భారత్‌ను పీడిస్తున్న రుణభారం!

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ భారత కరెన్సీ చరిత్రలోనే అత్యంత కనిష్ట (క్షీణ) దశకు పతనమవుతోంది.

Update: 2025-01-10 01:00 GMT

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ భారత కరెన్సీ చరిత్రలోనే అత్యంత కనిష్ట (క్షీణ) దశకు పతనమవుతోంది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 85.79 కనిష్ట స్థాయికి దిగజారింది. దేశానికి అంతర్జాతీయ ఆర్థిక పరపతి రానురానూ తగ్గిపోతోంది. అప్పులు, పెట్టుబడులు పుట్టని తీరుకు దారితీస్తుంది. ఆ మేరకు 2025 మార్చి కల్లా మొత్తం దేశ రుణభారం రూ.181.6 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. దేశంలో ప్రభుత్వం చేసిన అప్పుల్లో 67 శాతం కేంద్రం ఖాతాలోనివే, మిగిలింది రాష్ట్రాలు చేసినవి. 

కేంద్రం, రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ నిర్వహణ నిబంధనలు విస్మరిస్తూ ఆర్థిక నిపుణుల సూచనలు పాటించకుండా మరీ పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు చేసిన అప్పులు ప్రజలకు గుది బండగా మారాయి. మరోవైపు ఆదాయం మెరుగుపడకపోవడంతో సంక్షేమ పథకాల అమలు కోసం తరచూ అప్పులు చేయవలసి వస్తోంది.

నిపుణుల సూచనలు లెక్కచేయకపోతే..

దేశంలోని పాలకులకు ముందుచూపు ఆర్థిక క్రమశిక్షణ లేని విధానాలు ఆవలంభించడంతో మన దేశంలోని పెట్టుబడులకు భద్రత కరువవుతుందని పారిశ్రామిక వేత్తలు, పెట్టబడిదారులు భావిస్తున్నారు.. దీంతో పెట్టుబడులు ఇతర దేశాలకు తరలిపోతాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశంలో వాటికి వడ్డీలకే సర్కారీ ఆదాయం కరిగిపోతుంది. అభివృద్ధి అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఇలాంటి విధానాల మూలంగానే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఒక్క శాతం జనాభా చేతిలోనే దేశ ఆర్థిక సంపద కేంద్రీకృతం అవుతుంది. దీనితో సమ్మిళిత అభివృద్ధి సాధ్యం కావడం లేదు. పైగా ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి దేశం, రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా పార్టీలు అమలు చేయలేని హామీలను ఇస్తుంటారు. ఆ తర్వాత వాటి అమలుకు అప్పులు చేసి కాలం గడిపేస్తారు. ఇలాంటి ప్రభుత్వాల విధానాలతో అప్పులు పెరిగిపోతున్నాయి. వాటి వడ్డీలకు మళ్లీ అప్పులు చేస్తున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు (దుబారాను)తగ్గించుకొని ఆదాయం పెంచే మార్గాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. సంపన్న, పెట్టుబడిదారుల సంపదపై అదనపు పన్నులు వేసి, పన్నుల ఎగవేతను కఠినంగా అరికట్టాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించక, ఆర్థిక నిపుణుల సూచనలను లెక్కచేయని పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లోని దుర్భర పరిస్థితి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. లేదంటే దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలకులు ఆర్థిక నిపుణుల సూచనలు పాటించకుండా ఇలానే ప్రభుత్వాలు పాలన విధానాలు కొనసాగిస్తే ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీస్తుంది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణానంతరం మందు (ఔషధం) ఇవ్వడం లాంటిదే అవుతుంది.

రూపాయి పతనానికి కారణాలు..

ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉండడం, ముడి చమురు ధరల పెరుగుదల, ఆర్థిక క్రమశిక్షణ లేమి, దుబారా పెరిగిపోవడం, ఎగుమతులు పెంచి దిగుబడులు తగ్గించుకోవడంలో పాలన విధానంలో చిత్తశుద్ధి లేకపోవడం లాంటి తదితర విధానాల మూలంగా రూపాయి పతనానికి దారి తీస్తుంది. మన దేశ జనాభాలో 60 శాతం, 35 ఏళ్లలోపు వారే.. ఈ యువ శక్తిని జనాభాలో సగ భాగమైన మహిళా శక్తిని నిపుణ వనరులుగా తీర్చిదిద్ది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి. అలా దేశ ఉత్పాదక శక్తి పెంచుకోవడం వల్ల ప్రగతికి దారులు పడతాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందన్న సర్కారీ ప్రచారం తోడు జీడీపీ మెరుపులకు సమాంతరంగా జనం బతుకుల్లో వెలుగులు నింపాలి. అంటే ఉపాధి సహిత అభివృద్ధి జరగాలి.

మన దేశం వ్యవసాయ ఆధారిత జనాభా 60 శాతంకు పైగా ఉంటారు. అందువల్ల వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో సంపన్న దేశాలతో పోటీపడి అభివృద్ధిని సాధించాలి. అతి ప్రధానంగా దిగుమతులపై దృష్టి సారించి, ఆయా దిగుమతుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకునే విధానాలు రూపొందించాలి. మన దేశంలో అవినీతి, నిర్లక్ష్యం సమూలంగా నిర్మూలించబడాలి. దేశ సంపద గుప్పెడు మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చేస్తూ, సమంగా పంచబడినప్పుడే సమ్మిళిత ప్రగతి సాధ్యపడుతుంది. అలాంటి చిత్తశుద్ధితో కూడిన విధానాలు అమలు చేయాలి. ప్రజాస్వామ్య దేశంలో బహుళ పార్టీల పాలన విధానంలో అధికార దాహంతో దేశ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఓటు బ్యాంకు పథకాలకు చరమగీతం పాడాలి. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యం దేశంగా వెలుగొందుతున్న వేళ ఆ కీర్తికి కళంకం రాకుండా సమ్మిళిత అభివృద్ధికి పాటుపడండి. 

మేకిరి దామోదర్

సామాజిక విశ్లేషకులు

95736 66650

Tags:    

Similar News