ఆదివాసీల బతుకు పుస్తకం..

Remembering Prof. Biyyala Janardhan Rao Who was Telangana Activist

Update: 2024-02-27 00:45 GMT

అప్పుడే ఇరవై రెండేళ్ల కాలం గడిచిపోయింది. ఆరోజు ఫిబ్రవరి 27, యావత్ తెలంగాణ ప్రజలకు దుఃఖం మిగిల్చిన రోజు. ఆంధ్ర పాలకులపై అంతర్జాతీయ స్థాయిలో ఆదివాసుల ఆపద్బాంధవుడిగా అడుగు వేసి ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో అడుగుల సవ్వడితో, సంకలో సంచితో, విశ్వవిద్యాలయం నుండి అడివంతా కలియతిరిగి ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం సంఘర్షణలో, అడవి సంపద ఆదివాసులకే దక్కాలని ఆదివాసి భూములు పరాయీకరణకు 1/ 70 చట్టాన్ని నిలదీసి నిగ్గుతేల్చి.. తెలంగాణ నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే దక్కాలన్న నినాదంతో బతుకు సంఘర్షణను నాలుగు కోట్ల ప్రజలకు కొట్లాట నేర్పిండు డా. బియ్యాల జనార్దన్ రావు.

జనార్ధన్ బహుముఖం గల మనిషి. అతనిలో ఉన్న స్నేహశీలత, కలుపుగోలుతనం అన్ని లక్షణాల కంటే అత్యంత ముఖ్యమైనవి. సాధారణంగా అనుకూల పరిస్థితులలో వ్యక్తిగా రూపొందించడానికి కుటుంబం ప్రధాన భూమికగా ఉంటుంది. కానీ జనార్ధన్ విషయంలో అలా కాదు సమాజ సమిష్టి కృషి వలన పైకి వచ్చాడు. రైతాంగ కుటుంబం నుండి వచ్చిన వాడై వ్యవసాయమే అనుభవం కాబట్టి.. జనార్ధన్ ఎప్పుడూ తన కృషిని వ్యవసాయంతో పోల్చుకునే వాడు. రైతు నాలుగు రకాల గింజలు వేసి కష్టపడితేనే పంట చేతికి వచ్చినట్టు.. మనం కూడా నాలుగు రకాల పనులు చేస్తూ మన చుట్టూ పిల్లలకు పని కల్పించుదామనుకునేవాడు. ఈ పరంపరలో భాగంగానే అధ్యయనం ద్వారా ఏమీ లేని ఆదివాసీ యువతకు కొంత డబ్బు ఫెల్లోషిప్‌గా ఇచ్చి వాళ్ళ అవగాహన స్థాయిని పెంచే ప్రయత్నం చేసేవాడు.

గిరిజనుల సమస్యలతో పేగుబంధం..

1984లో యూనివర్సిటీ లెక్చరర్‌గా చేరిన తర్వాత విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ప్రత్యేకమైన శైలి ఉండాలని నిరూపించుకున్నాడు. అప్పటినుండి తన జీవితాన్ని పాఠాలు చెప్పడం, పరిశోధన చేయడం, ప్రజా ఉద్యమాలతో దోస్తీ చేయడం అనే మూడు విభాగాలుగా విభజించుకున్నాడు. ఈ విభజనలో ప్రాధాన్యతలు మారాయి గానీ విషయాలు మాత్రం మారలేదు. 80వ దశకంలో పరిశోధనకే ప్రాధాన్యతనిస్తే 90వ దశకంలో ప్రజాస్వామ్య భావజాలం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చాడు. 96 నుండి తెలంగాణ ఉద్యమంలో మునిగిపోయాడు. ఈ మొత్తం నడకలో అధ్యయన ఫలితాలను రాబట్టడానికి వాటిని విద్యార్థులకు ప్రజలకు విడమరచి చెప్పడానికి ఎంతో కష్టపడ్డాడు. పరిశోధకునిగా ఉన్నప్పుడే పౌరహక్కుల ఉద్యమాలకు దగ్గరయ్యాడు. ఇంద్రవెల్లి ఘటనపై నిజనిర్ధారణ చేసిన కమిటీలో సభ్యునిగా వెళ్లి అరెస్ట్ అయ్యాడు. వరంగల్ జిల్లాలో 1982 లో కరువుపై పరిశీలన చేసిన బృందంలో జనార్ధన్ ఒకరు.

యూనివర్సిటీ ఉపాధ్యాయులు విద్యార్థులకు దూరమైన రోజుల్లో విద్యార్థులకు నిరంతరం అధ్యయనానికి అతి చేరువగా ఉండడమే కాకుండా, ఉపాధ్యాయునిగా తనకు ఉన్న అన్ని అవకాశాలను గిరిజనుల సమస్యలకు కేటాయించి కృషి చేశాడు. ఆదివాసీల జీవితానికి సంబంధించిన వివిధ సామాజిక, ఆర్థిక అంశాలపై నిరంతర పరిశోధన కొనసాగించాడు. కాకతీయ యూనివర్సిటీలోనే గాక అంతర్జాతీయ సదస్సులలో ఆదివాసీల జీవితాలపై పత్ర సమర్పణ చేశాడు. ఇరవై ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో గూడాల్లోని సమస్యల్ని అధ్యయనం చేయడమే కాకుండా పరిష్కార ప్రయత్నాలు చేయడం కూడా పనిగా పెట్టుకున్నాడు. గిరిజనుల బ్రతుకు తెరువుల మీద, వారి ఆరోగ్యం మీద అణిచివేతలమీద ఎన్నడూ వెనుకడుగు వేయలేదు. గిరిజనుల సమస్యల మీద ఆయనకున్న అవగాహన అనుబంధాన్ని గుర్తించిన ఫలంగానే రాజీవ్ ఫౌండేషన్‌లో దక్షిణ భారతదేశం నుండి కేవలం జనార్ధన్‌నే ప్రతినిధిగా ఎంచుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజనుల సమస్యతో పేగు బంధాన్ని పెంచుకున్న వాడైనందున అతని మరణానికి రెండేళ్ల ముందు గిరిజనుల స్వయం ప్రతిపత్తిపై రూపొందించిన ప్రకటన (కోషిమా డిక్లరేషన్)పై సంతకం చేసిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు.

ప్రత్యేక రాష్ట్రమే మార్గమని నమ్మి..

ప్రాంతీయ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఉద్యమాలు నడపడం ప్రజాస్వామిక హక్కేనని హక్కుల సంఘాలు వెలిబుచ్చిన అభిప్రాయాలు సొంతం చేసుకొని జనార్ధన్ తెలంగాణ సమస్యకు తెలంగాణ రాష్ట్రమే పరిష్కార మార్గమని నమ్మాడు. రైతు ఆత్మహత్యలు కార్మికుల ఆకలి చావులు, స్త్రీల బలవన్మమరణాలు, ఎన్కౌంటర్ హత్యలు, కోవర్ట్ ఆపరేషన్ ఇవన్నీ ఆంధ్రా పాలకుల పక్షపాత పాలన ఫలితాలని విశ్వసించాడు . తెలంగాణ గత 50 ఏళ్లుగా రక్తం ధారపోస్తున్నది ఈ తెలంగాణ ఇంకా ఇంకా రక్తం ధారపోసేందుకు నెత్తురు లేదు ఇక్కడి ఆకలి చావులు ఆత్మహత్యలు ఇంకా కొనసాగించడానికి వీలు లేదు. దీనికి కారణం నీళ్లు, నిధులు, ఆంధ్రాలో ఖర్చు చేయడమే ఇక్కడి వనరులపై నీళ్లపై, నియామకాలపై తెలంగాణ ప్రజలకు నిర్ణయాధికారం వస్తే తప్ప ఈ మారణహోమం తెల్లారదని ఇందుకు ప్రత్యేక రాష్ట్రం ఏకైక మార్గమని నమ్మాడు ఈ పనిని సాధించడానికి మేధావులు సంపూర్ణంగా కదలాలని చెప్పడానికి దీనిని కట్టుబడి విరామం లేకుండా కదిలించడానికి ప్రయత్నించాడు.

జనార్ధన్ 1999 నుండి 2001 వరకు ఈ మూడేళ్లు కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అధ్యాపకుల దృష్టిలో జనార్దన్‌ది అగ్రస్థానం ప్రజలు ఏమి కోల్పోయారో, ఎలా కోల్పోయారో వివరించడానికి వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడం విశ్లేషించడం ఉపన్యసించడం, చర్చించడం నిర్మాణాలు ఏర్పరచడం, సమన్వయ పరచాలంటే ఉద్యమరూపాలలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు చేయగలిగితే జనార్ధన్ అన్నింటిని చేయడానికి శ్రమించి చెమటోర్చినోడు. ఇలా అందరి తలలో నాలుకై తెలంగాణ జనగానమై ఆదివాసి పల్లె కన్నీరు కారుస్తుందని ఊహించని జనార్దన్ దూరమై నేటికీ ఇరవై రెండేళ్లు. గడిచిన ఆదివాసి బతుకు పుస్తకమై తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తినిచ్చాడు.

(నేడు డా. బియ్యాల జనార్దన్ రావు వర్ధంతి)

- శోభ రమేష్

89786 56327

Tags:    

Similar News