రేవంత్ ప్రజాపాలన…నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం

ఉద్యోగాల భర్తీలో తీవ్ర జాప్యం మూలంగా పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల

Update: 2024-12-06 01:15 GMT

ఉద్యోగాల భర్తీలో తీవ్ర జాప్యం మూలంగా పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అనుసరించిన లోపభూయిష్ట విధానాల వల్ల నిరుద్యోగులంతా ఏకమై కేసీఆర్ పాలనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు శ్రమించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ వంతు పాత్ర పోషించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు నింపే టీజీపీఎస్సీని ముందుగా సంస్కరించి విద్యార్థి నిరుద్యోగుల జీవి తాల్లో వెలుగులు నింపారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించారు. విద్యావ్యవస్థలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన విద్యావేత్తలను సభ్యులుగా నియమించారు. పోటీ పరీక్షల నిర్వహణలో ఫలితాల వెల్లడిలో ఎటువంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలి ఏడాదిలో వేగవంతంగా పారదర్శకంగా సుమారు 55 వేల 143 కొలువులు భర్తీ చేసి దేశంలోనే రేవంత్ రెడ్డి సర్కారు చరిత్ర సృష్టించింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులు, లింగమార్పిడి దారులకు వారి కేటాయించిన రిజర్వేషన్లు అమలు చేయాలనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ ముఖ్యమంత్రి జీవో నెంబర్ -3 తెచ్చారు.

పోటీ పరీక్షలపై నమ్మకం పెంచి..

తెలంగాణ సీఎం తన పారదర్శక విధానాలతో విద్యార్థి నిరుద్యోగులకు పోటీ పరీక్షలపై నమ్మకాన్ని కలిగించారు. విద్యార్థి నిరుద్యోగుల్లో వారి భవిష్యత్ పైన వారికి అనేక ఆశలు చిగురించేలా చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కేసీఆర్ పాలనలో అనేక అక్రమాలతో తొలి గ్రూప్ -1 పరీక్ష ప్రిలిమ్స్ దశలోనే హైకోర్టు తీర్పుతో ఆగిపోయింది. కోర్టు రద్దు చేసిన పరీక్షను తిరిగి వెంటనే నిర్వహించకుండా కేసీఆర్ ప్రభుత్వం పంతానికి పోయి సుప్రీంకోర్టులో సవాల్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రూప్ -1 పరీక్ష నిర్వహణను సవాలుగా స్వీకరించి ముందుగా సుప్రీంకోర్టులో సవాల్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు. జీవో నెంబర్ 55ను సవరించి జీవోఎంఎస్ నెంబర్ 29ని తెచ్చారు. అయితే ఈ జీవో ద్వారా రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించాయి. అయితే నిరుద్యోగుల్లో ఈ పరీక్షపై అనేక అపోహలు సృష్టించి పరీక్ష పైన ఎంత విషం చిమ్మినా, సమర్థవంతంగా ప్రిలిమ్స్, మెయిన్స్‌ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించింది. అలాగే సుమారు 1300 వందల ఉద్యోగాల గ్రూప్- 3 పరీక్షను నవంబర్ 17, 18 తేదీల్లో సక్రమంగా నిర్వహించింది. అదే విధంగా డిసెంబర్ 15,16 తేదీల్లో 783 గ్రూప్- 2 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏడాదికి రెండుసార్లు నిర్వహించాల్సిన పరీక్షను 10ఏళ్లలో కేవలం 5 సార్లు మాత్రమే నిర్వహించి ఉపాధ్యాయ శిక్షణ పొందిన నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఒకసారి పరీక్ష నిర్వహించి ఇంకోసారికి నోటిఫికేషన్ ఇచ్చింది.

గురుకులాల్లో సమూల మార్పులు..

ఉద్యోగాల భర్తీలో ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఆదర్శంగా నిలిచింది. మరోవైపు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ విద్యను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవటం జరిగింది. 2024-2025 బడ్జెట్‌లో రూ 21,292 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం కన్నా రూ. 2119 కోట్లు అదనంగా కేటాయించి విద్యారంగం సమగ్రాభివృద్ధికి బాటలు వేయడం జరిగింది. అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్న 1020 గురుకుల పాఠశాలలను ఒక చోట చేర్చి 100 నియోజకవర్గాల్లో ప్రతి గురుకులం 25 ఎకరాల్లో విశాలమైన క్రీడా మైదానాలు ఉండే విధంగా పక్కా భవనాలు నిర్మించి గురుకులాలను యువ భారత సమీకృత గురుకులాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దటానికి పూనుకుంది. ఇక 3వ తరగతి నుండి పీజీ చదువుతున్న 7లక్షల 65వేల 705 మంది సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు 40% భోజన ధరలు(డైట్) అలంకరణ వస్తు (కాస్మోటిక్) ధరలు పెంచి రేవంత్ రెడ్డి పేద విద్యార్థుల బాంధవుడుగా మారాడు.

తక్షణ ఉపాధి ఉద్యోగ మార్గాలకు రూట్!

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించిన తొలిరోజే 21 లక్షల 19వేల మంది విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు(యూనిఫాం), పుస్తకాలు అందించడం అభినందించదగ్గ విషయం. అదే విధంగా 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న(ITI) లక్ష మంది విద్యార్థులకు అధునాతన టెక్నాలజీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2700 కోట్లు వెచ్చించి టాటా టెక్నాలజీ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకుని పని ప్రారంభించటాన్ని అభినందించాల్సిన విషయం. అట్లాగే 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో మొత్తం 30 కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి తక్షణ ఉపాధి ఉద్యోగ మార్గాలను విద్యార్థులకు చూపెట్టటం నిజంగా హర్షనీయం. అదే విధంగా తెలంగాణ యువతకు నైపుణ్య విద్య పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా వ్యాపార దిగ్గజం అయిన ఆనంద్ మహీంద్రాను వీసీగా నియమించి రూ. 100 కోట్లతో యువ భారత నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి తరగతులు ప్రారంభించడం నిజంగా అద్భుతమైన ప్రగతికి నాంది పలకటంగా పేర్కొనవచ్చు. తెలంగాణ బిడ్డలు క్రీడల్లో రాణించి ఒలంపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించి భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా యువ భారత క్రీడా విశ్వవిద్యాలయానికి పునాదులు వేయడం ముదావహం.

స్కూళ్లకు పారిశుధ్య గ్రాంట్లు

ప్రభుత్వ పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు 3000 రూపాయలు, 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 6000 వేల రూపాయలు, 250 మంది విద్యార్థులు కలిగిన పాఠశాలలకు 8 వేలు, 500 మంది ఉన్న పాఠశాలలకు 12 వేలు అదే విధంగా 750 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 20వేల రూపాయల పారిశుధ్య గ్రాంట్లు విడుదల చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 39 లక్షల 67వేల విద్యాసంస్థలకు జీవో నెంబర్ 20 ద్వారా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించి బకాయిలుగా ఉన్న రూ.101.57 కోట్లను మాఫీ చేసిన సాహసోపేతమైన చర్యను ప్రతి ఒక్కరు ప్రశంసించి తీరాలి. ఇలా ఒక ఏడాది పాలనలో అనేక సంస్కరణలు చేపట్టి విద్యారంగం అభివృద్ధికి కృషి చేయడం, మరోవైపు విద్యార్థి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం చూస్తుంటే నిజంగానే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారిందని చెప్పవచ్చు.

కోటూరి మానవతారాయ్

చైర్మన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ,

టీపీసీసీ అధికార ప్రతినిధి

90009 19101

Tags:    

Similar News