మూఢత్వానికి పునాదే ఈ తొలగింపు!

మూఢత్వానికి పునాదే ఈ తొలగింపు!... Scientists object NCERT on removal of Darwin's theory

Update: 2023-04-28 00:45 GMT

కనాడు గురజాడ మతములన్ని మాసిపోవును జ్ఞానమొక్కటే గెలిచి నిలుచును అన్నాడు. ఆ మాట నెరవేరే రోజు మనకు ఇప్పటికైతే కనబడుట లేదు. ఎందుకంటే ఇంత ఆధునిక కాలం వెలుగొందుతూ ప్రపంచమంత విజ్ఞానం వైపు శరవేగంగా పయనిస్తుంటే మన దేశ స్వార్థ రాజకీయ నాయకులు మాత్రం ఈ ప్రపంచానికే మార్గదర్శకమైన ఒక సిద్ధాంతాన్ని తొలగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

‘డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్’ను హేతుబద్దీకరణ పేరుతో సీబీఎస్‌సీ పదవ తరగతి సిలబస్ నుండి ఎన్‌సీఈఆర్‌టీ తొలగించింది. ఈ విధాన పరమైన నిర్ణయంపై దేశవ్యాప్తంగా మేధావులు, శాస్త్రవేత్తలు 1800 మంది కలిసి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నిర్ణయం తప్పని డార్విన్ మానవ పరిణామ సిద్ధాంతం పాఠ్య పుస్తకాలలో తిరిగి ముద్రించాలని కోరారు.

సైంటిస్టులపై కక్ష కట్టిన మతం

కోపర్నికస్, గెలీలియో, బ్రూనోలు టెలిస్కోప్‌ను కనుగొని సూర్యుడు దేవుడు కాడని, బల్లపరుపు కాదనీ, గోళాకారంలో ఉన్నాడనీ, అది సాధారణ నక్షత్రమేననీ కనుగొన్నారు. అలాగే విశ్వానికి కేంద్రం భూమి కాదని, భూమి బల్లపరుపు కాదని, గోళాకారమనీ, అది సౌరమండలంలో భాగమని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నిరూపించి మత అభిజాత్యాన్ని చావుదెబ్బతీశారు. ఆనాటి వరకూ మనిషి భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మాడు. దీనితో మతం సైంటిస్టులపై కక్ష కట్టింది. దైవ విశ్వాసంలో కల మనిషికి తొలిసారిగా దైవంపై అపనమ్మకం ఏర్పడింది. ఇది ప్రజలను కదిలించి మతప్రబోధకులను ఆత్మరక్షణలో పడేసింది.

దాదాపు ఇదే టైంలో చార్లెస్ డార్విన్ మనిషి ఆవిర్భావం మీద విశ్లేషణాత్మక పరిశోధన చేశాడు. మనిషి ఉద్భవం పరిణామ ఫలితమేనని సంచలన ప్రకటన చేసి మతాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. అంతకుముందు వరకు దేవుడే మనిషిని సృష్టించాడనీ, ఆరు రోజులలో విశ్వం మొత్తాన్ని సృష్టించి, ఏడో రోజైన ఆదివారం విశ్రాంతి తీసుకున్నాడని ప్రబోధించిన మతానికి ఈ సిద్ధాంతం వల్ల చావు దెబ్బ తగిలింది. దేవుడే మనిషిని సృష్టించాడనే వాదాన్ని కాకుండా మనిషి ఉద్భవం కాదని, మనుషులు పరిణామ ఫలితంగానే ఏర్పడినారని డార్విన్ నిరూపించారు.

'డార్విన్' తొలగింపు రాజకీయం

మనిషి నరవానరం (చింపాంజీ) లాంటి జీవి నుంచి ఉద్భవించాడన్నారు. అంతేగాని దీనికీ, దైవకృపకూ ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఇది బైబిల్ మీద పెద్ద దెబ్బ వేసింది. అందుకనే డార్విన్ మీద నేరుగా దాడి చేసింది మతం. నీవు కోతి నుంచి పుట్టావేమో గాని మేము ఉత్తముడైన మనిషి నుండే పుట్టామని కొందరు మతవాదులు చాలా అవమానకరంగా మాట్లాడారు.

మతాలను, దేవుళ్ల నమ్మకాలను సజీవ సమాధి చేసి పరిణామ సిద్ధాంతానికి ప్రాణం పోసి, సృష్టివాదాన్ని అంతం చేసి విజ్ఞాన శాస్త్ర వెలుగులను ఈ విశ్వమంతటికి అందించిన మహనీయులు డార్విన్. ఈ సిద్ధాంతం ప్రపంచంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలకు మూలస్తంభం. అటువంటి థియరీని కొందరు రాజకీయ అవసరాల కోసం సైన్స్‌ను రాబోయే తరాలకు తెలియనివ్వకుండా పాఠ్య పుస్తకాల నుండి తొలగించడం సిగ్గుచేటు.

మనువాదం అమలుపరచడానికేనా?

ఇది శాస్త్రీయపరంగా హేతుబద్దమైన ఆలోచనలపై ప్రత్యక్ష దాడి చేసి పిల్లల మెదళ్లలో సృష్టి వాదాన్ని బోధించి మూఢత్వాలను నింపే ప్రయత్నంలో మునిగిపోయారు. పాఠశాల విద్యార్థులకు శాస్త్రీయ విద్యకు బదులు మతంతో అంధవిశ్వాసాలతో కూడిన విద్యను అందించి దేశాన్ని మరల అటవిక రాజ్యంలోకి తీసుకెళ్లే కుట్రకు పాలకులు తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్దంగా ప్రజలను విద్యార్థులను తప్పుదోవ పట్టించే పనిలో నిమగ్నమై ఉంది. గతం నుండి కూడా వివిధ అంశాలను రాజ్యాంగం నుండి తొలగిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా ‘లౌకికవాదం’ అనే పదం తొలగించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనువాదం అమలుపరచడానికి చకచక పనులు మొదలుపెట్టిందని మేధావులు చర్చించుకుంటున్నారు.

ప్రభుత్వాలు ప్రజలకు మేలు జరిగి చైతన్య పూరితమైన విధానాలు తీసుకురావాలి కానీ, ఇతర దేశాలతో పోల్చితే మన దేశం పూర్తిగా అనాగరికమైన నిర్ణయాలతో ప్రధాన వార్తలలో నిలుస్తుంది. వాస్తు జ్యోతిష్యం అమలు చేయాలని, బెనారస్ విశ్వవిద్యాలయం భూతవైద్యం కోర్సులను ప్రవేశపెట్టడం, ఆవు మూత్రంలో ఎంత బంగారం దాగుందో పరిశోధించాలని కోరడం పూర్తిగా అటవిక ఆలోచనలకు నిదర్శనం.

ఒక దేశం ఇతర దేశాల పోటీని తట్టుకొని నిలబడాలంటే పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందించాల్సి ఉంది. నాగరికత వికాసాలను అభివృద్ధి పరుస్తూ మూఢత్వాలకు, అనాగరిక సంస్కృతులకు చరమగీతం పాడి, జరిగిన వాస్తవిక చరిత్రలను విద్యార్థుల కళ్లముందు ఆవిష్కరించి రేపటి భవిష్యత్తుకు మార్గదర్శక విలువలను అందించడంలో ముందుండే దేశాలే అభివృద్ధి చెందిన దేశాలుగా నిలిచి గెలుస్తాయి.

అవని శ్రీ

99854 19424

Tags:    

Similar News