విప్లవ కెరటం చంద్రశేఖర్ ఆజాద్

విప్లవ కెరటం చంద్రశేఖర్ ఆజాద్... remembering Revolutionay man Chandrasekhar Azad

Update: 2023-02-25 18:30 GMT

భారత స్వాతంత్ర్య సమరాన్ని 20 శతాబ్దిలో సాయుధ పోరాట బాట పట్టించిన తొలి తరం విప్లవ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. భారతీయుల హృదయాల్లో 92 సంవత్సరాల తర్వాత కూడా సుస్థిర స్థానం పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు. భరత మాతను బంధవిముక్తురాలిని చేయడానికి ఆత్మసమర్పణకు సిద్ధమయ్యాడు తప్ప ప్రాణభీతితో బ్రిటిష్ వారి ముందు మోకరిల్లలేదు.

స్వాతంత్ర సమరంలో పాత్ర

చంద్రశేఖర్ ఆజాద్ పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారామ్ ప్రసాద్ తివారి. 1906 జూలై 23న మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని భవ్రాపట్టణం, నగర పంచాయతీలో పండిట్ సీతారాం తివారీ, జగ్రాణి దేవి దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యను ఝబువా జిల్లాలోని భవ్రా గ్రామంలో, ఉన్నత విద్యను వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో అభ్యసించాడు. చదువులో రాణించలేక తన 13వ ఏట ముంబయికి పారిపోయి ఓ మురికివాడలో కూలీగా పనిచేశాడు. 1919లో జరిగిన ‘జలియన్‌వాలా బాగ్’ దమనకాండ ఆయన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. గాంధీ నేతృత్వంలో ఊపందుకుంటున్న “సహాయ నిరాకరణోద్యమం”లో తన 15 వ యేటనే చురుగ్గా పాల్గొన్న అజాద్‌ని బ్రిటిష్ వారు నిర్భంధించి కోర్టులో ప్రవేశ పెట్టారు. మేజిస్ట్రేట్ ప్రశ్నకు బదులుగా తన పేరు ‘ఆజాద్’ (స్వేచ్ఛ), తండ్రి పేరు ‘స్వాతంత్రం’ అని, తాను నివసించేది జైల్లో అని నిర్భయంగా చెప్పాడు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 15 రోజుల జైలు, పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించారు.

సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీజీ 1922లో తాత్కాలికంగా విరమించిన నేపథ్యంలో విప్లవాన్ని మరింత ముమ్మరం చేయాలన్న ఉద్దేశంతో జైలు నుంచి విడుదల అయిన తర్వాత భగత్ సింగ్, రాజ్‌గురు, పండిత రామ్‌ప్రసాద్‌లతో కలిసి పనిచేశాడు అజాద్. వీరి నాయకత్వంలో ఏర్పడిన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు ఆయన ముఖ్య వ్యూహకర్తగా పనిచేశారు. సంస్థను పునర్వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. భగత్‌సింగ్, శివరామ్ రాజ్ గురులతో కలిసి లాలా లజపతి రాయ్‌‌పై లాఠిఛార్జికి ఆదేశించి ఆయన మరణానికి కారణమైన సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను పోలీస్ స్టేషన్‌ నుండి బయటకు వచ్చే సమయంలో హతమార్చాలని పథకం రచించాడు. కాగా జేమ్స్ స్కాట్ ను గుర్తించడంలో విఫలమై అతడికి బదులుగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ జాన్ శాండర్స్‌ను 17 డిసెంబర్ 1928 న హతమార్చారు.

కాకోరి రైలు దోపిడీ

1925 ఆగస్టు 9న బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన 8 వేల రూపాయలను ఒక ప్రత్యేక రైలులో షాజహాన్‌పూర్ నుండి లక్నోకు తరలిస్తుండగా విప్లవకారులు చైన్ లాగి రైలును ఆపి దోచుకుని లక్నోకు పారిపోయారు. ఈ సందర్భంగా వారు జరిపిన కాల్పులలో ప్రమాదవశాత్తు ఒక ప్రయాణికుడు మరణించడంతో దానిని బ్రిటిష్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి స్వరణ్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, దుర్గా భగవతి చంద్ర వోహ్రా, రోషన్ సింగ్, సచీంద్ర బక్షి, చంద్రశేఖర్ ఆజాద్, విష్ణు శరణ్ డబ్లిష్, కేశవ్ చక్రవర్తి, బన్వర్ లాల్, ముకుందా లాల్, సచీంద్ర నాథ్ సన్యాల్, మన్మథ నాథ్ గుప్తాలను నిర్భందించారు. ఆధారాలు లేకపోవడంతో 15 మందిని విడుదల చేశారు. తుది తీర్పు ఏప్రిల్ 6, 1927న వెలువడింది. అయితే చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు.

ఆత్మాహుతి

1931 ఫిబ్రవరి 27న ఉదయం చంద్రశేఖర్ ఆజాద్ తన విప్లవ మిత్రుడు సుఖ్‌దేవ్‌ను కలుసుకోవడానికి అలహాబాదు లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు వస్తున్నట్లు ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ పార్కును చుట్టుముట్టారు. తనను నిర్భందించడానికి వచ్చిన వారిలో ముగ్గురు పోలీసులను కాల్చి చంపాడు. సుఖ్‌దేవ్ అక్కడ నుంచి తప్పించుకునే వరకు వారితో వీరోచితంగా పోరాడిన అజాద్ తాను తప్పించుకోవడం అసాధ్యమని గుర్తించి తన రివాల్వర్‌తో కణతపై కాల్చుకుని అమరుడయ్యాడు. దేశ విముక్తి అనంతరం ఆ పార్కుకు 'చంద్రశేఖర్ ఆజాద్ పార్కు'గా నామకరణం చేసారు.

“చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల తూటాలకు ఈ ఆజాద్‌ భయపడడు” అంటూ అజాద్ చేసిన నినాదం జాతీయోద్యమ కాలంలో బహుళ ప్రాచుర్యం పొందింది. “విజయమైనా, మరణమైనా తుది తీర్పు వచ్చేవరకు మా పోరాటం కొనసాగుతుంది” అని నిర్భీతిగా పలికిన ధీరుడాయన. “మీ నరాల్లో ఇంకా రక్తం సలసల మరగకపోతే అది సాధారణమైన నీటితో సమానం. మాతృభూమికి సేవ చేయలేని యవ్వనం ఎందుకు” అని యువతరాన్ని ఉద్దేశించి ఆయన సంధించే ప్రశ్న సూటిగా వారి గుండెలను తాకేది. దేశ స్వాతంత్ర్యం కోసం అలవోకగా ప్రాణత్యాగం చేసిన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కమాండర్-ఇన్-చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ని నేడు ఆయన 92 వర్ధంతి సందర్భంగా స్మరించుకుని నివాళులర్పించడం భారతీయులందరి కర్తవ్యం.

(ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి)

యేచన్ చంద్రశేఖర్

8885050822

Tags:    

Similar News