రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి

భారతదేశంలో తొలిసారిగా నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సాయుధ పోరాట జెండాను చేబూని దేశానికి వేగుచుక్కగా నిలిచింది

Update: 2024-07-04 00:30 GMT

భారతదేశంలో తొలిసారిగా నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సాయుధ పోరాట జెండాను చేబూని దేశానికి వేగుచుక్కగా నిలిచింది తెలంగాణ. ఆ వీరోచిత రైతాంగ సాయుధ పోరాటంలో అడుగు పెట్టి భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరులో రజాకార్ల ముష్కరుల తుపాకీ తూటాలకు నేలకొరిగిన తొలి అమరుడు ‘దొడ్డి కొమరయ్య’ ఈయన వీర మరణం పొంది ఇప్పటికీ 78 ఏళ్లు గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు నేడు తెలంగాణలో సజీవంగా ఉన్నాయి.

వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో 1927లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమురయ్య తెలంగాణ వీరోచిత రైతాంగ ఉద్యమానికే స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. భూమి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరులో రజాకార్ల ముష్కరులు విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన దాడిలో కాల్పుల్లో తుపాకి తూటాకు నేలకొరిగిన అమరుడయ్యాడు దొడ్డి కొమరయ్య. బాంచన్ దొర నీ కాల్మొక్తా అన్న ప్రజలచే బందూకులను చేత బట్టించి దేశ్‌ముఖ్‌లను భూస్థాపితం చేసే పోరాటంలో అమరుడయ్యాడు. ఆయన అందించిన స్ఫూర్తితో దేశముఖ్‌లను అంతమొందించారు. ప్రజల కొమరయ్యగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఎంతోమంది చేసిన బలిదానాలు చరిత్రను నిర్దేశించాయి. ఆ రక్తతర్పణలోనే చరిత్ర నడిచింది. ఆ నెత్తుటి ధారలే సమాజ పురోగతికి రహదారులు నిర్మించాయి.

నాటి ఆర్థిక రాజకీయ సామాజిక విషయాలను నేటి ఆర్థిక రాజకీయ సామాజిక విషయాలతో పోల్చి చూసుకోవడానికి నాటి, నేటి పరిస్థితులపై అంచనాలను నిన్నటి పోరాటపు అనుభవాలను తెలుసుకొనే బాధ్యత ఈనాటి యువతపై ఉంది. తెలంగాణ పోరాటం అంటేనే భూస్వామ్య వ్యతిరేక పోరాటం. తెలంగాణ పోరాటం అంటేనే నిజాం రక్తసిక్త పాలనను ఎదిరించటం. నిన్నటి తెలంగాణ పోరాటం అంటేనే నెహ్రూ సైన్యపు ఊచకోత. మూడువేల గ్రామాల ఇండ్లపై ఎర్రజెండాలు ఎగరేసిన నేల. ఇది పది లక్షల ఎకరాల భూమి తల్లి దాస్య శృఖాలను ఛేదించిన చైతన్యపు పోరాటం. యుద్ధ భూమిలో కేరింతలు కొట్టిన శతృవుని గడగడలాడించిన మరుభూమి. పిల్లపాపలతో సహా ప్రజలందరూ పాలు పంచుకున్న పోరులో మేము సైతం ప్రపంచాగ్నికి ఆహుతౌతామని వచ్చి వీరమరణం పొందిన రత్నాల గురించి, ఆ అనుభవాల గురించి తెలుసుకోవాల్సిన ఈనాటి విద్యార్థి లోకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

(నేడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి)

శోభరమేష్

కాకతీయ విశ్వవిద్యాలయం

89786 56327

Tags:    

Similar News