులతో ఉన్న తెలంగాణలో మాత్రం యువతకు సరైన అవకాశాలు లభించక ఆత్మహత్యలు పాల్పడుతుంటే ప్రభుత్వం మాత్రం మొక్కుబడి పేరుతో, పండుగల పేరుతో, ఇనాముల పేరుతో, నజరానాల పేరుతో కోటానుకోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం ఘోరాతిఘోరం.

ఆత్మహత్యల బాటలో యువత

ఉద్యోగం వస్తే మా బతుకులు బాగుపడతాయని అనేకమంది నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు కన్నతల్లిదండ్రులని పుట్టిన నేలను వదిలేసి ఉన్న కాసింత పొలాలను అమ్ముకొని కోటి ఆశలతో ఈ విశ్వ నగరానికి వచ్చి బతుకు జీవుడా అంటూ తిండి తినోతినకనో రాత్రనకా పగలనకా ఉద్యోగాలకై సన్నద్ధమవుతుంటే నోటిఫికేషన్ రాక వచ్చినా వాయిదా పడుతూ లేదా రద్దవుతూ, పరీక్షా ఫలితాలు విడుదలవ్వక సతమతమవుతూ ఇటు నచ్చని ఉద్యోగం చేయలేక అనేక మంది యువకులు మానసిక శోభను అనుభవిస్తూ ఆత్మహత్యే శరణ్యమని ప్రాణార్పణలకు పాల్పడుతున్నారు. ఈ తప్పు ఎవరిది..ఎంచుకున్న ప్రభుత్వానిదా లేదా వ్యవస్థదా? వీటికోసమా కొట్లాడి ఈ తెలంగాణ సాధించుకున్నది?

ఇప్పటికైనా తెలంగాణ సమాజంలోని రాజకీయ పార్టీలు మేల్కొని జరగబోయే ఎన్నికల్లో ప్రజలకు సోమరులుగా మార్చే ఉచిత హామీ పథకాల కంటే స్వయం కృషితో ఎదిగే పథకాలకు అలాగే విద్య వైద్యరంగాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరుతున్నారు మేధావి వర్గం. ఎందుకంటే ఉచిత పథకాలు ప్రస్తుతానికి రాజకీయంగా లబ్ధి చేకూర్చిన భవిష్యత్తు చాలా ప్రమాదకరం. దానివల్ల జరిగే అనర్ధాలకు భారీమూల్యం చెల్లించక తప్పదు.

అంజాద్ మియా

90005 17186

Tags:    

Similar News