సావిత్రిబాయి ఫూలే అనగానే అందరికీ ఆమె జ్యోతిరావు ఫూలే భార్యగానో, లేదంటే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగానో మాత్రమే ఆమెను తెలుసుకుంటున్నారు. భారతీయ సమాజంలో వేల ఏళ్లుగా పాతుకుపోయిన కుల వివక్ష, అంటరానితనం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, మూఢ నమ్మకాల వంటి అసమంజస, అమానవీయ పద్ధతులను రూపుమాపి, అందరూ సమానమే, అందరికీ చదువు, సంపద హక్కులు కావాలని, చదువొక్కటే మనిషిని సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చేస్తుందని చాటి చెప్పి, అందుకోసం తన యావజ్జీవితాన్ని ధారపోసిన గొప్ప సంఘసంస్కర్త, త్యాగశీలి అన్నింటికీ మించి సమాజాన్ని అమితంగా ప్రేమించిన సామాజిక ప్రేమ స్వరూపిణిగా ఆమెను మనం గుర్తుంచుకోవాలి.
భౌతిక దాడులకు పాల్పడినా..
1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతార జిల్లా, నయ్ గాంవ్‌లో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించింది. అప్పట్లో బాల్య వివాహాలు జరిగేవి కనుక తమ తల్లిదండ్రులు 11 సం.ల. వయసున్న జ్యోతిరావు ఫూలేతో బాల్య వివాహం జరిపించారు. అప్పటి సమాజంలో స్త్రీలు చదువుకునే అవకాశం లేని కారణంగా ఆమెకు అక్షర జ్ఞానం లేకున్నది. కానీ ఆమె భర్త జ్యోతిరావు ఫూలేనే గురువుగా మారి ఆమెకు చదువు నేర్పించి, ఉపాధ్యాయ శిక్షణను ఇప్పించారు. ఆ వెంటనే 1848లో మహారాష్ట్రలోని పూణేలో 9 మంది బాలికలతో దేశంలోనే తొలి బాలికా పాఠశాలను ప్రారంభించింది. మనుధర్మ శాస్త్రమే రాజ్యాంగమై, శాసన గ్రంధమై విరాజిల్లుతున్న కాలం కావడంతో బాలికల పాఠశాల ప్రారంభాన్ని ఆనాటి బ్రాహ్మణ ఆధిపత్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. ఆ పాఠశాలను మూసివేయాలని, మహిళలకు, శూద్రులకు చదువు, సంపదలు అక్కర్లేదని, వారు కేవలం బానిసలు, సేవలు చేసేందుకే దేవుడు వారినలా పుట్టించాడని సావిత్రిబాయి ఫూలేకు హెచ్చరించినా వినలేదు. సహనం కోల్పోయి కోపోద్రిక్తులైన బ్రాహ్మణ పీశ్వాలు ఆమెపై భౌతిక దాడులకు పాల్పడినా వినలేదు. దీంతో ఆమెపై గ్రామ బహిష్కరణ వేటు వేశారు. అయినా ఆమె భయపడలేదు, మార్గాన్ని మార్చుకోలేదు. అంతటి నిర్బంధాన్ని, సామాజిక వెలివేతను కూడా లెక్క చేయక ఆమె సాగించిన విద్యా ఉద్యమానికి అనతి కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. 1848లో 9 మందితో మొదలెట్టిన విద్యా ఉద్యమం వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించేంత వరకు కొనసాగింది.
కరువు పరిస్థితుల్లోనూ..
అంతే కాకుండా కుల వివక్ష, అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి సామాజిక రుగ్మతలను రూపుమాపే అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొనేది. బాలికల చదువు కోసం పాఠశాలలు ప్రారంభించినట్లుగానే వితంతువులకు పునర్వివాహలు చేయడానికి, దిక్కు లేని మహిళలు పురుడు పోసుకునేందుకు కూడా పునరావాస కేంద్రాలను విజయవంతంగా నిర్వహించింది. మహిళా హక్కులే మానవ హక్కులు అని నినదించి, స్త్రీల సాధికారత కోసం సేవా మండల్ సంఘాన్ని స్థాపించింది. వితంతువులకు శిరో ముండనం చేయడం అమానవీయమని ఖండించి, క్షరకుల చేతనే శిరో ముండనం చేయమనేలా చైతన్యం చేసింది. 1873లో జ్యోతిరావు పూలే ప్రారంభించిన సత్య శోధక్ సమాజ్ అనే సంస్థ మహిళా విభాగం ఆమె ఆధ్వర్యంలో నడిపి, పురోహితులు లేకుండా వివాహాలు జరుపుకునే విధానాన్ని ప్రారంభించింది. అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సాగించింది. దేశంలో తీవ్రమైన కరువు సంభవించినప్పుడు వీరు 2000 మంది బాల బాలికలను అక్కున చేర్చుకొని తమ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అలాగే మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరువు, ప్లేగు వ్యాధి విజృంభణ పరిస్థితుల్లోనూ పేదల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించి, రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే 1897 మార్చి 10న ఆమె మరణానికి కారణం అయింది.
(నేడు సావిత్రిబాయి పూలే 193వ జయంతి)
- విజయ్. పి
99898 63039