సోషలిజమే... నేతాజీ దేశభక్తి

Remembering Subash Chandra bose

Update: 2024-01-23 00:30 GMT

మీ రక్తాన్ని ధారపోయండి - నేను స్వాతంత్రం సాధించి పెడతానని ఉర్రూతలూగించిన సుభాష్ చంద్రబోస్ మాటలు ఆనాటి యువతరాన్ని స్వాతంత్ర్య సమరంలో ఉవ్వెత్తున పాల్గొనేటట్లు చేశాయి. స్వామి వివేకానంద, భగత్ సింగ్ తరువాత దేశ యువతపై అత్యంత ప్రభావం, చైతన్యం కలిగించిన వ్యక్తిగా, దేశభక్తికి మారుపేరుగా నిలిచిన ధీశాలి సుభాష్ చంద్రబోస్. ఈయననే మనం నేతాజీ అని పిలుచుకుంటాం.

ఆయన నేటి ఒడిషా లోని కటక్‌లో 1897 జనవరి 23న జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి దంపతులకు జన్మించాడు. కటక్, కొల్‌కతాలో విద్యాభ్యాసం చేసి, 1920లో భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలో 4వ ర్యాంకు సాధించిన మేధావి.‌ అయితే దేశానికి స్వాతంత్య్రం సాధించాలనే లక్ష్యంతో 1921లో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి వైదొలగి, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో యువజన విభాగంలో ప్రముఖ పాత్ర వహించారు. సహయ నిరాకరణ ఉద్యమ సమయంలో గాంధీజీ సూచన మేరకు కలకత్తా వెళ్ళి, చిత్తరంజన్ దాస్‌తో కలిసి బెంగాల్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు.‌ అయితే, గాంధీజీ అభిరుచికి వ్యతిరేకంగా 1938లో భారత్ జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనారు. తదుపరి పార్టీలో ఏర్పడిన సంక్షోభం వల్ల కాంగ్రెస్ నుంచి వైదొలగి, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా ఎవరినీ సంప్రదించకుండా, భారతదేశం తరఫున యుద్ధం ప్రకటించింది. అప్పటి వైస్రాయ్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ పెద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్‌ని అరెస్టు చేసి జైలుకు పంపింది. తదుపరి విడుదల చేసినా, ఆయనపై నిఘా కొనసాగించింది.

విసిగిపోయిన సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వాతంత్య్రం సాధించాలనే పట్టుదలతో బ్రిటిష్ వారి కన్నుగప్పి మారువేషంలో ఆఫ్ఘనిస్తాన్, ర‌ష్యా, ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్నారు. అక్కడ జర్మనీ వాసుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో ప్రసారాలు మొదలు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్ర్యం ఇస్తారు అని గాంధీ, నెహ్రూ భావించారు.‌ అయితే రెండవ ప్రపంచ యుద్దంలో మునిగిపోయిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని కనిపెట్టి, ఇదే మంచి అవకాశం అని భావించి సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలి అని నినదించారు.‌ ముఖ్యంగా ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు గారీబాల్డి, మాజిని వంటి వారి ప్రభావం సుభాష్ చంద్రబోస్‌పై పడింది. ముఖ్యంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు సోషలిస్టు పాలనలో కొనసాగాలని ఆశించారు. ఇదే సమయంలో దేశానికి త్వరితగతిన స్వాతంత్ర్యం సాధించాలి అనే తపనతో భారత జాతీయ సైన్యం (ఆజాద్ హింద్ ఫౌజ్)లో చేరారు. ఆయన స్ఫూర్తితో, అనేక మంది యువకులు ఈ సైన్యంలో చేరారు. సైనిక చర్య ద్వారా దేశానికి స్వాతంత్య్రం సాధించాలనే పట్టుదలతో ఉన్న సుభాష్ చంద్రబోస్, 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యోకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన ప్రమాదం జరిగింది. అయితే ఆయన మరణించిన విషయం కానీ దాని కారణం కానీ ఇప్పటికీ తేలలేదు. అయితే, ఒక మంచి ఆశయం గల వ్యక్తి మరణించినా, తర్వాత కాలంలో అనేక వేల మంది ఆ ఆశయ సాధనకు కృషి చేస్తారు అంటూ ఆయన చెప్పిన మాటలు నేటి యువత ఆచరణలో పెట్టాలి. సమసమాజ స్థాపనలో యువత కీలక పాత్ర వహించడమే నేతాజీకి ఇచ్చే ఘన నివాళి...

(నేడు సుభాష్ చంద్ర బోస్ జయంతి)

- ఐ. ప్రసాదరావు

63056 82733

Tags:    

Similar News