70 ఏళ్ల గణతంత్ర తంతు సాధించిందేంటి?

Republic Day 2024: What has the 70 year old republic achieved?

Update: 2024-01-26 00:45 GMT

ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల నుండి నిర్మించబడ్డ ఒక పవిత్రమైన వ్యవస్థ. ఇది ఏడు దశాబ్దాల కిందట అంబేద్కర్ అకుంఠిత దీక్ష ఫలితంగా సఫలీకృతమైన సామ్యవాదపు సోపానం. అయితే సర్వసత్తాక సామ్యవాదపు సొతైన ఈ సార్వభౌమపు రాజ్యాంగం నాదా, నీదా.. మనందరిదా?

అంబేద్కర్ మొదలుకొని నాటి మేధావులంతా ఏకకంఠంతో తీర్మానించిన ఏకీకృత నినాదం సమానత్వం. ఈ కోణంలోంచి రాజ్యాంగంలోని ప్రతి అక్షరాన్ని తరచి తరచి పరిశీలిస్తే అంతా మనదే అనిపిస్తుంది. అయినా అరకొరగా ఉన్న ఆనందం, అంతులేని కటిక దారిద్ర్యం.. ఈ భారత ధరిత్రిని ఇంకా వేధిస్తూనే ఉంది. ఈ సమస్యకు సమాధానం ఏమిటంటే మళ్ళీ దాని నుండి మరో సందేహం ఉద్భవిస్తుంది. ఇందులో అసలు తప్పు పాలకులదా.. పాలితులదా?

చట్టసభలంటే..

ప్రజలచేత ప్రజల నుండి ఎన్నుకోబడ్డ ప్రతినిధులు మనలా మనుషులే కదా.. పంచాయతీ నాయకత్వం నుండి రాష్ట్రపతి దాకా ప్రజలే అందరినీ గద్దెనెక్కిస్తారు. మీరే మా నాయకులని ముక్తకంఠంతో నలు దిక్కులు పిక్కటిల్లేలా నినాదిస్తారు. చట్టసభల్లో కూర్చోబెట్టి అసమాన అణగారిన వర్గాల వాణిని వినిపించమని వేడుకుంటారు. అగ్గిలో మమేకమై ఆత్మార్పణం చేసుకుంటారు. మరికొందరు ఉద్యమాలకు ఊపిరై, రక్తపు మాంసపు ముద్దలై మిగిలిపోతారు. చట్టసభల్లో కోట్లాది ప్రజల తీర్పును ఆసనాలుగా చేసుకొని సుఖాసీనులై పబ్బం గడుపుతున్న అధికార గణానికి ప్రజాభిప్రాయం తెలిసేదెలా..? చట్టసభలంటే రాజకీయం చేసే చోటు కాదు.. అది భారతీయుల జాతకాలను తిరగరాసే బంగారు దేవాలయాలు. చట్టసభలు అంటే పెప్పర్ స్ప్రే చల్లే రంగోలి మైదానాలు కావు.. అవి కోట్లాది యువకుల ఆశయాల ఆకాశపు అంచులు. చట్టసభలు అంటే ప్రైమరీ స్కూళ్లు కాదు... పేపర్ ముక్కలతో పనికిరాని అల్లర్లు చేయడానికి. చట్టసభలు అంటే విలాసాల శయన గృహాలు కావు... భారతమ్మ శీలాన్ని వేలం వేయడానికి. ఇవన్నీ ఆరు దశాబ్దాల క్రితం మనం అనుకున్న గణతంత్రానికి ఇవి ఎప్పటికీ అడ్డుగోడలే!

అన్ని వర్గాలు ఏకమై..

ముంబై సాక్షిగా ముష్కరులు జరిపిన ఊచకోత, భారతమాత సాక్షిగా నిర్భయ, దిశ, ఆసిఫా లాంటి ఆడపిల్లల బలత్కారాల ఘటనలు.. ప్రాంతీయ అసమానతపై ప్రజ్వరిల్లిన ఉద్యమాలు. మంచి చెడుల వడపోతలో ప్రత్యక్ష సాక్షిలా నిలబడే మాధ్యమిక వ్యవస్థపై సెన్సార్ షీట్ల పొట్లు, గోరక్షణ పేరుతో దాడులు, పరువు పేరుతో హత్యలు, మతం పేరుతో మారణహోమాలు.. వీటన్నింటి వెనుక పాలకుల హస్తాలు.. ఇవన్నీ నాటి నుంచి నేటి వరకు మనం ఎదుర్కొంటున్న దుర్ఘటన దురంతాలు. వీటిల్లో ప్రతి ఒక్కటి ఏడు దశాబ్దాల కాలంలో మనం ఎదుర్కొన్న అమానవీయ అరాచకాలు..

గణతంత్రమంటే శాంతికి, ప్రేమకు, అహింస మార్గానికి పట్టం కట్టి మనం ఎంతో ఆనందంగా జరుపుకునే తంతు. కానీ దీనిని గౌరవిస్తూనే గతంలోకి తొంగి చూస్తూ నిజమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి చేయి చేయి కలిపి భిన్నత్వంలో ఏకత్వ సంకేతాన్ని బిగించాలి. అన్ని వర్గాలు ఒకే వర్గమై తిరుగులేని రాజకీయ, నాయకత్వ పాలక గణాన్ని నిర్మించుకోవాలి. సరికొత్త జీవన యానానికి ఈ గణతంత్రపు తంతే సాక్ష్యపు తత్వమై నిలబడాలని ఆశిద్దాం..! భారత్ మాతకి జై...!

-అమ్జాద్ మియా

90005 17186

Tags:    

Similar News