డ్రోన్ పనితీరు భళా.. తెస్తుంది కాసుల కళ

వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో డ్రోన్ ఇంజినీరింగ్ మరింత అధునాతనంగా, విస్తృతంగా మారడంతో, ఈ మానవరహిత ఎగిరే యంత్రాలు

Update: 2024-10-24 00:45 GMT

వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో డ్రోన్ ఇంజినీరింగ్ మరింత అధునాతనంగా, విస్తృతంగా మారడంతో, ఈ మానవరహిత ఎగిరే యంత్రాలు 21వ శతాబ్దపు సాంకేతిక వినియోగంలో అంతర్భాగంగా మారాయి. డ్రోన్ చిన్న, పైలట్ లేని విమానం లాంటిది. దీనిని అధికారికంగా మానవరహిత వైమానిక వాహనం అని పిలుస్తారు. సరళంగా చెప్పాలంటే, ఇది ఎగిరే రోబోట్, దీనిని దూరం నుండి నియంత్రించవచ్చు.

వీటిని నావిగేట్ చేయడానికి ప్రత్యేక సెన్సార్లను కలిగి ఉంటాయి. ప్రారంభంలో, సైన్యం ప్రధానంగా లక్ష్య సాధన, సమాచారాన్ని సేకరించడం వంటి వాటి కోసం డ్రోన్‌లను ఉపయోగించింది. వివిధ రకాల డ్రోన్‌లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం రూపొందించబడ్డాయి. ఏరియల్ ఫోటోగ్రఫీ, ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, జియోగ్రాఫికల్ మ్యాపింగ్, బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్‌లు,‌ క్రాప్ మానిటరింగ్,‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్, లా ఎన్‌ఫోర్స్‌ మెంట్, వాతావరణ అంచనా వంటి రంగాలు డ్రోన్‌ల వినియోగం విరివిగా వుంది. నిర్మాణ రంగంలో కమర్షియల్ డ్రోన్స్ మెత్తం మార్కెట్‌లో 40% వాటాని ఆక్రమించుకున్నాయి.

ఫ్యూచర్ గేమ్ చేంజర్...

ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లులో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రత్యేక హబ్‌ ఏర్పాటుతో తయారీ పరిశ్రమలు, డ్రోన్‌ టెస్టింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అమరావతి డ్రోన్‌ సదస్సులో స్ట్రాటజిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ బిల్డింగ్‌ ఏపీ డ్రోన్‌ ఎకో సిస్టంపై కీలక పత్రంలో ఈ విషయాలను తేటతెల్లం చేస్తోంది. శిక్షణ, సర్టిఫికేషన్, అసెంబ్లింగ్‌ యూనిట్లు, రిపేర్లు, నిర్వహణ సేవలు, ఎకోసిస్టం అభివృద్ధి చెందుతుంది. ఈ సదుపాయాలతో అంకుర పరిశ్రమలు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్‌ సంబంధిత వ్యాపారాలకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్‌ విండో విధానంలో ప్రభుత్వం అందిచటానికి విధి విధానాలను రూపొందిస్తోంది.

ఓర్వకల్లులో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు..

దగ్గరలో ఉన్న కర్నూలు విమానాశ్రయంలోని రన్‌వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకోవచ్చు. డ్రోన్‌ తయారీ పరిశ్రమలకు అవసరమైన అనుబంధ కంపెనీల ఏర్పాటుకు పది వేల ఎకరాల వరకు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌- బెంగళూరు నగరాలకు దగ్గరగానూ ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసే సంస్థలకు అనుమతులన్నీ ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించడం వల్ల డీజీసీఏ అనుమతులు అక్కర్లేదు. ఏపీలో ఇతర ప్రాంతాల్లోనూ డ్రోన్‌ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులివ్వనున్నారు. అయితే అవసరమైన డీజీసీఏ, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతులు, ఇతర లైసెన్సులు వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. డ్రోన్ల రంగంలో మన దేశ వాటా కేవలం 3 శాతం దీన్ని కనీసం 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో రానున్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వ విధానాలు రూపొందిస్తోంది.

ఐదేళ్లలో రూ.6000ల కోట్ల లక్ష్యం

డ్రోన్ల వినియోగానికి విస్తృత అవకాశాలున్న మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా రంగాలను కీలకంగా భావిస్తోంది 'విభిన్న రంగాలు, ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగం, ప్రోత్సాహకాలు, కృత్రిమ మేధతో అనుసంధానం, తయారీ రంగాన్ని ప్రోత్సహించే వాణిజ్య విధానం వంటివి అందుబాటులోకి తేవడం. తద్వారా డ్రోన్‌ అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాలని యోచి స్తోంది. ఏపీలో డ్రోన్ల రంగం ద్వారా ఐదేళ్లలో ఆరువేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ రంగం లో వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్‌ పాలసీని ప్రకటించింది. వివిధ రంగాలలో డ్రోన్ వినియోగం వల్ల ఆనేక అంకుర సంస్థలు వీటిని తయారు చేయడానికి ముందుకు వస్తున్నాయి వాటికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన విడిభాగాల తయారీ నిర్వహణ వంటి కార్యకలాపాల ద్వారా అంకుర సంస్థలు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. దీని ద్వారా ఉపాధి కల్పన కలుగుతోంది. వివిధ పరిశ్రమలలో డ్రోన్‌ల వినియోగం వల్ల సామర్థ్యాలు మెరుగుపడటమే కాకుండా పెట్టుబడి పెరుగుదల నూతన ఆవిష్కరణకు దోహదపడుతున్నాయి.

డ్రోన్ వినియోగం పెరిగింది!

వ్యవసాయ రంగంలో, డ్రోన్ల ఉపయోగం ఖచ్చితమైన వ్యవసాయానికి అమూల్యమైన సాధనాలుగా మారాయి. పంట పర్యవేక్షణ, నేల విశ్లేషణ కోసం వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం వ్యవసాయ నిర్వహణ మెరుగుపడింది. రైతులు నిర్ణయాలు తీసుకోవడానికి, నీటిపారుదల పద్ధతులను మెరుగు పరుచుకోవడానికి, సామూహిక సత్యరక్షణ చర్యలకు రైతులు తాజా డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు, మరింత స్థిరమైన, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులకు డ్రోన్‌లు దోహదపడుతున్నాయి. ఇంధన రంగం, ముఖ్యంగా చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు, వాణిజ్య డ్రోన్ వినియోగంలో గణనీయమైన పెరుగుదలను సాధించింది. ముఖ్యంగా ఆఫ్‌షోర్ విండ్ టర్బైన్‌లు లేదా రిమోట్ పైప్‌లైన్‌ల వంటి కష్టతరమైన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల తనిఖీ కోసం డ్రోన్‌లు ఉపయోగించబడతాయి.

సుధాకర్ వి

99898 55445

Tags:    

Similar News