మూగబోయిన ఉద్యమ గళం

ఆయన పాట వింటే ఒళ్లు పులకిస్తుంది. ఆయన పాట వింటే రక్తం మరుగుతుంది. ఆయన పాట వింటే బిగిసిన పిడికిలి ఎగిసిపడుతుంది. ఆయన పాట వింటే

Update: 2024-06-29 00:30 GMT

ఆయన పాట వింటే ఒళ్లు పులకిస్తుంది. ఆయన పాట వింటే రక్తం మరుగుతుంది. ఆయన పాట వింటే బిగిసిన పిడికిలి ఎగిసిపడుతుంది. ఆయన పాట వింటే ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది. ఆయన పాట వింటే జనం రణం చేయగ దండై కదులుతారు. ఇంతటి చైతన్యవంతమైన ఉద్యమ గొంతుక మూగబోయింది. ఇంతటి ప్రజాదరణ పొందిన గళం అర్ధాంతరంగా ఆగిపోయింది. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా యుద్ధ వీరుల త్యాగాల ముల్లెను సంగీత సంపదగా తన తలపై ఎత్తుకొని నెత్తుటి సాళ్లల్లో విత్తనమై మొలకెత్తి విరబూసిన పాటల పూదోట సాయిచందన్నకు మాయదారి గుండె పోటు వచ్చి నేల రాల్చింది. నేల రాలిన లాల్ నీల్ మిశ్రమ వర్ణాలతో పుష్పించిన ఆ పువ్వును మరణం ముద్దాడింది. యావత్ తెలంగాణ ప్రజా, కళా ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తింది.

అప్పుడప్పుడే తెలంగాణ మలిదశ ఉద్యమం రాజుకుంటున్న సమయంలో సాయిచంద్ అన్న పాట ఉద్యమానికి ఆజ్యం పోసి ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. అన్న పాలమూరు జిల్లాకు చెందిన అమరచింత గ్రామంలో 1984 సెప్టెంబర్ 20న మనెమ్మ, వెంకట్రాములు దంపతులకు జన్మంచాడు. అమ్మ ఒక బీడీ కార్మికురాలు, నాన్న ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి. కమ్యూనిస్టు ఉద్యమాలతో మంచి సంబంధాలు కలిగిన నాయకుడు. అందుకు ఎర్రజెండా పాటలు పాడటమే కాదు, ప్రజా ఉద్యమాలలో మమేకమై తిరిగేవాడు. ఆ వారసత్వమే అన్నను ప్రజా ఉద్యమ గాయకునిగా ఎనలేని ప్రతిష్టలతో నిలబెట్టగలిగింది. పీజీ చదువుకున్న సాయి విద్యార్థి దశ నుంచే కళాకారుడిగా గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

లక్షలాది మందిని కదిలించి...

ప్రగతిశీల విద్యార్థి సంఘంలో ఉంటూ విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు అరుణోదయ సాంస్కృతిక కళాకారుల్లో ఒక్కడిగా చేరి అధ్యయనం ఆచరణల మిళితంగా గద్దర్, అరుణోదయ రామారావు, గోరటి వెంకన్న, విమలక్క, నాగన్న లాంటి ఎంతో మంది అందించిన చైతన్య స్ఫూర్తి మార్గంలో పాటలోని మర్మాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే నాడు ఉద్యమ కాలంలోనూ, నేడు బీఆర్ఎస్ పార్టీ సభల్లోనూ లక్షలాది జనాన్ని గంటల తరబడి కదలకుండా తన పాటల పగ్గాలతో కట్టిపడేసేవాడు. దాదాపు మూడు వేల పాటలు పాడగలిగాడు. తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు ప్రజల మనసులను చూరగొనేటటువంటి జానపద పాటలను పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పాలమూరు ప్రాంతంలో పుట్టిన బిడ్డగా పాలమూరు కరువు పాటలను వలస గీతాలను స్వయంగా రాసి పాడేవాడు. అలాగే ఇతరులు రాసినవి తన గాత్రంతో ఆ పాటలకు ప్రాణం పోసేవాడు. గాయకుడిగా తన ప్రయాణం ప్రారంభించిన తొలినాళ్లలో 'ఏరంచు ఊరు మా ఊరు పాలమూరు' అంటూ... గాజుల లక్ష్మీనారాయణ రాసిన పాట పాడటంతోనే ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది.

రణక్షేత్రంగా మార్చిన పాట

2008 మొదలు మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాట కాలంలో కార్యకర్తగా కళాకారుడిగా పాటల రచయితగా చాలా చురుగ్గా పాల్గొన్నాడు. అంతే కాదు తన కంచు కంఠంతో ఉద్యమ పాటలను పాడి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్య పరిచాడు. మిట్టపల్లి సురేందర్ విప్లవ నేపథ్యంలో రాసుకున్న ఓ పాటను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సందర్భంలో పాడటానికి సాయిచంద్ కోరగా, వెంటనే మిట్టపల్లి సురేందర్ ఆ పాటలో స్వల్ప మార్పులు చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం మంటల్లో నిలువునా కాలి బూడిదైన శ్రీకాంతాచారి మరణానంతరం 'రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా' అంటూ... మార్చి రాసి ఇచ్చాడు. ఈ పాటను తన గొంతుతో పాడిన సాయిచంద్, తెలంగాణ ఉద్యమ రూపాన్ని తారస్థాయికి తీసుకెళ్లి యావత్ తెలంగాణ ప్రాంతాన్ని రణక్షేత్రంగా మార్చగలిగాడు.

బతుకు గోసను గానం చేసిన గొంతు

గోసి గొంగడితో కాలికి గజ్జెలు కట్టి ఊరూరూ తిరిగి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడమే కాకుండా కళాకారుడిగా ఎన్నటికీ చెరిగిపోలేనీ తనదైన ముద్రను వేసుకున్నాడు. 'మదమోహం ముదిరిన మృగాల వేటలో/ ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళ ఆటలో/ భారతావని బంగారు బొమ్మలు/ మానవాళికి జన్మనిచ్చు అమ్మలు/ బలవుతున్నరు లేడి పిల్లలు/ ఊపిరోదులుతున్నరు మన ఆడ పిల్లలు/ అంటూ... దేశంలో ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలను, అవమానాలను సాయిచంద్ ఆలపించిన తీరు వింటే ఆలోచింప చేయడంతో పాటూ కంటతడి పెట్టిస్తుంది. కష్టాలను కన్నీళ్లను కడుపులో దాచుకుని చిరునవ్వు చిందించే నాన్న మీద ప్రేమతో 'నాన్నా నాన్నా నాన్నా నీ మనసెంత మంచిదో నాన్నా/ నాన్నా నాన్నా నాన్నా/ నీ ప్రేమెంత గొప్పదో నాన్నా' అంటూ... నాన్న గొప్పతనాన్ని రాసి పాడిన పాట విన్న ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించగలిగాడు. పల్లె మట్టి పరిమళాల వాసనతో మమేకమై పెరిగిన సాయిచంద్ ప్రకృతి మీద అనేక పాటలు రాశాడు, పాడి రంజింప చేస్తూ మెప్పించాడు. మట్టి మనుషుల ఎట్టి బతుకుల గోసలను గానం చేశాడు.

చరిత్రకెక్కిన గళం

రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి తన పాటలతో చాటి చెప్పారు. 2021 డిసెంబర్‌లో తెలంగాణా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి కొనసాగిన సాయిచందన్న పాట మాట రెండూ అలుపెరుగని ప్రవాహంలా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండేవి. పాట మధ్యలో ప్రసంగం ప్రసంగం మధ్యలో పాటలతో ప్రజలను తట్టి లేపుతూ ఉర్రూతలూగించేవాడు. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యను 'ఎవ్వడు చెప్పిండుర మీరెక్కువ జాతోళ్లని, ఏడా రాసిండుర మేము తక్కువ జాతోళ్ళని' అంటూ... కుల గజ్జితో కుల్లిపోతున్న కులవాదుల కూకటి వేళ్లను సైతం కబళించి వేసేటటువంటి ఒక శాస్త్రీయమైన ప్రశ్న వేయగలిగిన గళం అనంత రాగమై ఉద్యమించిన స్వరం ఉన్నట్టుండి మూగబోయింది. తెలంగాణ చరిత్రలో సాయిచంద్ ప్రస్థానం ఒక కొత్త అధ్యాయం. ఆయన మరణం యావత్ తెలంగాణ సమాజానికి తీరని నష్టం. పాటల పతాకమై రెపరెపలాడిన గొంతులో మళ్లీ ఓ పాట వినాలని ఆశ... నీతో వంత పాడాలని ఆశ.

(నేడు సింగర్ సాయిచంద్ మొదటి వర్ధంతి)

- ఎనుపోతుల వెంకటేష్

95733 18401

Tags:    

Similar News