నవ్య సినిమా ‘భూమిక’ స్మితా పాటిల్
భారతీయ నవ్య సినిమాకు పర్యాయపదంగా నిలిచిన నటి స్మితాపాటిల్. ఆమె పోషించిన పాత్రలు నటనలో ఆమె సృష్టించిన ఒరవడి, దాన్ని సాధించడం కోసం
భారతీయ నవ్య సినిమాకు పర్యాయపదంగా నిలిచిన నటి స్మితాపాటిల్. ఆమె పోషించిన పాత్రలు నటనలో ఆమె సృష్టించిన ఒరవడి, దాన్ని సాధించడం కోసం ఆమె పడ్డ శారీరక మానసిక శ్రమనీ, ఆమెలోని సిన్సియారిటీని, సీరియస్‌ని ప్రస్పుట పరిచాయి. స్మిత 1955 అక్టోబర్ 17న జన్మించారు. 1987 డిసెంబర్ 13న ఆమె అందరినీ వీడిపోయినా అప్పటికీ ఇప్పటికీ ఆమె స్మృతి, అర్థవంతమైన మంచి సిన్మా అభిమానుల్లో ఇంకా స్థిరంగానే వుంది.
ఆమె సినిమాల్ని జాగ్రత్తగా గమనించినప్పుడు ఆమెకు నటించడం చేతగాదనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఆమె పోషించిన పాత్రలన్నీంటిలో స్మితా పాటిల్ కనిపించదు. ఆయా పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఆమె తన నటనలో అండర్ ప్లే చేయడం కానీ, ఓవర్ ప్లే చేయడం కనిపించదు. అతిగా లార్జర్ దేన్ లైఫ్ ప్రాజెక్ట్ చేయడం కూడా చేయలేదు. ఆయా పాత్రల సామాజిక ఆర్థిక మానసిక స్థితిగతుల్ని సమర్థవంతంగా అవగాహన చేసుకుని తెరపై ఆవిష్కరించింది. అందుకే స్మితా పాటిల్ తన సినిమాల్లో నటించలేదు. ఆంగికంలోనూ, అభినయంలోనూ, ఆహార్యంలోనూ ఆమె ఆయా పాత్రలని అవగాహన చేసు కుని ఆవిష్కరించారు. అందుకే స్మితా పాటిల్ భారతీయ సినిమా రంగానికి లభించిన ఓ ఆణిముత్యం. సినిమా రంగం మిగిల్చిన ఓ మధురమైన జ్ఞాపకం. స్మితా పాటిల్ సినీ రంగ జీవితం కేవలం 12 సంవత్సరాలు.. కేవలం పుష్కర కాలంలోనే ఆమె నటనలో తనదయిన ఒరవడిని, జీవితంలో నిబద్ధతని పాటించి లక్షలాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది.
అసాధారణ అందం.. భావ ప్రదర్శన
1955లో పూనేలో జన్మించిన స్మితా పాటి ల్ బాంబేలో చదువుకుంది. సాహిత్యాన్ని సీరియస్‌గా అధ్యయనం చేసిన ఆమె కొంత కాలం టీవీ వ్యాఖ్యాతగా పనిచేసింది. అనేక స్టేజీ నాటకాల్లో నటించిన ఆమె మొట్ట మొదటిసారిగా ఫిలిం ఇన్స్టిట్యూట్‌లో అరుణ్ కేప్కర్ తీసిన డిప్లొమా సినిమా ‘తీస్రా మాధ్యం’లో నటించింది. అనంతరం సుప్రసిద్ధ దర్శకుడు శ్యాం బెనగల్ రూపొందించిన బాలల చిత్రం ‘చరణ్ దాస్ చోర్’ లో నటించింది. ఆమెను శ్యాం బెనగల్ టీవీలో చూసి ఆమె అసాధారణ అందానికి, ముఖంలో కనబరచిన భావాలకు ఆకర్షితుడై ఆమెను తన సినిమాలో తీసుకున్నాడు. అట్లా ప్రారంభమైన ఆమె చలనచిత్ర యాత్రలో 70కి పైగా సినిమాల్లో నటిం చింది. ఆమె కేవలం హిందీలోనే కాకుండా బెంగాలీ, మలయాళీ భాషలతో సహా అనేక భాషా చిత్రాల్లో నటించింది. స్మితా పాటిల్ తన చలన చిత్ర జీవితంలో ప్రధానంగా నవ్య సినిమాల్లో నటించినప్పటికీ మరోవైపు ప్రధాన స్రవంతి సినిమాల్లో కూడా నటిం చారు. కానీ నటిగా ఆమె ప్రతిభ విశ్వ రూపం ఆర్ట్ సినిమాల్లోనే వెల్లివిరిసింది. తను ప్రధానంగా స్త్రీ వ్యక్తిత్వం ఆవిష్కరించిన పాత్రలనే పోషించారు. వాటితో తన రేంజ్‌ని నిరూపించుకున్నారు.
పాత్రల్లో పరకాయ ప్రవేశం
శ్యాం బెనగల్ రూపొందించిన ‘నిశాంత్’ చిత్రంలో మధ్యతరగతి గృహిణిగా పాత్రను పోషించిన స్మిత, గోవింద్ నిహలాని ‘అర్థసత్య’లో పోలీస్ ఆఫీసర్ అయిన ప్రియుడి మానసిక స్థితిని సంఘర్షణని మౌనంగా అర్థం చేసుకున్న ప్రియురాలిగా నటించి ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఇక ‘భూమిక’ సినిమాలో స్మిత హంసా వాడేకర్ జీవిత చరిత్రను, హంస అనుభవించిన సంఘర్షణను అద్వితీయంగా పోషించారు. ఒక రకంగా స్మితా పాటిల్ ‘భూమిక’లో హంసా వాడేకర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో నటనకు గాను స్మితకు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. కీర్తిశేషుడయిన దర్శకుడు రవీంద్ర ధర్మరాజ్ రూపొందించిన ’చక్ర’లో స్మిత పాటిల్ నటన మహో న్నత శిఖరాలకు చేరింది. బొంబాయి మురికివాడల్లో నివసించే అమ్మ పాత్రలో అత్యంత సహజంగా నటించి రెండోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందు కుంది. మురికివాడల్లోని స్త్రీలు ఎదుర్కొనే అష్టకష్టాల్ని, పేదరికాన్ని, వారి జీవన విధానాన్ని స్మిత నటన కళ్లకు కట్టింది.
సమాజం పట్ల భాగస్వామ్యం
ఇదిలా ఉంటే ప్రధాన సినిమాల్లో కూడా స్మితా పాటిల్ నటించి వాన పాటల్లో కూడా భళా అనిపించారు. అమితాబ్‌తో కూడా కథానాయకిగా మెప్పించింది. రొటీన్ పాత్ర ల్లో కూడా నటించింది. ఆమె ‘బద్లేకీ ఆగ్’, ‘నమక్ హలాల్’, ‘శక్తి’, లాంటి వ్యాపారాత్మక ప్రధాన సినిమాల్లోనూ నటించింది. నటిగా కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా ఆమె సమాజం పట్ల కూడా తన బాధ్యతని నిర్వర్తించింది. వరద బాధితుల సహాయార్ధం వీధుల్లో చందాలు పోగు చేసినప్పుడు, సినిమా ప్రపంచమంతా సమ్మెలో పాల్గొన్నప్పుడు ఇంకా అనేకానేక సందర్భా ల్లో ముందుండి పోట్లాడారు. నటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న ఆమెకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇక మరోవైపు అప్పటివరకు ఏ ఆసి యా నటికి అందనంత గౌరవం స్మితాకు దక్కింది. పారిస్‌లో కోస్తాగ్రావిస్ స్మితా పాటిల్ నటించిన చిత్రాలతో రెట్రాస్పెక్తివ్ ను నిర్వహించారు. ఇంకా స్మితా పాటిల్ మాంట్రియాల్ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరిగా పనిచేసారు. జాతీయ అవార్డులతో పాటు అనేక గౌరవాలు పొందినప్పటికీ స్మితా పాటిల్ నటిగా చూపించిన వైవిధ్యం, ప్రతిభ ఏ బహుమతులకూ అందనిది. ఆమె తన ముఖ కవళికల్లో బాడీ లాంగ్వేజ్‌లో చూపించే వ్యక్తిత్వం చాలా గొప్పది.
చెరపలేని సంతకం స్మిత
కమర్షియల్ సినిమాల్లోనైనా, గ్లామరస్ అర్బ న్ ఓరియంటెడ్ పాత్రల్ని చేసినా వాటిల్లో ఆమె చూపించిన ఈజ్ ఎన్నదగినది. ఇక మధ్యతరగతి స్త్రీ పాత్రల్లో అమాయకత్వం, నమ్మిన వాటి పట్ల చూపించే పట్టుదల, విశ్వాసం మహత్తరంగా కనిపిస్తాయి. కొన్ని సినిమాల్లో డవున్ టు ఎర్త్ పాత్రల్ని ఆమె సహజంగా పోషించారు. అట్టడుగు వర్గాల్లో వుండే ప్రేమ ఆప్యాయత, తెగింపు ఎదురు తిరిగే స్వభావం స్మితా పాటిల్ నటనలో అత్యంత సహజంగా పలికాయి. అలా వెండి తెరపై వెలుగులు చిమ్మి అద్భుత భావాల్ని పలికించిన ఆమె గొప్ప స్మృతిగా మిగిలిపోయింది. స్మితా పాటిల్ తన సహనటుడు రాజ్ బబ్బర్‌ను ప్రేమించి పెళ్లాడారు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం 1986లో తనువు చాలించారు. ఆమె మిగి ల్చిన ఖాళీ పూరించలేనిదిగా మిగిలి పోయింది. ఆమె స్థానం శాశ్వతమైంది. ఆమె సంతకం చెరపలేనిది.
(డిసెంబర్ 13న స్మితా పాటిల్ వర్ధంతి)
వారాల ఆనంద్
94405 01281