ఈ సెలవు కాలానికి పూర్తి జీతం..

అర్థ జీతం సెలవు కాలానికి పూర్తి వేతనం ఆశ్చర్యంగా ఉందా..? అయితే తెలుసుకోండి. ఆరు రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, ఆరు నెలల అర్థ జీతం

Update: 2024-10-24 00:45 GMT

అర్థ జీతం సెలవు కాలానికి పూర్తి వేతనం ఆశ్చర్యంగా ఉందా..? అయితే తెలుసుకోండి. ఆరు రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి, ఆరు నెలల అర్థ జీతం సెలవు కాలానికి పూర్తి జీతం చెల్లించేందుకు ప్రభుత్వం వారు చాలా సంవత్సరాల క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల గురించి చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియక వినియోగించలేకపోయినట్లు తెలుస్తున్నది. సాధారణంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సేవా కాలం క్రమబద్ధీకరణ అయిన తర్వాత, నియామకపు తేదీ నుండి ప్రతి సంవత్సరానికి 20 రోజుల చొప్పున అర్ధ జీతం సెలవు జమ చేస్తారు. ఇట్టి సెలవులను వైద్య కారణాలు, వ్యక్తిగత కారణాల దృష్ట్యా వినియోగించుకోవచ్చును.

పూర్తి వేతనం చెల్లింపు ఎప్పుడు?

అర్ధ జీతం సెలవు కాలంలో మూలవేతనంలో కరువు భత్యం, అలవెన్సులు సగం మాత్రమే చెల్లిస్తారు. అంటే ప్రపోర్షనేట్‌గా చెల్లిస్తారు. అయితే ఎవరైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్షయ, కుష్టు, కేన్సర్, మానసిక జబ్బులు, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికి ఆరు నెలల అర్ద జీతపు సెలవు కాలానికి పూర్తి వేతనం చెల్లించడం జరుగుతుంది. సదరు ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి.

రెగ్యులర్ ప్రభుత్వ టీచర్లందరికీ వర్తింపు..

తెలంగాణ స్టేట్ లీవ్ రూల్స్ 1933 28 బి నిబంధన ప్రకారం ఎన్జీవోలు, 29 బి నిబంధన ప్రకారం లాస్ట్ గ్రేడ్ సర్వెంట్లు క్షయ, కుష్టు వ్యాధులతో బాధపడేవారికి ఆరు నెలల అర్థం జీతం సెలవు కాలానికి పూర్తి జీతం చెల్లిస్తారు. ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 188 ఆర్థిక శాఖ తేదీ 30. 7. 1973 ప్రకారం క్యాన్సర్, మానసిక జబ్బులకు, అట్లే ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 20 ఆర్థిక ప్రణాళిక శాఖ తేదీ 25.1.77 ప్రకారం గుండె జబ్బులకు, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 268 ఆర్థిక , ప్రణాళిక శాఖ తేదీ 29 .10 .1991 ప్రకారం మూత్రపిండాల వ్యాధుల వారికి ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 388 ఆర్థిక, ప్రణాళిక శాఖ తేదీ 6.9.1976 ప్రకారం ఈ సౌకర్యాన్ని వారి వేతనంతో నిమిత్తం లేకుండా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ వర్తింపచేశారు. 

సి. మనోహర్ రావు,

రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

85198 62204

Tags:    

Similar News