మహిళోద్ధారకుడు సాహు మహారాజ్

భారతదేశ చరిత్రలో దళిత, బహుజనులను విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా, పాలనాపరంగా మహాత్మ జ్యోతిబాపూలే

Update: 2024-06-26 00:30 GMT

భారతదేశ చరిత్రలో దళిత, బహుజనులను విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా, పాలనాపరంగా మహాత్మ జ్యోతిబాపూలే, ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసిన మహానీయుడు ఛత్రపతి సాహుమహారాజ్‌. 1874 జూన్‌ 26న జన్మించిన యశ్వంతరావు ఘాట్గేనే ఆ తర్వాత కాలంలో సాహు మహారాజ్‌గా ప్రసిద్ది చెందాడు. ఘాట్గేలు మహారాష్ట్రలో వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కి చెంది, వ్యవసాయం చేసుకొని జీవించే ''కున్భీ'' కాపు కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్‌ రాజ్యంలో వారసులు లేకుంటే శివాజీ నాలుగవ భార్య రాణి ఆనందబాయి తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరిస్తుంది. ఆ అబ్బాయే యశ్వంత్‌రావు ఘాట్గే. ఆ అబ్బాయికే ముద్దుగా 'సాహు' అని పేరు పెట్టుకున్నది.

బ్రాహ్మణేతరుల కోసం..

తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో అన్ని రంగాల్లో బ్రాహ్మణులు నిండిపోవడం చూసిన సాహు బ్రాహ్మణేతరులని ఉన్నత ఉద్యోగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో, జీవితాల్లో మార్పు రాదని భావించి వారికి స్కూల్స్, హాస్టల్స్ ప్రారంభించి విద్యని ఉద్యమంగా నడిపాడు. కొల్హాపూర్‌ పట్టణంలో అన్ని కులాల వారికి హాస్టల్స్‌ నిర్మించిండు. ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాల నేర్పరచి అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనందించాడు. పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు గ్రామాల్లోని ఆలయాలను, చావడీలను పాఠశాలలుగా వాడాలనీ, గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీగా ఉన్నారో ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమించాడు. వ్యవసాయం ఇతర వత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పరచాడు. గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్‌ (పాటిల్‌), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు. ఉపాధ్యాయులుగా కూడా వారసత్వంగా పని చేయడాన్ని రద్దు చేశారు. 1919, సెప్టెంబర్‌ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రకటించారు. 1920 మే 3న వెట్టిచాకిరి వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేశారు.

మహిళల కోసం..

1920 ఏప్రిల్‌ 15న నాసిక్‌లో అంబేద్కర్‌ ఆయన మిత్రులు అంటరాని వారి కోసం ఒక హాస్టల్‌ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇచ్చారు. 1920లో అంబేద్కర్‌ ఇంగ్లాండ్‌ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. అంబేద్కర్‌ విదేశాల్లో ఉన్నంత కాలం 'మూక్‌ నాయక్‌' పత్రిక నిర్వహణకి సాహు మహారాజ్ ఆర్థిక సహాయం చేశారు. పితృస్వామ్య, కుల, మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్‌ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించారు. సంగీతంలో, చిత్రలేఖనంలో, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించారు. కొల్హాపూర్‌ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారు. ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు, ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేశారు. కొల్హాపూర్‌ రాజారాం కాలేజీలో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది. 1919 జూలై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చిన 'కొల్హాపూర్‌ స్పెషల్‌ మ్యారేజీ యాక్ట్‌ - 1918' ప్రకారం ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులను ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న ప్రకటించిన విడాకుల చట్టం, స్పెషల్‌ మ్యారేజీ యాక్ట్‌ అప్పట్లో దేశంలో సంచలనం సష్టించాయి. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశారు. ప్రభుత్వం తరపున దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నారు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు చేశారు. అలాగే తన కొల్హాపూర్ సంస్థానంలోని మున్సిపాలిటీకి ఒక మాదిగ యువకున్ని మేయర్‌గా చేసిన ఘనత ఆయనకే దక్కింది. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్‌ 1922 మే 6న మరణించారు.

(నేడు సాహు మహారాజ్ జయంతి)

సంపత్ గడ్డం

78933 03516

Tags:    

Similar News