పుంభావ సరస్వతి సామల సదాశివ

Remembering samala Sada siva

Update: 2024-05-11 00:30 GMT

తెలుగు సాహితీవనంలో ఆయన ఒక తోటమాలి. తన రచనల పూలమాలలతో తెలంగాణ తల్లిని అర్చించిన సరస్వతీమూర్తి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిలాషి. తెలుగు ,హిందీ, మరాఠీ, ఫారసి, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృతం వంటి ఏడు భాషల్లో ప్రతిభా పాండిత్యం కలిగిన వ్యక్తి. ఇతర భాషల్లో వెలుబడ్డ సాహిత్యాన్ని తెలుగు సాహితీ ప్రపంచానికి అందించిన విభిన్న భాష సంస్కృతుల కళావారధి. భాష ఏదైనా తన రచనలను ముచ్చట రూపంలో పాఠకులకు అందించడమే సామల సదాశివుడు ప్రత్యేకత.

తెలుగువారికి హిందుస్తానీ సంగీతం యొక్క మధురిమలను మెచ్చే పద్ధతిలో రచించిన పుస్తకం మలయ మారుతాలు. 2009లో ఆయన రచించిన స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది మీర్జాగాలిబ్ ,ఉర్దూ సాహిత్య చరిత్ర, ఫారసీ కవుల ప్రశస్తి ఆయన రచనలు. అతి సామాన్యుల నుండి అత్యున్నత శ్రేణి ఉన్నవారి వరకు అందరితో ఉన్న తన అనుభవాలను జ్ఞాపకాలను తిరుగులేని విధంగా, ఎవరూ మరిచిపోలేని విధంగా, మరొకరు అనుకరించలేనంత గొప్పగా, ధారావాహికంగా, అమృత వర్షంగా కురిపించిన జ్ఞాపక రచనల గొప్ప వచన శిల్పం యాది. ఇది 2005లో గ్రంథస్థం అయింది. యాది అంటేనే సామల సదాశివుడు అన్నంతగా గుర్తింపు వచ్చింది.

నేటి కొమురం భీం జిల్లాలో భాగమైన దహగాం మండలం తెలుగు పల్లెలో 11 మే 1928 న నాగయ్య, చిన్నమ్మ దంపతులకు జన్మించిన తెలుగు నుడికారపు ప్రతిరూపం సామల సదాశివుడు. విద్యావంతుల కుటుంబం కావున చిన్నతనంలోనే రామాయణ మహాభారతాలు, బసవ పురాణం, కళాపూర్ణోదయం వంటి పుస్తకాలు చదివారు. తండ్రి నాగయ్య అనివార్య కారణాలవల్ల ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి రావటంతో తన 19 వ యేటనే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలను అభ్యసించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిగా ఉద్యోగపర్వం మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ చివరగా భద్రాచలం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు.

1949లో ప్రభాతము అనే పద్య కావ్యాన్ని రాసి సాహిత్య లోకంలోకి ప్రవేశించారు. 1950లో 100 పద్యాలతో సాంబశివ శతకాన్ని రాశాడు. గోల్కొండ పత్రికకు పద్యాలు రాసే క్రమంలో కవికేసరి సురవరం ప్రతాపరెడ్డి మన భాష సుగంధాన్ని ఇతర భాషలకు అందించమన్న సూచనతో పద్య కవిత్వాన్ని వదిలి అనువాదకుడిగా మారాడు. ఉర్దూ పత్రికలకు తెలుగు సాహిత్యం గురించి అలాగే ఇతర భాషల సాహిత్యాన్ని తెలుగు ప్రపంచానికి తెలిపి సాహిత్య వారధి అయ్యాడు. సియాసత్ పత్రికకు అనేక వ్యాసాలు రాశాడు 300 వ్యాసాలు ఉర్దూలో, 450 వ్యాసాలు తెలుగులో రచించాడు. సామల రచించిన అపశృతి నవల అత్యంత ప్రజాదరణ పొందింది. తెలుగువారికి హిందుస్తానీ సంగీత మధురిమలను మెచ్చే పద్ధతిలో రచించిన పుస్తకం మలయ మారుతాలు.

1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తక ప్రచురణ సంస్థ నుండి ఏడవ తరగతి తెలుగు వాచకం రాసే అవకాశం రావడంతో కొమరం భీం పాఠాన్ని పొందుపరిచి తెలంగాణలో మరుగున పడ్డ పోరాట వీరుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం తెలంగాణ పదవ తరగతి తెలుగు పుస్తకంలో ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠ్యాంశం సామల రచించిందే. తెలంగాణ మాగాణంలో సాహితీ శిఖరం సామల సదాశివుడు. 2012 ఆగస్టు 7న ఈ లోకాన్ని విడిచి తెలుగు సాహితీ ప్రియులకు యాదిగా మిగిలిపోయారు.

(నేడు డాక్టర్ సామల సదాశివ జయంతి)

ములక సురేష్

94413 27666

Tags:    

Similar News