పుల్వామా వీరుల త్యాగం!

Remembering Sacrifice of Pulwama heroes!

Update: 2024-02-14 00:00 GMT

2019 ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో మాయని మచ్చ. భారతదేశంలో జరిగిన ఘోరమైన ముష్కర దాడుల్లో ఈ దాడి అత్యంత భయానకమైనది. ఆ దాడిలో 40 మంది దేశ సీఆర్‌పీఎఫ్ సిబ్బంది నేలకొరిగారు. 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం కశ్మీర్‌లో 2,500 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్ జాతీయ రహదారి 44 పై వెళ్తుండగా పుల్వామా జిల్లాలోని అవంతిపుర దగ్గర కాన్వాయ్ లోని ఒక బస్సును ఒక ఉగ్రవాది కారులో భారీగా పేలుడు పదార్థాలతో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. భారీ విస్పోటనంతో పేలుడు సంభవించింది. దీంతో బస్సులో ఉన్న 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టలేనంతగా అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. జవాన్ల మాంసపు ముద్దలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దాడి జరిగి నేటికీ ఐదేళ్లు అవుతుంది.

యావత్తు భారతావని కన్నీళ్లు

పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారనే వార్త వినగానే దేశం మొత్తం పుల్వామా దాడిని ఖండించిది. జమ్మూ కాశ్మీర్‌లో జవాన్లను దొంగదెబ్బ తీసి నెత్తుటి దారలను పారించిన ముష్కరులకు గుణపాఠం నేర్పించాలని నినదించింది. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి నోటా ఇదే మాట. దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 14 పుల్వామా అమరుల దినోత్సవంగా జరపాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రతీకారం తీర్చుకున్న భారత్

పుల్వామా దాడికి రగిలిపోయిన భారత్... పాకిస్తాన్ ఉగ్ర మూకలకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ముజఫరాబాద్, బాలాకోట్, చకోటి సెక్టార్ లలోని ఉగ్రవాద స్థావరాలపై మిరాజ్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఉగ్ర స్థావరాలపై వెయ్యి కిలోల లేజర్ గైడెడ్ బాంబులను వదిలి పుల్వామా దాడికి పాల్పడిన జైషే మహ్మద్‌ను దెబ్బ తీసింది. పాక్ అండతో ఉగ్ర శిబిరాలను ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో భీకర దాడుల్లో విరుచుకు పడింది. నియంత్రణ రేఖను దాటి మరీ ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది భారత సైన్యం. ఈ సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత్‌పై కన్నీటి చూస్తే ఊరుకునేది లేదని మరోసారి రుజువు చేసింది భారత్.

(నేడు పుల్వామా అమర సైనికుల సంస్మరణ)

నేరడిగొండ సచిన్

87907 47628

Tags:    

Similar News