ప్రశ్నించే గొంతుకను మండలికి పంపుదాం

ప్రశ్నించే గొంతుకను మండలికి పంపుదాం... send the questioning voice to the council says av sudhakar

Update: 2023-01-30 18:45 GMT

ప్రశ్నించడం మానేస్తున్నావా! అయితే బానిసత్వానికే అలవాటు పడుతున్నావు కదా! అన్న అంబేడ్కర్ మాటలు ప్రజాస్వామ్య వ్యవస్థలో 'ప్రశ్నించడం'కు ఉన్న ప్రాధాన్యతను విశదీకరిస్తున్నాయి. ప్రశ్న ఆలోచనలకు మూలం. ప్రశ్నించడం చైతన్యానికి సంకేతం. ప్రశ్నించలేని సమాజం నిస్తేజమై, బానిస విధానాలకు అలవాటై యాంత్రిక జీవన విధానాన్ని కొనసాగిస్తుంది. అందుకే ప్రశ్న బతకాలి. ముఖ్యంగా రాజ్యాంగబద్దంగా నిర్మితమైన చట్టసభల్లో ప్రశ్న వినిపించాలి. ప్రశ్నించే గొంతుక ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్య విలువలు, హక్కులు పరిరక్షింపబడతాయి.

మనం గుర్తించాల్సింది అదే..

మన రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి అనే రెండు చట్టసభలున్నాయి. ఇందులో మండలిని పెద్దల సభగా అభివర్ణిస్తారు. ఇందులోని సభ్యులని ఎమ్మెల్సీలుగా పేర్కొంటారు. వీరిలో కొందరిని స్థానిక సంస్థల ప్రతినిధులు, మరికొందరిని అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. చట్టసభల్లో మేధావులు ఉండటం ఆ వర్గాలకే కాదు రాష్ట్రానికి, దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రయోజనం. తమ అనుభవంతో రాజకీయాలకు అతీతంగా దూరదృష్టితో ఆలోచించి మెరుగైన వ్యవస్థ కోసం నిర్మాణాత్మక, విధానపరమైన సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం ఈ సభ సభ్యుల కర్తవ్యం. అలాగే వివిధ స్థాయిల్లోంచి వచ్చిన సభ్యులు ఉండటంతో అందరి ప్రయోజనాలను నెరవేరే విధంగా పాలక పక్షానికి మార్గదర్శనం చేయగలగాలి. అధికారపక్షం కొన్ని సందర్భాల్లో ఎన్నికల చట్టాలు చేస్తుంటుంది. అందుకే ఆ చట్టాల దీర్ఘకాలిక ప్రభావాలు, మంచి చెడులను ఆలోచనాత్మకంగా విశ్లేషించి, సమర్థతతో తగిన మార్పులు, చేర్పులు చేసేలా శాసనమండలి సభ్యులు కృషి చేయాలి.

ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ అభ్యర్థులను గెలిపించాలని టీచర్ల వద్దకు వస్తున్నారు. అందులో ఉద్యమ నేపథ్యం ఉన్నవారు, అధికారపక్షంతో అంటకాగి ఉద్యమాలతో ఏమీ సాధించలేమని, అందుకే పాలకపక్షంతో జత కట్టాలని టీచర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేధావులమైన మనం లాబీయింగ్, పైరవీల ద్వారా సమస్యలు పరిష్కారం కావనేది గుర్తించాలి. అలాగైతే రాష్ట్రం ఏర్పడేదా!

రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి

ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయి. అందుకే ఉద్యమకారుడు ఎమ్మెల్సీ అయితే చట్టసభలో ఉపాధ్యాయ వాణి వినిపించగలడు. ఇంతకాలం పాలకపక్షం సపోర్టుతో గెలిపించిన నాయకులు మన పక్షాన పోరాడితే సీపీఎస్ ఎందుకు రద్దు కాలేదు, జీఓ 317 అప్పీళ్లు ఎందుకు పరిష్కరింపబడలేదు, పండిట్, పీఈటీ అప్గ్రేషన్ ఎందుకు కాలేదో ఆలోచించండి. కల్లబొల్లి మాటలతో మనల్ని మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండండి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయ ఎన్నికల స్థాయికి దిగజారడం బాధాకరం. బూటకపు వాగ్దానాలు చేయడం, టీచర్లను ప్రలోభపెట్టడం, కేడర్ వారీగా, కులాల వారీగా టీచర్లను చీల్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది మేధావి వర్గంగా భావిస్తున్న ఉపాధ్యాయ లోకానికి చేటు కలిగిస్తుంది.

ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల వల్ల విద్యారంగం ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తోంది. ఉపాధ్యాయులు చిరకాలంగా పోరాడి సాధించుకున్న హక్కులన్నీ క్రమంగా హరించుకుపోతున్నాయి. టీచర్లకు ప్రమోషన్లు లేక హైస్కూల్స్ అన్ని సబ్జెక్టు టీచర్ల కొరతతో, ప్రధానోపాధ్యాయుల కొరతతో కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ పోస్టులు భర్తీకాక అనేక పోస్టులు ఖాళీగా మిగిలాయి. స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్స్ విడుదల సక్రమంగా జరగకపోవడంతో పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారింది. ఇలా పాఠశాల విద్యారంగం సమస్యలతో సతమతమైపోతుంటే ఇవేమి పట్టని ప్రభుత్వం, విద్యాధికారులు మాత్రం సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటి మధ్యలో పనిచేయాలంటూ టీచర్లకు కర్తవ్యబోధ చేయడం విడ్డూరం.

అటు ప్రభుత్వం, అధికారులు, ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకొని టీచర్లను ఇబ్బంది పాలు చేయడం, ఉపాధ్యాయ సంఘాలను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు చేయడం రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గ ప్రతినిధిగా చట్టసభకు ఎవరిని పంపాలో టీచర్లు ఆలోచించాలి. పార్టీల మీద అభిమానంతో, నాయకుల మీద భక్తితో కాకుండా మనసాక్షిగా, వివేచనతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగని నీతి, నిజాయితీ సమర్థత కలవారిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి. తద్వారా చట్ట సభలో ఉపాధ్యాయ వాణిని వినిపించేలా టీచర్లు ఓటును సద్వినియోగ పరచుకోవాలి.

ఏ.వి.సుధాకర్ 

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Also Read...

అసమానతలపై ప్రశ్నించిన- మూక్ నాయక్ 


Tags:    

Similar News