కత్తెర మెడకు కాలం ఉరి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతానికి చెందిన మేర కిష్టయ్య కుటుంబం నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చింది. కిష్టయ్యకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు.

Update: 2022-06-13 18:45 GMT

సర్ మా నాయిన చనిపోయిండు. శవాన్ని ఇంటికి తీసుకొస్తం. అక్కడి నుంచే అంత్యక్రియలు చేస్తం' అనగానే ఓనర్ ఒంటికాలి మీద లేచాడు. 'మీ సామాన్ ఇప్పుడే బయటపడేస్తా. నా ఇంటికి తెచ్చేది లేదన్నాడు' ఏం చేయాలో అర్థం కాలేదు. పోస్టుమార్టం పూర్తి కాగానే నేరుగా అల్వాల్ శ్మశానవాటికకు తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. 'సూతకం ఉన్నోళ్లు మా ఇంటికి రావద్దనడంతో' అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయలేక, వేరే చోట ఉండలేక నానా పాట్లు పడ్డారు. పది మంది వర్కర్లు. మల్లేపల్లిని ఏలిన అలనాటి దర్జీ రాజు టైలర్ కిష్టయ్య జీవితం చివరకు అలా జరిగిపోయింది! దర్జీ కత్తెర తుప్పు పట్టింది. కష్టాన్నే నమ్ముకున్న కుటుంబాలకు కన్నీరే మిగిలింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతానికి చెందిన మేర కిష్టయ్య కుటుంబం నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వలసొచ్చింది. కిష్టయ్యకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. మల్లేపల్లిలో కిరాయికి మడిగె తీసుకొని టైలర్ షాపు నడిపేవాడు కిష్టయ్య. ఇద్దరు కొడుకులకు చేతినిండా పని ఉండేది. అందుకే అందరూ దర్జీ పనిలోనే ఉండిపోయారు. ఇద్దరు కూతుళ్లలో పెద్దమ్మాయిని సిరిసిల్లకు, రెండో అమ్మాయిని నిజామాబాద్‌కు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు.

ఇద్దరు అల్లుళ్లు కూడా దర్జీ వృత్తిలో బాగానే సంపాదిస్తున్నారు. 1990 ప్రాంతంలో రెడీమేడ్ ఊపందుకుంటున్నది. గిరాకీ తగ్గడం మొదలైంది. ముగ్గురు కొడుకులూ వేరే కాపురం పెట్టారు. పెద్దకొడుకుకు తాను నడిపిన షాపు వచ్చింది. పరిచయం ఉన్న ప్రాంతం కావడంతో పెద్దకొడుకు రమేశ్​వద్దే ఉండిపోయాడు కిష్టయ్య. అంతలోనే కిష్టయ్య భార్య సత్తెమ్మ అనారోగ్యంతో కాలం చేసింది. భార్యను కోల్పోయిన దు:ఖం కిష్టయ్యను వెంటాడుతూనే ఉన్నది. రెండో కొడుకు సురేశ్ అల్వాల్‌లో టైలర్ షాపు పెట్టాడు. చిన్న కొడుకు కిషన్ తన అత్తగారి ఊరు కరీంనగర్ బాట పట్టాడు. అక్కడే టైలర్ పనిచేద్దామని కుటుంబంతో సహా వలసెళ్లాడు. ఫత్తర్‌ఘట్టిలో ఉన్న సొంతింటిని అమ్మేశారు. డబ్బును పంచేసుకున్నారు. తండ్రిని తలా ఒక నెల రోజులు సాకాలని కాగితాలు రాసుకున్నారు.

*

రెడీమేడ్ రంగం గద్దలా విస్తరించడంతో రమేశ్ ​గిరాకీ డౌన్ అయ్యింది. దసరా, రంజాన్ సీజన్లలో రేయింబవళ్లూ చేసినా తరగని పని ఉండే షాపులో మిషన్ శబ్దం వినపడడం గగనమైపోయింది. రమేశ్‌కు ఒక పాప, ఒక బాబు. వాళ్లకు స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితి వచ్చింది. జూన్ వచ్చిందంటే చాలు అప్పులు చేయక తప్పని దీనస్థితి. ఉన్నట్టుండి. ఒక రోజు రాత్రి కిష్టయ్యకు నోటి మాటపడిపోయింది. కాలు, చేయి ఆడలేదు. కొడుకును ఎలా నిద్రలేపాలో తెలియక. తన పక్కనే ఉన్న వాటర్ గ్లాస్‌ను ఒక చేత్తో తలుపుకేసి కొట్టాడు.

అందరూ మేల్కొన్నారు. ఏమైంది బాపూ? ఏమైంది? అంటున్నారు. కిష్టయ్యకు నోటి మాట రావడం లేదు. బలాన్నంతా కూడదీసుకున్నా కాళ్లు, చేతులు కదలడం లేదు. ఇంటిపక్కనే ఉన్న ఆటో శంకర్‌ను నిద్రలేపారు. హుటాహుటిన ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు.తనకు తెలిసిన మేల్ నర్స్ అక్కడ డ్యూటీలో ఉండటంతో అడ్మిట్ చేశాడు రమేశ్. డ్యూటీ డాక్టర్ వచ్చి చూసి పక్షవాతమని తేల్చాడు. కొంచెం ట్రై చేస్తే మాటొస్తుందన్నాడు. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జి చేశాడు. పరిస్థితిని అల్వాల్‌లో ఉన్న తమ్ముడు సురేశ్‌కి చెప్పాడు రమేశ్. పరిస్థితిని అర్థం చేసుకున్న సురేశ్​భార్య వారించినా, తండ్రి కిష్టయ్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. అద్దె ఇల్లు కావడంతో ఓనర్‌ను బుజ్జగించి ఒప్పించాడు.

*

రోజూ ఉదయాన్నే తండ్రికి సపర్యలు చేయడం. షాపుకు వెళ్లడం చేస్తుండేవాడు సురేశ్. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తండ్రిని కూర్చోబెట్టుకొని భోజనం చేసేవాడు. తన నిస్సహాయ స్థితిని చూసి తండ్రి ఏడుస్తుంటే ఊరడించేవాడు. సురేశ్ పరిస్థితీ అంతే, గిరాకీ పడిపోయింది. ఆల్ట్రేషన్ వర్క్ తప్ప కొత్తవి రావడం లేదు. పేషెంట్ ఇంటిలో ఉండటంతో వాసన వస్తున్నదంటూ రోజూ గొడవకు దిగుతున్నాడు ఇంటి యజమాని. ఆరోగ్యం క్షీణించడంతో కిష్టయ్య పట్టుకున్నా నిలబడని స్థితికి వచ్చాడు. దవాఖానలో చూపిద్దామంటే డబ్బులు లేవు. అప్పు కూడా పుట్టని పరిస్థితి.

కరీంనగర్‌లో ఉండే తమ్ముడు కిషన్‌కు ఫోన్ చేశాడు. పరిస్థితి అంతా చెప్పాడు. ఒకసారి రావాలని అడిగాడు. కిషన్ తన తండ్రిని చూసేందుకు అల్వాల్ వచ్చాడు. చిన్నకొడుకును చూసిన కిష్టయ్య బోరుమన్నాడు. ఇంట్లో ఒక్కసారిగా వాతావరణం బరువెక్కింది. భోజనం చేస్తూ తన పరిస్థితిని అన్న సురేశ్‌కు చెప్పాడు కిషన్. తానూ కిరాయికే ఉంటున్నానని, టైలర్ షాపు కిరాయిలు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, కొన్ని రోజుల పాటు ఓ రెడీమేడ్ షాప్‌లో అల్ట్రేషన్ వర్క్ చేశానని, అక్కడా పనిదొరకలేదన్నాడు. దిక్కుతోచని స్థితిని ఓ పెట్రోలు బంక్ లో పనిచేస్తున్నానంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు కిషన్.

*

ఈ మాటలన్నీ పక్కరూంలో బెడ్ మీద పడుకొని వింటున్న కిష్టయ్య తీవ్ర మనస్తాపం చెందాడు. కడదాకా తోడుంటుందనుకున్న భార్య కాలం చేసింది. కొడుకుల పరిస్థితి దయనీయంగా ఉంది. తాను బతకడం అవసరమా? అనుకున్నాడు. ఆ రాత్రికి కిషన్ అన్నవద్దే ఉన్నాడు. అందరూ నిద్రలోకి జారుకున్నారు. కిష్టయ్య కర్ర సాయంతో మెల్లిగా తన సత్తువను కూడ దీసుకొని టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. యాసిడ్ బాటిల్ మూత తీసుకొని గటగటా తాగేశాడు. మంట భరించలేక అరుస్తూ కింద పడిపోయాడు.

శబ్దానికి మేల్కొన్న కొడుకులు కోడలు, మనుమలు పరిగెత్తుకొని వచ్చారు. బాపూ, బాపూ అంటూ అరుస్తున్నారు. నోట్లోంచి నురుగు వస్తున్నది. పక్కన యాసిడ్ బాటిల్ పడి ఉంది. ఎంత పని చేసినవే, అంటూ రోడ్డుపైకి పరుగులు తీశాడు సురేశ్. రోడ్డు వెంటపోయే ఆటోను ఆపి తీసుకొచ్చాడు. ఇద్దరు కొడుకులు కిష్టయ్యను తీసుకొని గాంధీ దవాఖానకు వెళ్లారు. అర్ధరాత్రి కావడంతో డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాడు. యాసిడ్ తాగాడంటున్నారు కదా కష్టం, సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నాడు. అరగంటలో నర్స్ బయటికి వచ్చి కిష్టయ్య తాలూకు ఎవరైనా ఉన్నారా? అడిగింది. ఉన్నామంటూ లేచి నిల్చున్నారు అన్నదమ్ములు. డాక్టర్ గారు రమ్మంటున్నారు అనగానే వీరికి ఒకింత భయం వేసింది. అయినా తప్పదు కదా డాక్టర్ వద్దకు వెళ్లారు.

*

సారీ, మీ నాన్న చనిపోయారు. అని చెప్పగానే బోరుమన్నారు. నాయినా, ఎంత పనిజేస్తివే, మా బతుకులు ఇట్ల తగులవడ్డయని యాసిడ్ తాగితివా నాయినా, మేమేం జేయాల్నే అంటూ శవం మీదపడి రోదించారు. పోస్టుమార్టం చేసి శవాన్ని అప్పగిస్తామన్నారు డాక్టర్లు. సరికొత్త సమస్య. సొంతూరిలో ఇల్లు లేదు. పత్తర్‌ఘట్టీ ఇల్లు అమ్మేశారు. శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లాలో అర్థం కాలేదు. రమేశ్​ఉంటున్న ఇల్లు చిన్నది. ఆ ఇంటి ఓనర్ ఒప్పుకోడు. కరీంనగర్‌లో కిషన్‌కు ఉన్నది కిరాయి ఇల్లే. అంతదాక తీసుకుపోలేం.

సురేశ్ తన ఇంటి ఓనర్ కు కాల్ చేశాడు. 'సర్ మా నాయిన చనిపోయిండు. శవాన్ని ఇంటికి తీసుకొస్తం. అక్కడి నుంచే అంత్యక్రియలు చేస్తం' అనగానే ఓనర్ ఒంటికాలి మీద లేచాడు. 'మీ సామాన్ ఇప్పుడే బయటపడేస్తా. నా ఇంటికి తెచ్చేది లేదన్నాడు' ఏం చేయాలో అర్థం కాలేదు. పోస్టుమార్టం పూర్తి కాగానే నేరుగా అల్వాల్ శ్మశానవాటికకు తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. 'సూతకం ఉన్నోళ్లు మా ఇంటికి రావద్దనడంతో' అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయలేక, వేరే చోట ఉండలేక నానా పాట్లు పడ్డారు. పది మంది వర్కర్లు. మల్లేపల్లిని ఏలిన అలనాటి దర్జీ రాజు టైలర్ కిష్టయ్య జీవితం చివరకు అలా జరిగిపోయింది! దర్జీ కత్తెర తుప్పు పట్టింది. కష్టాన్నే నమ్ముకున్న కుటుంబాలకు కన్నీరే మిగిలింది.

ఎంఎస్ఎన్ చారి

79950 47580

Tags:    

Similar News