తెలంగాణ అనే పదమే నిండు అసెంబ్లీలో నిషేధాజ్ఞకు గురైన రోజుల్లో.. తెలంగాణ ఉద్యమానికి ఉడుము పట్టు అంతటి ఊతమందించినవి 1997లో భువనగిరి, సూర్యాపేటలో జరిగిన సభలు.. కవులు, రచయితలు సాహితీ మిత్ర మండలిగా ఏర్పడి దగాపడ్డ తెలంగాణ పేరుతో భువనగిరిలో జరిగిన ఈ సభలో బెల్లి లలిత తన ఆట, పాటతో ప్రజాకర్షణ పొంది సామాన్య ప్రజానికాన్ని ఉద్యమోన్ముకులను చెసింది. తన గళమే సాయుధమై వలసాంధ్ర పాలకుల అధికార పీఠాలు కదిలిపోయేల నినదించింది. అగ్రకుల అధిపత్యాన్ని తన ఆటపాటలతో ఎండగడుతూ తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో తెలంగాణ గానకోకిలగా వెలుగొందింది.
స్తబ్దంగా ఉన్న తెలంగాణ ఉద్యమానికి
ఆమె చిన్నప్పటి నుంచే, తన తండ్రితో పాటు ఒగ్గు కథలు చెప్పేందుకు వెళ్లేది. దీంతో ఆమె తండ్రి గొంతుతో గొంతు కలపడం, కాలికి గజ్జె కట్టడం సహజమైంది. ప్రాథమిక విద్య పూర్తి చేసేలోపే కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దగ్గరలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులో కూలీ చెయ్యడం తప్పని పరిస్థితి మారింది. ఆ సమయంలో ఆమె సామాజిక రుగ్మతలను చూసి చలించిపోయింది. సారా గుట్కాలకు నవతరాలు బానిసలై తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించడం చూసి నిరాశ చెందింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానాలతో తెలంగాణ గ్రామాల సామాజిక జీవనం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుండడం గమనించి.. అన్న బెల్లి క్రృష్ణకి ఉన్న కార్మిక సంఘాల అనుబంధం, తనకున్న సామాజిక స్పృహతో ‘మహిళా స్రవంతి’ ఏర్పాటు చేసి సారా గుట్కా వ్యభిచార వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభించింది. తన ఆటపాటలతో జనాన్ని కూడగట్టగలిగింది. తెలంగాణలో వెనుకబడిన కులాల ఐక్య పోరాటానికి, అలాగే నాడు స్తబ్దంగా ఉన్న తెలంగాణ ఉద్యమానికి సామాన్య జనాన్ని కూడగట్టి సామాజిక తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి పోసింది.
రాజ్యానికి వణుకుపుట్టి..
భువనగిరి, సూర్యాపేటలో జరిగిన సభల్లో దగాపడ్డ తెలంగాణ బిడ్డలారా మన హక్కులకై పోరు చేద్దాం.. మనల మనం ఏలుకుందాం..అంటూ దండోరా, గొల్ల కురుమ డోలు వాయించి వెనుకబడిన కుల సంఘాలకు పిలుపునిచ్చింది. మన చెమటలె మనకు నదులు.. మన రెక్కలె మనకు పెట్టుబడులు..అంటూ తెలంగాణలో బడుగు, బలహీన కులాల దీన స్థితిని వర్ణిస్తూ యుద్ధ గీతమై, సబ్బండ కులలాకు సాంస్కృతిక సారథ్యమై కదిలింది. అనంతరం వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ సభల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను పాటలు కట్టి సామాన్యుల దరికి చేర్చి వారిని ఉద్యమంలో భాగం చేసింది. తెలంగాణ జనసభకు అనుబంధమైన తెలంగాణ కళా సమితి కన్వినర్‌గా రాష్ట్రమంతా తెలంగాణ గానకోకిలగా గుర్తింపు పొందింది. రాబోయే ఎన్నికల్లో బెల్లి లలిత పోటీలో ఉంటుందనే వార్త నాటి స్థానిక ఎమ్మెల్యేకు, ఉవ్వెత్తున ఎగుస్తున్న తెలంగాణ ఉద్యమం అప్పటి ప్రభుత్వం వెన్నులో వణుకుపుట్టించింది. దీంతో నేరుగా తెలంగాణ ఉద్యమాన్ని, బెల్లి లలితను ఎదుర్కోలేని ప్రభుత్వం కిరాయి గుండాల పేరుతో.. బెల్లి లలితను భౌతికంగా లేకుండా చేసి రెండు బలమైన శక్తులను ఒకేసారి అడ్డు తొలగించుకుంది. రాజ్యమాడిన రాక్షస క్రీడలో పథకం ప్రకారం.. అతి దారుణంగా 17 ముక్కలుగా హత్య చేయపడింది. అంతటితో ఆగకుండా వ్యక్తిత్వాన్ని అవమానించేలా రాజ్యం దొంగ లెటర్‌ని స్రృష్టించడంతో ప్రజల ముందు తనకుతానె దోషిగా నిలపడింది. ఒక్క బెల్లి లలితే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా అంతే దారుణంగా హత్య చేయబడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు దాటిన వారి త్యాగాలను గత ప్రభుత్వం ఏనాడు గుర్తించలేదు,ఈ ప్రభుత్వమైన ఉద్యమకారుల కుటుంబాలను వారి త్యాగాలను గుర్తించాలి.ఏదేమైనప్పటికి సామాజిక ఉద్యమాలకు వెనుకబడిన కుల సంఘాల ఐక్య పోరాటాలకు బెల్లి లలిత పాటలు,మాటలు నిత్య చైతన్యమే..!
(రేపు బెల్లి లలిత వర్ధంతి)
మధు యాదవ్ నూకల
తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ OU కన్వినర్
63033 43359