ప్రజా వీరుడు సాయన్న

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలోని ఉద్య మాలు, నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు ఒక సమాంతర చరిత్ర. ఈ సమాంతర చరిత్రలో

Update: 2024-12-10 00:45 GMT

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలోని ఉద్య మాలు, నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు ఒక సమాంతర చరిత్ర. ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వాడు పండుగ సాయన్న. పండుగ సాయన్న 18వ శతాబ్ధం చివరలో జీవించిన “ప్రజా వీరుడు.”. పేద ప్రజలకు దానధర్మాలు చేసిన కర్ణుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా, ప్రజా వీరుడుగా తెలుగు ప్రజలకు సుపరిచితుడు.

అన్యాయాలను చూసి..

ప్రజలను వెట్టి చాకిరి పేరుతో హింసిస్తూ, అక్రమ పన్నులను వసూలు చేస్తూ, ప్రజల మాన ప్రాణాలను హరిస్తున్న దుర్మార్గుల ఆట కట్టించాడు. ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను ప్రశ్నిస్తూ, వారికే సవాళ్ళుగా మారి, తన సొంత పాలన ద్వారా నూతన వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయ త్నం చేశాడు. కరువు కాలంలో ప్రజలు కష్టపడి పండించిన పంటలను సైతం, స్థానికంగా ఉన్న దొరలు ఏదో ఒక సాకుతో జప్తు చేసేవారు. అలాగే సాయన్న పంటను కూడా, దొరలు జప్తు చేశారు. పైగా తమ అనుమతి లేకుండా పంట పొలంలో బావి తవ్విండని నేపంతో సాయన్న తండ్రిని స్థంభానికి కట్టేసి కొట్టారు. ఈ అన్యాయాలను, అవమానాలను చూసిన సాయన్న కోపంతో ఊగిపోయి వారిని ఎదిరించటానికి సాయుదడయ్యాడు. కొంతమంది స్నేహితులతో కలిసి సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

నేటికి మర్చిపోకుండా..

భూస్వాములు, దొరలు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జంగు జలాల్ ఖాన్ మీనుసాబ్ ఆధ్వర్యంలో కుట్ర పన్ని, పండుగ సాయన్న దళంలోని ద్రోహులను పంపించారు. వారి సాయంతో నిజాం సైన్యం సాయన్నను చుట్టిముట్టి అరెస్ట్ చేశాయి. నిజాం సర్కారు ప్రజల డిమాండ్‌కు తలవంచి ‘మార్ మత్ చోడో’ (చంపకండి వదిలేయండి) అని హుకుం జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులను మార్చి మరణశిక్ష విధించారు. 1890 డిసెంబర్ 10న సాయన్న తలనరికి, జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న తిర్మల దేవుని గుట్టపైకి విసిరేశారు. తమ నాయకుడు ప్రాణాలతో లేడనే విషయం తెలుసుకున్న ప్రజల దుఖాన్ని చూసి రాళ్లగుట్ట సైతం రోదిం చింది. పండుగ సాయన్న కథను నేటికీ దర్శనం మొగులయ్య వంటి బిక్షుక గాయ కులు 12 మెట్ల కిన్నెరపై వీరోచితంగా గానం చేస్తారు. పండుగ సాయన్న మరణించిన రోజును మర్చిపోకుండా వేలాదిమంది ఆయన సమాధి దగ్గరకొచ్చి నివాళులర్పిస్తారు. సంచార జాతుల, దళిత, బహుజన కళాకారులు ఊరూరా తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేస్తారు.

(నేడు పండుగ సాయన్న 134వ వర్ధంతి)

డాక్టర్. వై. శివ ముదిరాజ్

హైద్రాబాదు సెంట్రల్ యూనివర్శిటీ

99632 40519

Tags:    

Similar News