బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలను కాపాడండి!

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల రాజకీయ ఆధిపత్యం

Update: 2024-12-06 01:00 GMT

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల రాజకీయ ఆధిపత్యం కారణంగా అస్థిరమైన అరాచక వాతావరణం అక్కడి హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారుతూ వస్తోంది. ఈ దాడుల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ అధికారం కోల్పోవడం ఆ తర్వాత మిలిటరీ సహకారంతో ముహమ్మద్ యునాస్ మత (చందసవాది) నాయకత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మైనార్టీలపై హిందువులపై దాడులు అధికంగా నమోదయ్యాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తమ రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ 25 నాడు చిట్టగాంగ్ న్యూ మార్కెట్ వద్ద జరిగిన నిరసనలో చిన్మయి కృష్ణదాస్‌ పాల్గొన్నారనే ఆరోపణపై తాజాగా ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయబడింది. ఈయన ఇస్కాన్ సంస్థ ప్రతినిధి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ మఠాధిపతి. ఆందోళన సమయంలో కాషాయ (సాఫ్రాన్) జెండా ను బంగ్లాదేశ్ జాతీయ పతాకంపైన ఉంచి నట్లు ఆరోపించి ఆయన మీద, మరో పంతొమ్మిది మంది మీద దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఆయనను ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో మైనార్టీల రక్షణ భద్రత పరమైన అంశాల గురించి అక్కడి మైనార్టీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ భారీ ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఇంటర్నేషనల్ సంస్థను నిషేధించాలంటూ ఆ దేశ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయ్యింది.

పూజారిపై దేశ ద్రోహం కుట్ర..!

చిన్మయి క్రిష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా ఇస్కాన్ ఇంటర్నేషనల్ సంస్థతో పాటు శ్రీ శ్రీ రవిశంకర్, సద్గురు లాంటి అనేక మంది ప్రముఖులు, హిందూ సంఘాలు ఈ అరెస్ట్ పై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలోని బంగ్లా దౌత్య కార్యాలయం ముందు కూడా హిందూ సంఘాలు నిర సన కార్యక్రమాలు చేపట్టాయి. తక్షణమే ఆయనను విడుదల చేయాలని ఆయనపై నమోదైన దేశ ద్రోహం కేసు కుట్రపన్ని కావాలని వేశారని అక్కడ మైనారిటీలపై జరుగుతున్న హింసను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఆయన మొదటి నుండి బంగ్లాదేశ్‌లో హిందూ హక్కుల గురించి హిందూ మైనార్టీలకు రక్షణ కల్పించాలని పోరాడుతున్నారు.. కాబట్టే ఆయన గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా దేశ ద్రోహం కేసు వేశారని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తక్షణమే భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయన విడుదలకు కృషి చేయాలని ఇస్కాన్ సంస్థ కోరుతుంది.

చిన్మయి తరపున వాదిస్తే దాడులు..

ఆయన అరెస్ట్ తర్వాత చిన్మయ్ క్రిష్ణాదాస్ ప్రభూకి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాకరించడం జరిగింది. పైగా ఎవరైనా చిన్మయి క్రిష్ణదాస్ తరుపున వకాల్తా పుచ్చుకుని కేసుని వాదిస్తే వాళ్ల పరిస్థితి ఘోరంగా మారుతుందని బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ వారి బెదిరింపులకు భయపడకుండా రమన్ రాయ్ క్రిష్ణ దాస్ తరుపున వకాల్తా పుచ్చుకొని వాదించడనికి తయారైతే చెప్పినట్లే ఇస్లామిక్ రాడికల్స్ ఆయన ఇంట్లో చొరబడి దాడి చేయడంతో అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ప్రాణాలతో బయట పడటానికి పోరాడుతున్నాడు. కోర్టులోని మిగతా లాయర్లు కూడా ఎవరైనా చిన్మయి క్రిష్ణ‌ దాస్ తరుఫున వకాల్తా పుచ్చుకుని వాదిస్తే రమణ్ రాయ్ కి పట్టిన గతే పడు తుందని కోర్టులోనే బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్ లో ఏ ఒక్క వకిల్ కూడా చిన్మయి క్రిష్ణ దాస్ తరుఫున వాదించడానికి సాహసం చేయకపోవటం అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన తరఫున వాదించడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ కేసు జనవరి 2కి వాయిదా పడింది. దీంతో ఆయన అప్పటి వరకు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వ నిరాసక్తత దేనికి?

బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న మతపరమైన హింసకు ముఖ్య కారకుడుకు మాస్టర్ మైండ్ మహమ్మద్ యూనస్ అని మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్పడం గమనార్హం! హిందువులపై జరుగుతున్న హింస మీద ప్రపంచదేశాల మద్దతు కూడగట్టడంలో ఎందుకు మోడీ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు? వెంటనే బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాపితంగా బంగ్లా దేశ్‌కి వ్యతిరేకంగా మహ్మద్ యునస్ ప్రభుత్వం మైనార్టీల మీద జరుగుతున్న మతపరమైన హింసను నివారించడానికి ప్రపంచ దేశాలతో బంగ్లాదేశ్ మీద ఒత్తిడి పెంచేలా చేయడం లాంటి చొరవ తీసుకొని అక్కడి మైనార్టీలను రక్షించే ప్రయత్నం చేయాలి.

ఐక్యరాజ్యసమితి జోక్యం అవసరం!

బంగ్లాదేశ్‌లో వివక్ష, అణచివేతకు గురవుతున్న హిందూ జనాభా నిరంతరం తగ్గిపోతుంది. నేడు బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువుల వాటా 1951తో పోలిస్తే 14 శాతం మేర తగ్గిపోయింది. హిందూ- అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. 1964 నుంచి 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. ప్రతి సంవత్సరం 2.3 లక్షల మంది దేశం విడిచి వెళుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. 2000 నుంచి 2010 మధ్య దేశ జనాభా నుంచి ఒక మిలియన్ హిందు వులు అదృశ్యమయ్యారని 2011 జనాభా లెక్కలు తెలియజేస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనార్టీలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో జోక్యం చేసుకుని హిందూ మైనార్టీలకు రక్షణ కల్పించాలని వారి ఆస్తులను హక్కులను ప్రాణాలను కాపాడాలని కోరుకుందాం.

భరత్ చౌహాన్

సోషల్ యాక్టివిస్ట్,

90306 66999

Tags:    

Similar News