యుద్ధ వీరుడు కాన్షీరాం

Remembering Kanshi Ram on his Birth Anniversary

Update: 2024-03-15 01:00 GMT

భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను భూకంపాన్ని సృష్టించి సామాజిక రాజకీయ సాంస్కృతిక సమానత్వానికి పునాది వేసిన సామాజిక సమానత్వ సిద్ధాంతకర్త కాన్షీరాం. పంజాబ్ రాష్ట్రంలోని రోపార్ జిల్లా కవాస్పూర్ గ్రామంలో జన్మించిన కాన్షీరాం 1956లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి తదనంతరం డెహ్రాడూన్‌లోని భారతీయ భూ వైజ్ఞానిక సర్వే విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ పోటీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై డిఫెన్స్ లేబరేటరీలో ఉద్యోగాన్ని సంపాదించాడు.

బహుజన సమాజమే కుటుంబంగా..

1958లో పూనా పట్టణంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ ఎక్స్ ప్లోసివ్స్ సంస్థలో పరిశోధనకారిగా కాన్షీరాం నియమించబడ్డాడు.

కాన్షీరాం జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు రెండు. ఒకటి తన సహ ఉద్యోగి గైని అంబేడ్కర్ మరణ వార్త విని ఏడవడం, రెండవ సంఘటన 1963లో కాన్షీరాం ఉద్యోగం చేస్తున్న సంస్థలో అంబేడ్కర్, బుద్ధ జయంతి సెలవు దినాలను రద్దు చేయడం. ఈ రెండు సంఘటనల వలన కాన్షీరాం అంబేద్కర్ సిద్దాంతం పట్ల ఆకర్షణకు గురి చేశాయి. తన సహ ఉద్యోగి ఐన డి.కె. ఖపార్డే అంబేడ్కర్ రాసిన కుల నిర్మూలన గ్రంథాన్ని కాన్షీరాంకి ఇచ్చాడు. అది చదివిన కాన్షీరాం అంబేద్కర్ ఉద్యమానికి ఎలాగైనా కొనసాగింపు ఇవ్వాలని నిబద్ధుడై తన జీవితంలో సొంత కుటుంబాన్ని, సొంత ఆస్తిని కలిగి ఉండొద్దని, వివాహం చేసుకోకూడదు అని బహుజన సమాజమే తన కుటుంబంగా నిర్ణయించుకుని 30 పేజీలతో కూడిన ఉత్తరాన్ని రాసి తల్లిదండ్రులకు పంపించాడు.

సైకిలే ప్రధాన సాధనంగా..

ఇక కాన్షీరాం ఉద్యమానికి సైకిలే ప్రధాన సాధనం. సైకిల్ ముందు అంబేడ్కర్ చిత్రపటం పెట్టుకుని, సైకిల్ వెనుక రొట్టెల పెన తగిలించుకొని వివిధ ప్రాంతాలకు వెళ్తూ ప్రజల దగ్గర నుండి గోధుమపిండి అడుక్కొని దారి వెంట రొట్టెలు చేసుకుని అవి తిని ఉద్యోగస్తులనీ, విద్యావంతులని కలుస్తూ అంబేడ్కర్ ఉద్యమాన్ని పరిచయం చేసేవాడు. కాన్షీరాం ఆయన సహచరులు డీ.కే. ఖపర్డే తదితర ఉద్యోగులతో కలిసి 1978 డిసెంబర్ 6న అంబేడ్కర్ మహా పరినిర్యాణం చెందిన రోజున బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(BAMCEF) అనే సంస్థను ప్రారంభించి అంబేడ్కర్ కృషి ద్వారా ఉద్యోగస్తులైన వారు పే బ్యాక్ టూ సొసైటీలో భాగంగా తమ జాతుల కోసం మేధస్సు, మనీ బ్యాంక్, టాలెంట్ అందించాలని ఉద్యోగస్తులకు మార్గ నిర్దేశం చేశాడు. అదేవిధంగా 1981 డిసెంబర్ 6 న బహుజన సమాజాన్ని రాజకీయ పోరాటం వైపు నడిపించడానికి దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి(డీఎస్-4) సంస్థను స్థాపించాడు.

డీఎస్-04 ఏర్పరచి

1932 సెప్టెంబర్ 24 గాంధీ అంబేడ్కర్ మధ్య పూనాలోని ఎర్రవాడ జైల్లో కుదిరిన ఒడంబడికె పూనా ఒప్పందం మూలంగా బాధితులైన వారి పట్ల ఉద్యమించాలని కాన్షీరాం నిర్ణయించుకున్నారు. 1983 మార్చి 15న సైకిల్ మార్చు వందమందితో ప్రారంభమై 40 రోజులలో 3000 కిలోమీటర్లతో ఏడు రాష్ట్రాల్లోని 53 ముఖ్య పట్టణాలు ప్రధాన సెంటర్లో ప్రచారం చేసి అగ్రకుల రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో వివరించారు. దాదాపు 15 ఏళ్ల పాటు బామ్ సేఫ్ మరియు డీఎస్-4 ద్వారా సామాజిక రాజకీయ పోరాటం చేసిన కాన్షీరాం ఇక బహుజన సమాజానికి సొంత పార్టీ ఉండాలనే అవసరతని గుర్తించి అంబేడ్కర్ జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 14 1984 న బహుజన సమాజ్ పార్టీని పెట్టారు. ఓటు హమారా రాజ్ తుమారా నహి చలేగా నహి చలేగా అంటూ అగ్రకుల రాజకీయ నాయకులని భయభ్రాంతులకు గురిచేశాడు. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకపోవడం మూలంగా 50% పైగా ఉన్న బీసీలకు న్యాయం జరుగుతలేదని భావించి మండల్ కమిషన్ అమలు అయ్యేలా ఢిల్లీలో 46 రోజుల పాటు మహాధర్నా చేసి నేడు 27% బీసీ లు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందేలా మహత్తరమైన పోరాటం నిర్వహించాడు కాన్షీరాం.

ఎన్నో విప్లవాత్మక పథకాలు..

తను బతికుండగానే బీఎస్పీని జాతీయ పార్టీగా చేయాలని భావించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తన రాజకీయ వారసురాలుగా మాయావతిని ప్రకటించి ఆమెని ముఖ్యమంత్రిని చేసి అతి తక్కువ కాలంలోనే ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాల్లో, దక్షిణ భారతంలోని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప కాలంలోనే బీఎస్పీ జాతీయ పార్టీ కావడంలో కాన్షీరాం గారి ఎన్నో ఏళ్ల శ్రమ, త్యాగం దాగి ఉన్నది. అలా మాయావతిని ముఖ్యమంత్రి చేసి కాన్షీరాం మహనీయుల పేరుతో అనేక విశ్వవిద్యాలయాలని నిర్మించడమే కాకుండా లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి అతి తక్కువ కాలం లోనే ఎన్నో విప్లవాత్మక పథకాలను కాన్షీరాం వెనుక ఉండి మాయావతి ద్వారా అమలు చేయించాడు.

ఐదు రూపాయలు లేనటువంటి స్థాయి నుండి హెలికాప్టర్ ఎక్కే స్థాయి వరకు బహుజన సమాజాన్ని నిర్మించుకున్న కాన్షీరాం బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ అనారోగ్య కారణంతో 2006 అక్టోబర్ 9 మహాపరి నిర్యాణం చెంది అవిశ్రాంత యోధుడుగా కోట్లాదిమంది బహుజనుల గుండెల్లో అమరుడుగా నిల్చిపోయాడు.

(నేడు కాన్షీరాం 90వ జయంతి)

- పుల్లెంల గణేష్

9553041549

Tags:    

Similar News