అవి నేను కేజీహెచ్ క్యాజువాల్టీలో హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్న రోజులు.. ఆ రోజు సమయం సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఇంతలో అపస్మారక స్థితిలో ఉన్న ఒక అబ్బాయిని 108 సిబ్బంది తీసుకొచ్చి ఒక మంచం మీద పడేసి, సిఎంఓ దగ్గర సంతకం తీసుకుని వెళ్లిపోయారు. రోడ్డు పక్కన పడి ఉంటే పట్టుకొచ్చారట. నేనెళ్లి పరీక్షించాను. పల్స్ లేదు, బీపీ రికార్డు కాలేదు, కంట్లో లైటు వేశాను.. రియాక్షన్ ఏమీ లేదు, పీజీకి చెప్పి ‘బ్రాట్ డెడ్’ అని డిక్లేర్ చేశాము. ఇక దేహాన్ని మార్చురీకి తీసుకెళ్ళేవరకు అక్కడే ఉంటుంది. దానికి రెండు మూడు గంటలు పట్టొచ్చు.
నేను మిగతా పేషెంట్స్‌ని చూడటంలో మునిగిపోయాను. నా షిఫ్టు అయిపోయే సమయానికి అలా వెళ్తూ ఆ అబ్బాయిని మళ్లీ తేరిపారా చూసాను.. 17-18 ఏళ్ళ కుర్రాడు, ఉంగరాల జుట్టు, తెల్లని మేని ఛాయ, టీ షర్టు, జీన్స్ వేసుకొని, చేతికొక ఉంగరం, బలిష్టంగా కూడా ఉన్నాడు. బయట గాయాలేం లేవు. అతని చావుకి కారణం శవ పంచనామాలో తేలుతుంది. కానీ నాకు ఆ రోజు ఇంటరు ఫలితాలొచ్చాయని తెలుసు. ఇదొక ఆత్మహత్య అని నాకు అవగతం అయ్యింది. చాలా బాధేసింది. ఆ తల్లిదండ్రులు ఈ అబ్బాయి జాడకోసం వెదుకుతుంటారు. ఇక ఈ విషయం వాళ్లకి ఎప్పటికీ తెలియకపోవచ్చు.. ఆ అబ్బాయి ముఖం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
అయితే, మన దేశంలో జరిగే విద్యార్థి ఆత్మహత్యలు ఎవ్వర్నీ కలవరపెట్టకపోవటం నన్ను ఆశ్చర్యపరిచే విషయం. అసలు మానసిక అనారోగ్యం మనకి రాదు, లేదా మా ఇంట్లో లేదు, ఉన్నా అదొక కొత్త పోకడ లేదా నటన అనుకునేవాళ్లు ఉన్నన్నాళ్లు ఇది ఆగదు. పిల్లలతో సమయం గడపకపోవడం, కేవలం సంపాదన లేదా, ఇంట్లోపని మీదనే దృష్టిపెట్టడం, పిల్లల్ని ఆడుకోనివ్వకపోవడం, పిల్లలకి అభిరుచుల పట్ల శ్రద్ధ కల్పించకపోవడం, అలాగే క్లిష్ట సమయాల్ని తట్టుకునేందుకు వారికి 'కోపింగ్ స్కిల్స్' నేర్పకపోవడం, భవిష్యత్తు గురించి భయానికి గురి చెయ్యటం, విజయాల్లేని జీవితం వ్యర్థమని చూపించటం, కొన్ని వృత్తుల పట్ల చిన్న చూపు... ఇలా ఎన్నో అంశాలు పిల్లల మీద ప్రభావం చూపడానికి దోహదమవుతున్నాయి.
బడుల్లో, కళాశాలల్లో ఆటస్థలాలు లేకపోవడం, ఇంకొకరితో మాట్లాడనివ్వకుండా గంటల కొద్దీ స్టడీ అవర్లు నిర్వహించటం, సరిగా నిద్ర తీరకముందే లేపటం, పరీక్షలు ఎక్కువగా నిర్వహించటం, సెలవులు తక్కువ ఇవ్వటం, స్థాయికి మించిన విషయాల్ని బోధించటం, విద్యార్థులని మార్కుల బట్టి విభజించటం, మార్కుల కోసం ఒత్తిడి తీసుకురావటం వంటివి కూడా పెద్ద అంశాలు ఇందులో...
వ్యవస్థలోనూ.. పిల్లల్లో మానసిక సమస్యల్ని గుర్తించకపోవడం, ఎగతాళి చెయ్యటం, విద్యా విధానంలో మార్పులు లేకపోవడం, విద్యా సంస్థల మీద అదుపు లేకపోవడం, అవినీతి, చదివిన చదువుకి ఉద్యోగావకాశాలు కల్పించకపోవడం, డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ని గుర్తించకపోవడం, పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే వనరులు లేకపోవడం, వంటి కారణాలన్నీ కలిసి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భారతీయ విద్యావిధానంలో సమూల మార్పులు జరగాలి. లేదంటే మనపిల్లలని మనమే చంపుకునే క్రూరమైన దేశంగా భారత్ మారుతుంది. మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకున్న మూర్ఖులవుతాం.
-శ్రీకాంత్ మిరియాల
ట్విట్టర్ నుండి సేకరణ