ఆదివాసీ స్వయంపాలనకు ప్రతిరూపం
Sammakka Sarakka is the epitome of tribal autonomy
ఆదివాసీల పోరు గద్దె మేడారం. ఆదివాసీలు తమ గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తున్న వీరవనితలు సమ్మక్క సారలమ్మలు. కప్పం కట్టబోమన్న ప్రతివారికీ ఒక జ్ఞాపకం. ఆదివాసీ స్వయంపాలన కోసం తమ ప్రాణాలను త్యజించి మరణం తరువాత కూడా జనం గుండెల్లో బతకవచ్చు అని నిరూపించిన వీరవనితలు ఈ సమ్మక్క సారలమ్మలు.
12వ శతాబ్దంలో కాకతీయుల రాజ్య పాలన కొనసాగుతున్న కాలం అది. కాకతీయులకు సామంత రాజులుగా ఉన్న రాజులు మేడారం అడవి బిడ్డలు. కరువొచ్చి పన్నులు కట్టలేమని చెప్పినందుకు సైన్యాన్ని పంపి ఆదివాసులను చిత్రహింసల పాలు చేశారు. ఎదిరించిన వారిని మట్టుబెట్టారు. ఆ నేపథ్యంలోనే సమ్మక్క సారాలమ్మలు దండయాత్రకొచ్చిన సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రాజరికపు ఆదిపత్యాన్ని ప్రశ్నించారు. పొద్దుంతా చేసిన కష్టాన్ని రాజ్యం పేరుతో పన్నుల రూపంలో దోచుకునే తీరును నిరసించారు. కాకతీయ రాజు రుద్రదేవుడు రాజ్యకాంక్షతో మేడారంపై దండెత్తాడు. వీరి మధ్య జరిగిన భీకరపోరులో పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు వీరమరణం చెందారు. జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాటం ధాటికి తట్టుకోలేని శత్రువులు వెనక నుండి బల్లెంతో పొడిచారు. తీవ్రగాయాలతో శత్రువులను హతమారుస్తూ మేడారానికి తూర్పు దిశగా చిలకలగుట్ట వైపు సాగుతు సమ్మక్క అదృశ్యం అయింది. సమ్మక్క కుటుంబం అంతా స్వయం పాలన కోసం అమరులు అయ్యారు. ఆనాటి నుంచి తమ హక్కుల కోసం, స్వయం పాలన కోసం ప్రాణత్యాగం చేసిన వారి జ్ఞాపకార్థం ప్రతి రెండు సంవత్సరాలకొక్కసారి ఆదివాసీలు ఈ అమరులను కొలుస్తున్నారు. శతాబ్దాలు గడుస్తున్నా సమ్మక్క సారలమ్మలను మరువలేక వారిని దైవాలుగా కొలుస్తున్నారు.
విగ్రహారాధన లేని అరుదైన జాతర
ఆదివాసీలు ఆదివాసేతరులు కోట్లలాదిగా తరలివచ్చే ఈ మేడారం జాతరలో విగ్రహరాదన ఉండదు. ఈ జాతర మాతృస్వామ్య వ్యవస్ధకు ప్రతిరూపంగా ఉంటుంది. ఎలాంటి బ్రాహ్మణీయతా లేని, ఆదిపత్య ఆరాటం లేని జాతర ఇది ఈ జాతర కేవలం ప్రకృతి ఆరాధన పసుపు కుంకుమల జాతర తప్ప మరే ఇతర ఆచారాలు లేని మేడారం జాతర. ఈ జాతరకు దేశ నలుమూలల కోట్ల సంఖ్యలో ఆదివాసీలు తరలి వస్తారు. వనదేవతలను దర్శించుకుంటారు. 1967లో ప్రభుత్వం ఈ జాతరనూ తన ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు సమ్మక్క, సారలమ్మలను దేవుళ్లుగా ప్రచారం చేస్తూ, వీరిని సంఘ్ పరివార్ భావజాలంలోకి పరివర్తన చేస్తున్నారు. మేడారాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చేసి ఆదివాసీలను మేడారంకూ దూరం చేస్తున్నారు. మేడారంకు అంతర్జాతీయ ఖ్యాతి రానుండటంతో జాతరపై కార్పొరేట్ కన్ను పడింది. కమర్షియల్ తో రంగులు అందడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వీరనారీమణుల్ని ‘దేవతలుగా’ ప్రచారం చేయడంతో ప్రజల్ని అంధవిశ్వాసాల్లో ముంచి ఎదగకుండా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వైదిక మతం ఆదివాసీ, గిరిజన, జానపద సంస్కృతులను ధ్వంసం చేస్తుందనడానికి ఇదొక మంచి ఉదాహరణ! వీరనారుల సంస్కృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు కాకుండా, ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటున్నారు. వారిని కేవలం దేవతలుగా, దేవుళ్లుగా, ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తున్నారు.
మేడారం జాతరను కాపాడుకుందాం
గిరిజనేతర సామ్రాజ్యవాదం నేడు జాతర సంపదను దోచుకోవాలని తహతహలాడుతున్నది. అందుకు ట్రస్ట్ బోర్డును ముందు పెట్టి పావులు కదుపుతున్నది. ఆదివాసీలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపే మేడారం జాతరను కబ్జా చేయాలని గిరిజనేతర శక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆదివాసీల రిజర్వేషన్‌లో పాటుగా ఆదివాసీల సంస్కృతిని సైతం కబళించాలనే కుట్రలకు తెరలేపుతున్నారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా, కాకతీయులపై కత్తులు దూసి కదనరంగంలో అమరులైనా సమ్మక్క సారలమ్మ విప్లవ పోరాట స్పూర్తిని పుణికిపుచ్చుకుని గిరిజనేతర సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. మేడారం జాతరను కాపాడుకోవాలి. మేడారం జాతరపై పాలకుల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలి.
వూకె రామకృష్ణ దొర
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
98660 73866