తిరుగుబాటుకు ప్రతిరూపం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్
బలవంతుల పాలనలో పాలితులెప్పుడు పీడితులే.. అగ్రవర్ణాలది అధికారమయితే నియంతృత్వమే బహుజనులకు బహుమతి. అందుకే క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు.
బలవంతుల పాలనలో పాలితులెప్పుడు పీడితులే.. అగ్రవర్ణాలది అధికారమయితే నియంతృత్వమే బహుజనులకు బహుమతి. అందుకే క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు. సబ్బండ వర్ణాల బలగంతో రాజ్యాధికారం సంపాదించాడు. పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి అందించాడు. అతను మరెవరో కాదు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, వీరత్వంలో శివాజీకి ఏమాత్రం తీసిపోని సర్వాయి పాపన్నను గుర్తు చేసుకుందాం. ఈ రోజు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.
పోతపోసిన తెలంగాణ పౌరుషం..
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మూడున్నర శతాబ్దాల క్రితం ఈ పేరో సంచలనం. రాజ్యాధికారం గురించి కనీసం ఆలోచించడమే పాపమయిన కాలంలో సింహాసనాన్ని అధిష్టించిన బహుజన సింహం.. నవాబుల తాబేదార్ గా మారిన అగ్రవర్ణ దోపిడి వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి. 17వ శతాబ్దిలోనే తెలంగాణ గడ్డపై పోరువిత్తనాలు నాటిన విప్లవకారుడు, బలహీన వర్గ కుటుంబంలో పుట్టి రాచరిక పునాదులను కదిలించిన ధీరోధాత్తుడు సర్వాయి పాపన్న గౌడ్. తెలంగాణ పౌరుషాన్ని పోతపోసుకున్న గౌడ్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ లో 1650 ఆగస్ట్ 18న పుట్టాడు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మే సర్వస్వమై పాపన్నను పెంచింది. రాచరిక వ్యవస్థ నీడలో జమీన్ దార్లు, జాగీర్ దార్లు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడడంతో అతనికి చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరనరాన ఇంకింది. అందుకే ఎలాగైనా ఆ నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడు. కులవృత్తిని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం పోరుబాట పట్టాడు. అయితే అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరి తో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేశాడు.
12 మందితో మొదలై 12వేలకు చేరిన సైన్యం..
అందుకు స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్ మహ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్ లతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు. అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటల పై దాడి చేశాడు. సంపదను బహుజన పేదలకు పంచాడు. గడీల్లో బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల ప్రజలను విడిపించాడు. 12 మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం పన్నెండు వేలకు చేరింది. చిన్న చిన్న సంస్థలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించాడు. పాపన్న గౌడ్ మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్నీ రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు. ఖిలాషాపూర్ లో పటిష్టమైన కోటను కట్టించాడు. పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. కులవృత్తులను ప్రోత్సహించాడు.
వరంగల్, భువనగిరి ఖిల్లా స్వాధీనం..
వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు చెట్లను నాటించాడు. అయితే ఒక బహుజనుడు రాజ్యపాలన చేయడాన్ని అగ్రవర్ణాలు తట్టుకోలేకపోయాయి. అగ్రవర్ణ పెత్తందార్లు మొగల్ పాలకులతో చేతులు కలిపారు. దీంతో 1706 లో పాపన్న పై దాడి చేసేందుకు మొగల్ సేనాని రుస్తుంఖాన్ ప్రయత్నించాడు. కాని పాపన్న బలాన్ని సరిగా అంచనా వేయలేక వెనకడుగు వేశాడు. 1707 లో ఔరంగజేబు చనిపోవడంతో మొగల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్టించాడు. ఈ పరిణామాన్ని అతని తమ్ముడయిన బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ తట్టుకోలేక తిరుగుబాటు చేశాడు. ఇలా కుటుంబ గొడవల్లో మొగలులు ఉండగానే వేలాదిమంది సైన్యంతో పాపన్న వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం భువనగిరి ఖిల్లాను తన ఖాతాలో వేసుకున్నాడు. సర్వాయి పాపన్న విజయాలు మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకుపుట్టించాయి. అయితే సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని తెలుసుకున్న మొగల్ చక్రవర్తి బహదూర్ షా అతనికి స్నేహ హస్తం అందించాడు.
గోల్కొండకు రాజైన కల్లుగీత శ్రామికుడు..
అధికారిక గుర్తింపు కోసం చట్టబద్ధంగా, న్యాయ సమ్మతంగా కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చన్నాడు. పాపన్న ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బహదూర్షాకు 14లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు మొఘల్ సైనికుల కు భారీగా ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చారు. దీనికి ప్రతిఫలంగా గోల్కొండ కోటకు పాపన్నను రాజుగా ప్రకటించాడు. ఒక కల్లుగీసేవాడు గోల్కొండకు రాజు కావడాన్ని అగ్రవర్ణ కులాలు జీర్ణించుకోలేక పోయాయి. పాపన్న బహుజన రాజ్యాన్ని కూల్చడానికి ఎన్నో కుట్రలు చేశాయి. బహదూర్ షాకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టాయి. 1709 లో తాడికొండలో మొఘల్ సైన్యానికి పాపన్న యోధులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. కొన్ని నెలల పాటు అది కొనసా గింది.. చివరకు ఆ పోరాటంలో పాపన్న సైన్యం ఓడిపోయింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెనకడుగు వేయడంలో తప్పులేదనుకున్న పాపన్న అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. సర్వాయి పాపన్న ఎక్కడ ఉన్నాడో కొన్ని రోజులు పాటు ఎవరికీ తెలియలేదు.
తలనరికి... కోటకు వేలాడదీసి..
చివరకు హుస్నాబాద్ లో ఓ కల్లు మండువాలో గీతకార్మికుడిగా పనిచేశాడు. ఆ గ్రామంలో గౌడ కులస్థులు ఎక్కువగా ఉండడంతో అదే సురక్షిత ప్రాంతమనుకున్నాడు పాపన్న కాని అప్పటికే గౌడ్ కోసం ఊరూరూ గాలిస్తున్న మొగల్ సైనికులు. పాపన్నను గుర్తించి పట్టుకున్నారు అతని తలను నరికి బహదూర్ షాకు బహుమానంగా పంపారు. మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు. స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. అదే కాలంలో మొఘల్ పాలనపై సమరశంఖం పూరించిన శివాజీకి పాపన్న ఏ మాత్రం తక్కువ కాదు. దక్షిణ భారతదేశంలో మొగల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్న తొలి యోధుడు పాపన్నే. ఇంతేకాదు, ఫూలే కంటే ముందే బహుజనులందరి సంక్షేమం కోసం పాటుపడిన సామాజిక విప్లవకారుడు పాపన్న. అయినా చరిత్రలో సర్దార్ సర్వాయిపాపన్నకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. తొలి బహుజన రాజు సర్వాయి పాపన్న జీవితాన్ని, విజయాలను మట్టిలో కప్పారు. ఆ యోధుడి గొప్పతనాన్ని చీకట్లో కలిపారు. ఇప్పటి వరకు రాసిన చరిత్రలో పాపన్న పేరు కనిపించదు.
రాజులం గావాలి...రాజ్యమేలాలి..
తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రావతరణతో ఫలించిన నేపథ్యంలో ఇకనైనా పాపన్న చరిత్రను భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం పాలకులపై ఉంది. తాళ్లెక్కితే ఎమస్తది.. కల్లమ్మితె ఏమస్తది... కొడితే గొల్కొండ కోటను కొట్టాలి. రాజులం గావాలి...రాజ్యమేలాలి అంటూ అణచివేతపై మూడున్నర శతాబ్దాల కిందే తిరుగుబాటు చేసిన మహోన్నత యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ధీశాలి. మొఘలుల పాలనలో బందీలుగా బతుకుతున్న పీడిత ప్రజలను విముక్తి చేసి గోల్కొండను ఏలిన గొప్ప చరిత్ర కలిగి.. చరిత్ర పుటల్లో లేని తెలంగాణ మొనగాడు ధైర్యం, తెగింపు కలిగిన ఏడడుగుల చక్రవర్తి పాపన్నగౌడ్, లండన్ లోని విక్టోరియా అల్బర్డ్స్ మ్యూజియంలో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు ఆయన చరిత్రకు చిహ్నం.
సంపత్ గడ్డం
దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు
78933 03516