పేదోడి న్యాయవాది.. ది లాయర్ విత్ ఎ హార్ట్

Remembering The Lawyer with a Heart C. Padmanabha Reddy

Update: 2023-08-04 00:30 GMT

భారతదేశంలోనే అరుదైన పేదోడి న్యాయవాదిగా సి. పద్మనాభ రెడ్డి సారుకు పేరుంది. 1958 నుంచి 2013 వరకు 60 వేలకు పైగా కేసులను వాదించిన ఘనత ఆయనకు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా యాడికిలో ఓబుల్ రెడ్డి సోమక్క దంపతులకు 1931 మార్చి 18న పద్మనాభరెడ్డి జన్మించారు. 2013 ఆగస్టు 4వ తేదిన తన 82 వ ఏట అనారోగ్యంతో హైదరాబాద్ లో తన స్వగృహంలో కన్నుమూశారు. నిరాడంబరంగా, సాదాసీదా జీవితం గడిపిన పద్మనాభ రెడ్డి నిరంతరం పేదోడికి జరిగిన అన్యాయంపై పోరాడి కోర్టు ద్వారా న్యాయం చేకూర్చడానికి కృషి చేశారు. ఆయన ఏకైక సంతానమైన జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. 1962, 65 లో కమ్యూనిస్టులను నిర్భంధించిన సందర్భంలో వారి తరపున వకాల్తా వేసి వాదించి బయటకు తెచ్చారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు తరిమిల నాగిరెడ్డిని ఆయన అభిమానించేవారు. నాగిరెడ్డిపై, పార్వతీపురం కుట్ర కేసులో విప్లవకారులపై ప్రభుత్వం తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగించిన సందర్భంలో కన్నాభిరాన్ సార్, రావి సుబ్బారావు, పత్తిపాటి వెంకటేశ్వర్లు, జీవన్ రెడ్డి, మనోహర్ రాజు తదితరులతో కలిసి పద్మనాభ రెడ్డి కూడా డిఫెన్సు కమిటీగా ఏర్పడి కింది కోర్టులలో పడిన శిక్షలను పై కోర్టులో, రుజువులన్నీ అబద్ధమని తేల్చి వారిని బయటికి తీసుకొని రావడం జరిగింది.

60 ఏళ్లలో 60 వేల కేసులు..

పద్మనాభ రెడ్డి సార్ ప్రజాస్వామ్య ఉద్యమాలకు పెద్ద అండగా నిలిచి ఆత్మ స్థైర్యం, మనోధైర్యం కల్పించిన మానవత్వం ఉన్న మహా న్యాయవాది. ఆయన చనిపోయి పది సంవత్సరాలైనా ఇప్పటికీ జనం, ఉద్యమ కార్యకర్తలు గుర్తు చేసుకుంటారు. రావి సుబ్బారావు మరణం అనంతరం డెమోక్రటిక్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పద్మనాభ రెడ్డి కొనసాగారు. ఈ అసోసియేషన్ పేరును ఇండియన్ అసోసియేషన్ లాయర్స్‌గా మార్చారు. ఈ లాయర్స్ అసోసియేషన్‌కు సంవత్సరాల పాటు పద్మనాభరెడ్డి అధ్యక్షునిగా కొనసాగారు. 60 ఏళ్ల సుదీర్ఘకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైకోర్టులో క్రిమినల్ లాయర్‌గా 60 వేలకు పైగా కేసులు చేపట్టి వాదించిన ఏకైక న్యాయవాదిగా పేర్కొనవచ్చు. మెహదీపట్నంలో నివాసం ఉండే ఆయన సాదాసీదా జీవితం గడిపేవారు. తన వద్దకు వచ్చేవారిని హోదాలతో సంబంధం లేకుండా తేడా లేకుండా తన ముందు కుర్చోబెట్టి మాట్లాడేవారు. జైలు నుంచి ఏ ఖైది అయినా పోస్ట్కార్డు ముక్కలో తమ కేసు వాదించాలని వివరాలు రాసి పంపిస్తే చాలు. వెంటనే నయా పైసా తీసుకోకుండా హైకోర్టులో తన తరపున వకాలత్ నామాను దాఖలు చేసేవారు. ఇలా ఆయన 20 వేలకు పైగా కేసులను పోస్ట్ కార్డు ద్వారా వచ్చిన సమాచారంతో ఫైల్ చేసిన దాఖలాలున్నాయి. 20 వేలకు పైగా కుటుంబాలకు న్యాయం కూడా జరిగింది. అందరికీ న్యాయం జరిగే విధంగా పద్మనాభరెడ్డి సార్ శాయశక్తులా కృషి చేసేవారు.

నిరుపేదల పక్షాన న్యాయ దీపం

నల్ల బంగారు నేలగా పేరొందిన సింగరేణి ప్రాంతంలో అన్యాయంగా కేసులలో ఇరికించబడి శిక్షలు పడి, ఇబ్బందులకు గురవుతున్న వారి కేసులను కూడా తాను వాదించిన దాఖలాలున్నాయి. కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యార్థులు, విప్లవకారులు, కమ్యూనిస్టులు, ఉద్యమకారులు, సామాన్య జనం ఇలా ఎందరికో ఫీజులు లేకుండా ఆయన కేసులు వాదించిన చరిత్ర ఉంది. నాకు తెలిసి సార్ వాదించిన 60 శాతం కేసుల్లో కోర్టు ఖర్చు కూడా ఇవ్వని వారున్నారు. అయినప్పటికీ నిరుపేదల పట్ల సానుభూతి, ప్రేమ కనిపించేది. దక్షిణ భారతదేశంలో నిబద్ధత, చిత్తశుద్ది, న్యాయవాద వృత్తిలో నిజాయితీతో కూడిన విలువల కోసం పాటుపడిన అరుదైన వ్యక్తిత్వం గల న్యాయవాదిగా పద్మనాభ రెడ్డి సార్ ఆరు దశాబ్దాల పాటు అలుపెరగకుండా పనిచేశారు. తనవల్ల న్యాయం ఎంత జరిగితే అంత గొప్ప అని పేర్కొనేవారు. నన్ను ఆప్యాయంగా, ప్రేమగా ఏం మునీర్ అని పిలిచేవారు. తన ముందు కూర్చుండబెట్టుకొని మా కేసుకు సంబంధించి కూడా చాలా విషయాలను మాట్లాడేవారు. జైలు నుంచి, బయటి నుంచి నేనే స్వయంగా అయిదారు వందల కేసులు పద్మనాభ రెడ్డి సార్ వద్దకు తీసుకెళ్లి ఉంటాను. సహజంగానే పేదలైన బాధితులుంటారు కాబట్టి సార్ ఎన్నడూ ఫీజు ఆశించేవారు కాదు.

చిరస్మరణీయ న్యాయవాది

మానవత్వం ఉట్టిపడే, వంద శాతం మనిషితనం కనిపించే పద్మనాభరెడ్డి సార్ మరణించి పది సంవత్సరాలు దాటినా ఆయనను నేటికి స్మరిస్తూనే ఉంటారు. వేలాది బాధితులను కాపాడిన పద్మనాభ రెడ్డి సార్ ఫోటోను పెట్టుకొని జనం వారి ఇళ్లలో మొక్కుతూ ఉంటారు. ఎంతో ప్రేమతో తన క్లయింట్ సమస్యలను తెలుసుకొని నోట్ చేసుకునే వారు. ప్రతి కొత్త సంవత్సరం శుభాకాంక్షలను సార్‌కు తెలియజేసినపుపడల్లా తిరిగి పోస్టు కార్డులో తప్పనిసరిగా ఆయన కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేవారు. జైలు నుంచి ఎవరైనా పోస్టు కార్డు ద్వారా తమ కేసు వివరాల కోసం సమాచారం అడిగినప్పుడు స్వయంగా సారే ఆ ఖైదీకి లేఖ రాసేవారు. పద్మనాభ రెడ్డి సారుకు నన్ను ప్రముఖ పౌరహక్కుల సంఘం నేత, ప్రముఖ న్యాయవాది కన్నాభిరాన్ సార్ పరిచయం చేశారు. మా కేసు హైకోర్టుకు వచ్చినప్పుడు కన్నాభిరాన్ సార్ వకాలత్ వేయడమే కాకుండా కేసును పద్మనాభ రెడ్డి సార్‌కే అప్పగించారు. తాను పౌరహక్కుల ఉద్యమంలో ఒక్కోసారి నిర్భంధాల వల్ల కోర్టుకు హాజరు కాకపోవచ్చని పద్మనాభ రెడ్డి సార్ ఉంటే బాగుంటుందని భావించిన కన్నాభిరాన్ మా కేసును సార్‌కే అప్పగించారు. నన్నే కాదు. నాలాంటి ఎందరినో కాపాడారు. ఈ రోజు కన్నాభిరాన్ సార్, పద్మనాభ రెడ్డి సార్ లాంటి న్యాయవాదులు నాలాంటి వారికి న్యాయం ఇప్పించిన కారణంగా సమాజంలో మనగలిగే అవకాశం... వారి మార్గదర్శనంలో కాస్తయినా కొనసాగే, నడిచే అవకాశం కలిగిందంటే అతిశయోక్తి కాదు. పేదల గుండెల్లో... న్యాయం కోసం పోరాడే స్వరాల్లో పద్మనాభ రెడ్డి సార్ పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది.

(నేడు లాయర్ సి. పద్మనాభ రెడ్డి వర్ధంతి)

- ఎండి.మునీర్,

సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు,

99518 65223

Tags:    

Similar News