తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్

తన జాతి అస్తిత్వం ఏకైక లక్ష్యంగా జాతిని జాగృతి చేస్తూ, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, సమాజ దుఃఖాన్ని తన దుఃఖంగా మలుచుకుంటూ..

Update: 2024-06-21 01:00 GMT

తన జాతి అస్తిత్వం ఏకైక లక్ష్యంగా జాతిని జాగృతి చేస్తూ, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, సమాజ దుఃఖాన్ని తన దుఃఖంగా మలుచుకుంటూ, ఎటువంటి ప్రలోభాలకు లొంగక ఆరు దశాబ్దాల పాటు ఉద్యమ జ్వాలను ఆరిపోనివ్వకుండా తన అక్షర స్వేదాన్ని, వాక్‌పటిమను వాద్యంగా మార్చి నీళ్ల నుండి నిప్పును పుట్టించి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. ఆ జాతికి జాతిపితగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. అలా తెలంగాణ తల్లి గర్భ శుక్తి ముక్తాఫలంగా లభించి తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల హృదయాంతరాలచే ప్రశంసలందుకున్న వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్. పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణాది అనే వాక్యాలు సరిగ్గా సరిపోయిన ఏకైక వ్యక్తి ఆచార్య జై శంకర్ సార్.

తెలంగాణ చరిత్రలో పోరాట యోధులు ఎవరి పేరు వారు లిఖించుకున్నా కానీ చరిత్ర మొదటి పుటపై యావత్ తెలంగాణ లోని నాలుగు కోట్ల ప్రజలు ముక్తలేఖినితో సువర్ణాక్షరాలతో రాసిన పేరు ఆచార్య జయశంకర్ సార్. ప్రగతిశీల, ప్రజాతంత్ర, సామాజిక, బహుజన వామపక్ష ఉద్యమాలను తన రెండు చేతులతో ఆహ్వానించే చైతన్యం గల కాకతీయ పోరుగడ్డ వరంగల్లు లోని అక్కంపేటలో ఉలి, బాడిస రంపపు శబ్దాల మధ్య 1934 ఆగస్టు 6న తెలంగాణ జాతిని జాగృతం చేస్తూ ఒక గొంతు శ్రీకారం చుట్టుకొని పిడికిలి బిగించింది. కాల క్రమంలో అది యావత్ తెలంగాణ పరివ్యాప్తమై మూడు తరాలుగా వేల గొంతులను సృష్టించి లక్షల పిడికిళ్లు పైకెత్తేలా చేసి జై తెలంగాణను రణనినాదంగా మార్చి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను విజయపథం వైపు నడిపించిన మహోన్నత వ్యక్తిగా పరిణమించింది.

ఆరు దశాబ్దాలుగా వీడని నినాదం

1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలోనూ, నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలోనూ పాల్గొన్న యువ కెరటం 1969లో తొలిదశ ఉద్యమంలో తదుపరి 1996లో మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఫసల్ అలీ కమిటీ నుండి శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణపై ఏర్పడ్డ ప్రతి కమిటీకి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై గణాంకాలతో సహా నివేదిక నందించిన మహోపాధ్యాయుడు. విశ్రాంతి లేకుండా నిరంతరం భావజాల వ్యాప్తిలో తలమునకలై ప్రజలను చైతన్య పరుస్తూ తెలంగాణ ఆశావహులను ఏకీకరణ చేస్తూ లక్ష్య సాధన కోసం 'తెలంగాణలో ఏం జరుగుతోంది' 'తెలంగాణ ఒక డిమాండ్ వక్రీకరణలు, వాస్తవాలు', 'తల్లడిల్లుతున్న తెలంగాణ' వంటి అనేక పుస్తకాలను రాసి ప్రజలను చైతన్య పరిచిన అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు.

శూన్యతను భర్తీ చేసిన సిద్ధాంతవేత్త

సహజంగా తెలంగాణలో ఎవరినైనా అన్నా అని పిలిచే సంప్రదాయం ఉంటుంది కానీ తెలంగాణను తరగతి గదిగా చేసుకొని ప్రజలకు తెలంగాణ ఆవశ్యకత బోధించిన గురువు కనకే యావత్ తెలంగాణ ఆయనను సార్ అని పిలుస్తూ తెలంగాణ సిద్ధాంతకర్తగా గౌరవిస్తుంది. ఒకటి రెండు రాజకీయ పార్టీలు మినహాయించి అన్ని పార్టీలను కలిసి సావధానంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను వినిపించి వారిని ఉద్యమంలో భాగస్వామిగా మలచడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం, అనితరసాధ్యం. ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్‌యూ వరకు అన్ని వర్గాలను తెలంగాణ బాట నడిపించిన ధీశాలి. భావజాలం, ఉద్యమం, రాజకీయం సమాంతరంగా నడవాలని భావించాడు. భావజాల వ్యాప్తి ఉద్యమం బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా స్తబ్దతగా ఉండటం సార్ జీర్ణించుకోలేకపోయారు. ఆ క్రమంలోనే ఆ రాజకీయ శూన్యతను పూర్తి చేయడంలో సఫలీకృతుడైనాడు. అయితే, 2011 జూన్ 21న తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా కనులు తెరవకముందే జయశంకర్ సార్ కనుమూయడం దురదృష్టకరం,

జయశంకర్ సార్ ఆశయాలు

జయశంకర్ సార్ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కోరుకోలేదు. విడిపోవడం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని తెలిపేవారు. తెలంగాణ కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని ఇది ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విముక్తి సమస్య అనీ, అన్నింటికీ మించి ఇది ఒక ఆత్మగౌరవ సమస్య అనీ నినదించారు. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యేలా, నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదాన్ని ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయేలా తీసుకెళ్లారు. వనరుల పంపిణీలో జరిగిన దోపిడీని గణాంకాలతో వివరించడమే కాకుండా దానిని ఏ రకంగా సవరించడం సాధ్యమవుతుందో వివరించారు. రాష్ట్రం ఏర్పడితే జీవనదులైన కృష్ణ, గోదావరి జలాల్లో మన వాటా మనకు దక్కుతుందని న్యాయబద్ధంగా రావలసిన వాటా వస్తే తెలంగాణలో ఒక కోటి ఎకరాలు సస్యశ్యామలమవుతాయని, ప్రతి గ్రామానికి తాగునీరు అందుతుందనీ భావించారు. అటవీ సంపద, బొగ్గు సున్నపురాయి గ్రానైట్ వంటి ఖనిజ సంపదలు ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగించబడితే ఆర్థిక స్వావలంబన సాధనలో దేశంలోని మొదటి రాష్ట్రంగా విరాజిల్లుతుందని ఆశించారు.

సామాజిక తెలంగాణ కోసం పరితాపం

సామాజిక ఉద్యమాలను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్యం ప్రతి వ్యక్తికి అవసరమని తెలంగాణ ఏర్పాటు అయితే అట్టడుగు వర్గాలు తల ఎత్తుకొని జీవించే స్థితిని పొందుతారని సామాజిక న్యాయం పరిఢవిల్లుతుందని లేని పక్షంలో సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ పరిశ్రమలకు కేంద్రంగా విలసిల్లాలని, ఉత్పత్తి వర్గాల శ్రమను దోపిడీ చేసే దళారీ వ్యవస్థలు లేకుండా మెరుగైన జీవనం గడపాలని తెలంగాణ ఒక మానవీయ తెలంగాణగా ఏర్పడాలని ఆశించారు. సార్ ఆశయాలు అనునిత్యం మనకు స్పురణకు రావాలి. తెలంగాణ ఉన్నంతవరకు ఈ మట్టి బిడ్డలు ఆయనను మాత్రమే తెలంగాణ జాతిపితగా గుర్తిస్తారు. సార్ ఆశయసాధనలో భాగస్వామి కావడమే మనం జయశంకర్ సార్‌కి ఇచ్చే ఘనమైన నివాళి.

(నేడు ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి)

ములక సురేష్

94413 27666

Tags:    

Similar News