లౌకికవాదులారా మౌనాన్ని వీడండి?
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న రెండు ప్రధాన అంశాలు భారతదేశంలోని లౌకికవాదానికి తీవ్రమైన రెండు ప్రశ్నలను సంధిస్తున్నాయి. ఒకటి అజ్మీర్
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న రెండు ప్రధాన అంశాలు భారతదేశంలోని లౌకికవాదానికి తీవ్రమైన రెండు ప్రశ్నలను సంధిస్తున్నాయి. ఒకటి అజ్మీర్ దర్గా చారిత్రక ప్రాశస్త్యాన్ని కోర్టులో కేసులు వేసి వివాదంలోకి లాగడం, రెండవది, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారతదేశంలోని లౌకిక వాదులు, ప్రతిపక్ష నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు మౌనంగా ఉండటం సరైనవి కావు. ఈ రెండు అంశాలు సమాజంలో మతతత్వం విస్తరణను, లౌకిక, హేతువాద, మానవత్వ విలువల పతనాన్ని సూచిస్తున్నాయి.
ఇప్పుడెందుకు వివాదం
అజ్మీర్ దర్గా అనేది భారతీయ సాంస్కృతిక సమ్మేళనకు చిహ్నం. సూపీ సంప్రదాయం ద్వారా ప్రేమ, సహనంతో కూడిన జీవన విధానాన్ని ప్రచారం చేసిన ఈ స్థలం. శతాబ్దాలుగా అన్ని మతాల ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అయితే, బీజేపీ నేత మదన్ రాథోర్ చేసిన ఆరోపణలతో ఈ స్థలం ఒకప్పటి శివాలయం అంటూ కోర్టు వివాదంలోకి లాగబడింది. గతంలో ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల నాడు జరిగిన చారిత్రక సంఘటనలను ఇప్పుడు వివాదంలోకి లాగి రచ్చ చేయడం ఎంత మాత్రం సరైంది కాదు. ఎప్పుడో ఎవరో పాలకుడు చేసిన తప్పిదాల ఆధారంగా ఈ రోజున కోర్టులో కేసులు వేయడం, వాటిని కోర్టులు విచారణకు స్వీకరించటం ఖండించతగినవి. ఇలాంటి చర్యలు దేశంలోని శాంతియుతంగా సహజీవనం చేస్తున్న ప్రజల మధ్య మత సామరస్యానికి హాని కలిగించే చర్యగా భావించవచ్చు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీ సోదరులపై దాడులను ఎందుకు లౌకిక ప్రజాస్వామిక వాదు లు ఖండించరు? ఇది మూర్కత్వం కాదా?
పార్టీలకు, భావజాలాలు పక్కకు పెట్టి..
ఇక రెండో విషయం. బంగ్లాదేశ్ విషయానికి వస్తే, అక్కడి హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడు లు మరింత హేయమైన చర్య. అక్కడి దృశ్యాల వీడియోలు చూస్తుంటే మానవత్వం కలవారికి మనసు వికలం అవుతుంది. అక్కడి ఇస్లాం మత ఛాందసవాదుల హింసాత్మక చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమాయక హిందూ మైనార్టీ ప్రజ లు అన్యాయంగా దౌర్జన్యాలకు గురవుతున్నారు. కరుడుగట్టిన మూర్కపు ఇస్లామిక్ మతతత్వవాదులు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకు ని చేస్తున్న దాడులపై భారతదేశంలోని లౌకికవాదులు మౌనం వహించడం ప్రశ్నార్థకమే కాదు. క్షమించరాని నేరం కూడా. మతతత్వాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించే మన ప్రతిపక్ష నేతలు, ముఖ్యం గా మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం పోరాడే అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్‌గాంధీ, వామపక్ష నేతల నోళ్లు ఒక్కసారిగా పడిపోయాయా? పక్ష పాత ధోరణితో, పక్షవాదరోగం వచ్చిందా? మానవత్వం మంటకలుస్తుంటే ఖండించని నాయకులెందుకు? ముఖ్యంగా పార్లమెంట్‌లో, మీడియాముందు ఈ అంశంపై స్పందించకపోవడం క్షమించరాని నేరం కాదా? ఈ విషయంలో పార్టీలకు, భావజాలాలకు, ఇజాలకు అతీతంగా భారత ప్రభుత్వం తీసుకొనే చర్యలకు అందరూ తమ మద్దతు ఇవ్వాలి.
లౌకికత కాపాడటానికి..
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ స్ఫూర్తిపై ఆధారపడి ఉంది. అందుకే అన్ని రకాల మతతత్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవస రం మరింత అత్యవసరం అవుతుంది. కేవలం మెజారిటీ మతతత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసు కుని, మైనారిటీ మతతత్వాన్ని పట్టించుకోకపోవడం లౌకిక భావాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. సమాజంలో సత్యాన్వేషణకు, సహనానికి అడ్డుగా మారుతున్న మతతత్వ ప్రభావాలను ఎదుర్కోవడంలో విపక్షాలు, హేతువాదులు, మానవతా వాదులు, లౌకికవాదులు, ప్రజాస్వామిక వాదులు అందరూ ఐక్యంగా కలిసి రావాలి. స్పష్టమైన వైఖ రిని తీసుకోవాలి. భారతదేశ యువతను సంఘ్ పరి వార్ నెరేటివ్స్ నుంచి రక్షించాలంటే, సమగ్ర లౌకికవాద దృక్పథాన్ని ప్రోత్సహించడం ఒక్కటే మార్గం. అన్ని రకాల మతతత్వ మూలాలకు వ్యతిరేకంగా సమదృష్టితో నిలబడగలిగితేనే లౌకికవాదం, మానవత్వం బలపడుతుంది. మౌనం లౌకికతకు శత్రువు. మతతత్వాన్ని వ్యతిరేకించాలను కుంటే ప్రతీ ఘటనపై న్యాయంగా, ధైర్యంగా స్పందించాలి. మౌనం వీడాలి. ఈ మౌనం లౌకికవాదాన్ని బలహీనపరచడమే కాకుండా, మతతత్వ ఫాసిస్టు శక్తులకు బలాన్ని చేకూరుస్తుంది. లౌకికతను కాపాడటానికి అన్ని వర్గాల ప్రజలు, నాయకులు మౌనాన్ని విడనాడాల్సిన తరుణం ఆసన్నమైంది.
డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్,
98493 28496