సమ ప్రాతినిధ్యమే.. రిపబ్లిక్ స్ఫూర్తి!
Republic Day 2024: Equal representation is the spirit of the republic!
మనుషులందరూ సమానమే అనే భావనను మొదటిసారిగా చట్టబద్ధం చేసిన ఘటనే భారత రిపబ్లిక్ అవతరణ. కానీ దశాబ్దాల పాటు స్వేచ్ఛ స్వాతంత్ర్యం, సమాన హక్కులు అనేవి వక్రీకరణలకు గురయ్యాయి. సామాజిక వర్గాలు, నియోజకవర్గాల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం, జనాభా దామాషా వాటాకు విరుద్ధంగా ప్రాథమిక హక్కులు దుర్వినియోగం అయ్యాయి.
జనవరి 26 కేవలం ఒక వాక్యం కాదు. వందల యేళ్ళ రాజ్యాల చరిత్ర పరిణామం. భారత రాజ్యాంగం ఈ సమాజ పరిణామ చరిత్రకు ప్రతిబింబం. ఇది న్యాయ శాస్త్ర పరిభాషలో విస్తారంగా, సమగ్రంగా అనేక రంగాలను, అంశాలను, విభాగాలను స్పష్టంగా పొందుపరచిన పవిత్ర గ్రంథం.
వందల ఏళ్ల పరిణామ క్రమంలో..
ప్రతి మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామిక హక్కులు, సమాన అవకాశాలు, సమాన అవకాశాలు అందుకోవడానికి.. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో జీవించడానికి, సామాజిక న్యాయం ద్వారా, సామాజిక మార్పు సాధిస్తూ, శాంతియుతంగా సమాజం ముందుకు సాగడానికి అనేక లక్ష్యాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడమైనది. మనుషులందరూ సమానమే అని చెప్పిన బుద్దుడి దాకా జనపదాలు, గణతెగల, తండా వ్యవస్థలు కొనసాగుతూ వచ్చాయి. వందల ఏళ్ళ చారిత్రక పరిణామ క్రమంలో వలసవాద పాలన నుండి, రాజరికాల, సంస్థానాల పాలన నుండి, ఆహార సేకరణ, గుంపు జీవితం, వేట, సంచార, అర్థ సంచార, గణతెగల, జనపదాల, వ్యవసాయ, భూస్వామ్య సమాజాల నుండి, సంస్కృతి నుండి రాజరికాలు ఏర్పడ్డాయి. వంశపారంపర్య పరిపాలన, రాజవంశాలు ఏర్పడుతూ వచ్చాయి. ఆ తర్వాత రాజ్యాల విస్తరణలో గణతెగలు, జనపదాలు, అంతర్భాగమయ్యాయి. సామ్రాజ్యాల విస్తరణలో రాజ్యాలు సామంత రాజ్యాలయ్యాయి. తిరిగి విచ్ఛిన్నమవుతూ ఎక్కడికక్కడ రాజ్యాలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో అశోకుడు తర్వాత అక్బర్, ఔరంగజేబు కాలానికి దేశమంతా ఒకే పరిపాలన కిందికి వచ్చింది. అలాగే కుల వ్యవస్థ పునాదిగా, గ్రామీణ స్వయం పోషక, ఆర్థిక, సామాజిక అంతస్థుల, అంతరాల వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది.
వలస పాలన.. ఆధునిక విద్య
నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలతో, పారిశ్రామిక విప్లవంతో, విదేశాల దండయాత్రలతో నూతన పరిణామాలు, నూతన వ్యవస్థలు, వలస పాలనలు మొదలయ్యాయి. యూరప్ వలసవాదాల మధ్య యుద్ధంలో చివరకు ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించింది. మొఘల్ సామ్రాజ్యం, ఇతర ప్రాంతాలు, క్రమంగా ఈస్ట్ ఇండియా పాలనలోకి రావడం జరిగింది. 1857 ప్రథమ భారత స్వాతంత్ర పోరాటం, తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి భారత పాలనా వ్యవస్థను ఇంగ్లాండు ప్రభుత్వం తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఆధునిక పారిశ్రామిక, ఆధునిక సమాజ వ్యవస్థ నిర్మాణానికి, పరిపాలనకు, ఆధునిక పద్ధతి విద్య అవసరమైంది. ఆ విద్యలో, ఉద్యోగాల్లో తమకు కూడా అవకాశం ఇవ్వాలని, శూద్రులు, అతి శూద్రులు కోరుతూ వచ్చారు. అలా మహాత్మా జ్యోతిబా ఫూలే, నారాయణ గురు వంటి వాళ్లెందరో స్వయంగా పాఠశాలలను స్థాపించారు. సంఘ సంస్కరణలను చేపట్టారు. అసమానతలకు, వివక్షకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థ విధించిన కులాలవారీ అంతరాల వ్యవస్థకు, వివక్షకు పరిమితులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వచ్చారు. వారినే సంఘ సంస్కర్తలు అని పిలుస్తున్నాము.
విద్యలో అసమానత్వం
ఇలా మానవ సమాజాల సంబంధాల నుండి భారతదేశం అనేక ఉద్యమాల ద్వారా స్వాతంత్య్రం పొందింది. స్వాతంత్య్రానంతరం తనదైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి తనదైన రాజ్యాంగాన్ని, తనకు తాను రచించుకుని సమర్పించుకుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి 565 సంస్థానాలు, కొన్ని రాజ్యాలు, బ్రిటీషు, ఫ్రెంచ్ పాలనా ప్రాంతాలు కొనసాగుతూ వచ్చాయి. భారత రాజ్యాంగ నిర్మాణం పూర్తయే లోపుగా వీటిని ప్రస్తుత భారతదేశంగా ఒక్కటిగా కలపడానికి కృషి జరిగింది. తద్వారా కేంద్రం, రాష్ట్రాలు అనే వ్యవస్థలు అధికారాల పంపిణీ జరిగింది. కానీ ఆధునిక విద్య అందరికీ అందించకపోవడం వల్ల అసమానతలు పెరుగుతూ వచ్చాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆధునిక విద్య ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఆయా కుల వృత్తుల్లో ఉన్నవారు వాటిని అందుకోలేక వెనకబడిపోయారు. ఒకప్పుడు ఆ కులవృత్తులు దేశానికి సంపద సృష్టిలో మూలాధారం. కానీ, క్రమంగా ఆ వృత్తులు కోల్పోయి, గిట్టుబాటు కాక, ఆధునిక వ్యవస్థలో తమంత తాముగా ఆయా రంగాల్లో కార్మికులుగా మారాల్సి వచ్చింది.
అప్పుడే అందరికీ స్వాతంత్య్ర ఫలాలు..
స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమాన హక్కులు అనేవి వక్రీకరణలకు గురయ్యాయి. ఇతరుల అవకాశాలను తాము ఆక్రమించడానికి ప్రాథమిక హక్కులను ఆశ్రయిస్తూ, ఉద్యమిస్తూ, కేసులు వేస్తూ వచ్చారు. సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, నియోజకవర్గాల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం, జనాభాదామాషా వాటాకు విరుద్ధంగా ప్రాథమిక హక్కులు దుర్వినియోగం చేయబడ్డాయి. అలా 70 శాతం పైగా గల దేశ జనాభాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎప్పటికప్పుడు అవకాశాలు భాగస్వామ్యం, ప్రాతినిధ్యం నిరాకరిస్తూ, వనరులపై ఉపాధి, ఉద్యోగ, వైజ్ఞానిక పరిపాలన, రాజకీయ రంగాల్లో వెనక్కి నెట్టివేస్తూ వచ్చారు. నిజానికి రిజర్వేషన్‌లు, రక్షణలు అనే పదాలు సరైన అర్ధాన్ని ఇవ్వవు. ప్రాతినిధ్యం అనే పదమే సరైనది. అలా ఆయా సామాజిక వర్గాల, ప్రాంతాల సమ ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అందరికి స్వాతంత్య్ర ఫలాలు అందుతాయి. అందుకు ప్రజలు రాజ్యాంగం చేబూని ఉద్యమించడం అవసరం. జనవరి 26 నుండి స్ఫూర్తి పొందాల్సింది ఇదే.
(నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా)
బి.ఎస్. రాములు
బీసీ కమిషన్ తొలి ఛైర్మన్
83319 66987