ప్రస్తుత జనగామ జిల్లా రఘునాధపల్లి మండలం, ఖిలాషాపూర్‌లో ధర్మన్నగౌడ్, సర్వన్న దంపతులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మించారు. ఇతను ఎల్లమ్మ భక్తుడు. ఆగస్ట్ 18 1650లో జన్మించిన ఇతడు 1710 లో మరణించాడు. బాల్యం నుండే సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను పరిశీలించడం అలవరచుకున్నాడు. కులవృత్తి కల్లుగీయడం(కలాలి) అలవడింది. ఆ క్రమంలో ఇతర కులాల వారితో కలిసి తిరిగేవాడు. చాకలి, మంగలి, దూదేకుల, కుమ్మరి కులాల నుండి వచ్చిన మిత్రులు వీరికి ప్రధాన అనుచరులుగా నిలిచారు.
సొంతంగా సైన్యం సమకూర్చుకుని..
పదహారవ శతాబ్దంలో బహమనీ సుల్తనేట్ ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. గోల్కొండ కోట కుతుబ్‌షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. నాటి రాజులు నిరంకుశులు. పన్ను వసులుకు వచ్చే సైనికులు ప్రజల్ని హింసించేవారు. కులమతాల పేరున పన్నులు వసూలు జరిగేది. గౌడ కులం వారికి తాటిచెట్టు సుంకం వేశారు. సైనికులు శిస్తు వసూల్ చేసుకుని వెళ్ళే దారిలో పాపన్న వద్ద కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా హేళన చేసేవారు. దీన్ని ప్రశ్నించిన పాపన్న స్నేహితుడిని సైనికులు దండించారు. దాన్నీ పాపన్న అడ్డుకున్నాడు. ఆ సంకుల సమరంలో సైనికులు ఓడిపోయారు. వారి వద్ద ఉన్న డబ్బును పాపన్న ప్రజలకు పంచిపెట్టారు. అలా పాపన్నలోని విప్లవకారుడు నిద్ర లేచాడు. అప్పటి నుంచి శిస్తు వసూలు చేసుకొని వెళ్తున్న సైనికులపై దాడులు చేయడం ప్రారంభించారు. సైనికుల వద్దనున్న ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు స్వాధీనం చేసుకునేవాడు. పేదవారికి డబ్బు సహాయం చేసేవాడు. పన్ను హింస తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలకు పాపన్న ఆరాధ్య వీరుడయ్యాడు. ఈ క్రమంలో అతను యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. సొంతంగా కొన్ని వేల మందిని సైనికులుగా సమకూర్చుకున్నాడు. అంగ, అర్థ బలాలతో అజేయుడిగా మారాడు.
తురుష్క విస్తరణను అడ్డుకుని
ఆనాటి రాజుల, వారి తాబేదార్ల, జమీందారుల, భూస్వాముల నిరంకుశ పాలనను అంతమొందించి, బహుజన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. తన వద్ద శత్రువుతో నేరుగా యుద్ధం చేసేంత సైన్యం, ధనం లేనందున ‘గెరిల్లా పోరాటం’ ద్వారా దాడిచేసి తన ఊరు ‘శిలాషాపురం’ను విముక్తి ప్రాంతంగా ప్రకటించారు. అక్కడి నుంచి తన పాలన మొదలయ్యింది. తమ తరఫున పోరాడుతున్నాడని గ్రహించిన ప్రజలు అతనికి మద్దతుగా నిలిచారు. పెద్ద సంఖ్యలో సైన్యాన్ని, గుర్రాల్ని సమకూర్చుకున్నాడు. తురుష్క పాలనను అంతమొందించాలని గెరిల్లా దాడులను ఉధృతం చేశాడు. శత్రు దుర్భేద్యమైన అనేక కోటలను వశపరచుకున్నాడు. బహుజన రాజ్యాన్ని స్థాపించారు. ఇది చూసి భూస్వాములు కుట్రతో అతని సైన్యాన్ని బలహీనపరిచారు. అయినా వెనుకంజ వేయలేదు. ఖిలాషాపురంలో దుర్భేద్యమైన కోటను నిర్మించుకున్నారు. అదే వరుసన అనేక కోటలను జయిస్తూ చివరకు గోల్కోండ కోటపై దాడి చేసి దాన్ని వశపరచుకున్నాడు. తెలంగాణలో తురుష్క రాజ్య విస్తరణను అడ్డుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. జానపద కథలలో స్థానిక వీరుడిగా పాపన్నను కీర్తిస్తారు. సాధారణ ప్రజలు కష్టనష్టాలు తెలుసు కనుక తన రాజ్యంలో పన్నుల పీడన జరగలేదు. తన గెరిల్లా సైన్యంతో జమీందార్లపై దాడి చేయించి ఖజానా నింపుకునేవాడు.
బహుజనుల్లో తొలి వ్యక్తి..
ఆయన సామాజిక నినాదం పాటించారు. సర్వాయి పాపన్న గురించి చరిత్రలో అనేక కథనాలున్నాయి. పాపన్న పేదల పక్షపాతి. స్వయం నిర్ణయాధికారాన్ని కాంక్షించి తన ప్రాంతానికి విముక్తి కలిగించారు. ఆ కాలానా కింది కులాల నుండి రాజ్యాధికారాన్ని అనుభవించిన తొలి వ్యక్తి. బహుజన రాజ్యాన్ని, అధికారాన్ని స్థాపించుకొనుటకు చరిత్ర, వర్తమానానికి అందించిన ఒక నమూనా. అతని విగ్రహాలు తెలంగాణలో చాలా చోట్ల వెలసాయి. తెలంగాణ ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. అద్భుతాన్ని ఆవిష్కరించిన సర్వాయి పాపన్న తెలంగాణ పౌరుషానికి ప్రతినిధి. స్వయం పాలన ద్వారా మాత్రమే దౌర్జన్యాలు, ఆరాచకాలు నశిస్తాయని నమ్మి బహుజనుల కోసం సర్వశక్తులు ధారపోసిన పాపన్న మహరాష్ట్ర వీరుడు శివాజీకి సరిజోడు. ప్రత్యేక తెలంగాణ కాంక్ష వెనక పాపన్న స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితో అతడు కలలుగన్న సమాజాన్ని సాధించాలి.
-డా. బి.వి.ఎన్ స్వామి
92478 17732